Dasara దసరా సందడి
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:19 AM
Dasara Festive Fervour దసరాకు ఘనంగా నిర్వహించేందుకు మన్యం వాసులు సన్నద్ధమయ్యారు. గురువారం ఘనంగా పండుగ చేసుకునేం దుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి పూజకు అవసరమైన సామాగ్రి, ఇతర వస్తువుల కొనుగోలుకు బుధవారం మార్కెట్లకు పోటెత్తారు. దీంతో జిల్లాలో ప్రధాన కూడళ్లు, రోడ్లు, పలు షాపులు రద్దీగా మారాయి.
నేడు విజయదశమి
పూజలకు సిద్ధమైన జిల్లావాసులు
పార్వతీపురం/ పార్వతీపురం టౌన్/ పాలకొండ, అక్టోబరు1(ఆంధ్రజ్యోతి): దసరాకు ఘనంగా నిర్వహించేందుకు మన్యం వాసులు సన్నద్ధమయ్యారు. గురువారం ఘనంగా పండుగ చేసుకునేం దుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి పూజకు అవసరమైన సామాగ్రి, ఇతర వస్తువుల కొనుగోలుకు బుధవారం మార్కెట్లకు పోటెత్తారు. దీంతో జిల్లాలో ప్రధాన కూడళ్లు, రోడ్లు, పలు షాపులు రద్దీగా మారాయి. పాలకొండ, కురుపాం నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాగా పూజా సామాగ్రి, పండ్లు, పూల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. పండుగ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా సామాగ్రిని కొనుగోలు చేశారు. పార్వతీపురం పట్టణ ప్రధాన రహదారి రాత్రి 7 గంటల వరకు కొనుగోలు దారులతో కిటకిటలాడింది. జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజల తరలివచ్చి పూజా సామాగ్రి, ఇతర నిత్యవసర సరుకుల కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల తర్వాత వరుణుడు శాంతిం చడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సాలూరు మెయిన్‌రోడ్డులో తరచూ ట్రాఫిక్ నిలిచి పోవడంతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. మరోవైపు వాహనాలను శుభ్రం చేసేందుకు వాహనదారులు వాషింగ్ సెంటర్ల వద్ద క్యూ కట్టారు. దసరా సందర్భంగా జిల్లాలో ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కొందరు వాహనాలకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు. జీఎస్టీ తగ్గడంతో జిల్లాలో వాహన విక్రయాలు పెరిగాయి. విజయదశమి రోజున వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ వాహనాలను వినియోగించనున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా దేవాలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కొండెక్కిన కోడి, మేక, గొర్రెల ధరలు..
ఈ ఏడాది దసరా గురువారం పడినప్పటికీ చాలామంది కోళ్లు, గొర్రెలు, మేకలను మొక్కు బడులుగా చెల్లిస్తుంటారు. అయితే ఇదే అదునుగా కొంతమంది మార్కెట్‌లో కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారు. కిలో నాటుకోడి రూ.1500 నుంచి రూ.1800 ధర పలుకుతుంది. పది కిలోలు పడే గొర్రె, మేకలైతే రూ.12 వేలు వరకు ధర పలుకుతుంది. ఇప్పటికే వివిధ సంతల్లో గొర్రెలు, మేకలు, నాటుకోళ్లన ప్రజలు కొనుగోలు చేశారు. అమ్మవారి పూజకు తప్పనిసరి కావడంతో ఎవరూ వెనుకంజ వేయడం లేదు. కాగా ప్రస్తుత రోజుల్లో నాటుకోళ్ల పెంచడం సాధ్యం కావడం లేదు. ఓ వైపు కోళ్లకు అంతుపట్టని వ్యాధులు , మరోవైపు వీధి కుక్కల బెడద అధికంగా ఉండడంతో పెంపకందారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదే సమయంలో పౌల్ర్టీలో పెంచే వివిధ హైబ్రీడ్ కోళ్లను నాటుకోళ్లుగా చెప్పి పెంపకందారులు కొనుగోలుదారులకు అంట కడుతున్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, తెలంగాణ పౌల్ర్టీలో పెంచిన మేకలు, గొర్రెలను కూడా ఇక్కడకు తెచ్చి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నాటు ఏదో, పౌల్ర్టీలో పెంచిందేదో తెలియక వ్యాపారులు చెప్పిన ధరలకే వినియోగదారులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
నేడు సాలూరులో మాంసం విక్రయాలు బంద్
సాలూరు రూరల్: సాలూరు మున్సిపల్ మార్కెట్‌లో గురువారం మాంసం విక్రయాలు నిలిపివేయాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్‌పెక్టర్ ఎల్.బాలకృష్ణ బుధవారం ఆదేశించారు. గురు వారం గాంధీ జయంతి కావడంతో మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎటువంటి మాంసం విక్రయాలు చేపట్టదారని వ్యాపారులకు ఆదేశాలిచ్చినట్టు ఆయన తెలిపారు. వాస్తవంగా ఏటా దసరా రోజున సాలూరులో కోటి రూపాయలకు పైబడిన చేపలు, మాంసాహారం విక్రయాలు జరుగు తాయి. అయితే ఈ సారి గాంధీ జయంతి, దసరా ఒకే రోజు పడడంతో మాంసాహార విక్రయదారులకు బ్రేక్ పడింది. మొక్కులు చెల్లించే వారికి కూడా పెద్ద సమస్యే వచ్చి పడింది.
పూజలకు లారీలు సిద్ధం
సాలూరు లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండో స్థానంలో ఉండేది. పట్టణంలో 2500 వరకు లారీలు ఉన్నాయి. వాటితో పాటు వివిధ రకాల వాహనాలు మరో రెండు వేల వరకు ఉంటాయి. వాటికి దసరా నాడు ప్రత్యేకంగా పూజలు చేయనున్నారు. వాహనాలకు పూజలతో పాటు పొట్టేళ్లను మొక్కుబడిగా చెల్లిస్తారు.