Danger if not recognized గుర్తించకుంటే అపాయం
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:43 PM
Danger if not recognized జిల్లాలోని ప్రధాన ఆస్పత్రుల్లో నెలలో కనీసం పదిమంది పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ చికిత్సకు చేరుతున్నారు. చాలామందికి ఈ వ్యాధి వచ్చిందని కూడా తెలియడం లేదు. ఏదైనా సర్జరీ చేసే సమయంలో పరీక్షలు చేసినప్పుడు హైపటైటిస్‌కు గురవుతున్నట్టు నిర్ధారణ అవుతోంది.
గుర్తించకుంటే అపాయం
జిల్లాలో అక్కడక్కడ పచ్చకామెర్ల కేసులు
మా మధ్య రోజుల వ్యవధిలో అన్నదమ్ముల మృతి
చాలా మందిలో తెలియకుండానే లక్షణాలు
గుర్తించి వైద్యం అందిస్తే మేలు
రాజాం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):
విజయనగరంలో కొద్దిరోజుల వ్యవధిలో ఇద్దరు సోదరులు అనారోగ్యంతో మృతిచెందారు. బొంగ వీధికి చెందిన పి.సాయి అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా పచ్చకామెర్లు అని వైద్యులు తేల్చారు. వైద్యసేవలందిస్తుండగా సాయి చనిపోయాడు. ఈ ఘటనకు నాలుగు రోజుల ముందు సాయి సోదరుడు మోహన్ అనారోగ్యానికి గురయ్యాడు. పచ్చకామెర్లతో చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయాడు. హైపటైటిస్ వ్యాధిగా పిలిచే పచ్చకామెర్ల కేసులు జిల్లాలో అక్కడక్కడ నమోదవుతున్నాయి. కొందరి ప్రాణాలు తీస్తున్నాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం, వ్యాధిని గుర్తించడంలో జరుగుతున్న జాప్యం ప్రాణాల మీదకు తెస్తోంది.
జిల్లాలోని ప్రధాన ఆస్పత్రుల్లో నెలలో కనీసం పదిమంది పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ చికిత్సకు చేరుతున్నారు. చాలామందికి ఈ వ్యాధి వచ్చిందని కూడా తెలియడం లేదు. ఏదైనా సర్జరీ చేసే సమయంలో పరీక్షలు చేసినప్పుడు హైపటైటిస్‌కు గురవుతున్నట్టు నిర్ధారణ అవుతోంది. ఆస్పత్రులకు 10 శాతం మంది వ్యాధి నిర్థారణ అయిన తరువాత వస్తున్నారు. మిగతా 90 శాతం మంది వివిధ రుగ్మతలతో వస్తుండగా వారిలో వ్యాధి బయటపడుతోంది. మరోవైపు రక్తం దానం చేసే క్రమంలో పరీక్షలు చేసినప్పుడు సైతం బయటపడుతోంది. అయితే ఇది సకాలంలో గుర్తించకపోతే మాత్రం ప్రమాదం. దీర్ఘకాలిక కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి. కాలేయ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. ఏ వయసు వారికైనా సోకుతుంది.
వ్యాధి లక్షణాలు ఇవే..
వ్యాధి లక్షణాలు గుర్తించి ఆస్పత్రిని ఆశ్రయిస్తే మేలు లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా అలసట, జలుబు, ఫ్లూ, పొత్తికడుపు నొప్పి, ఆకలి మందగించడం, బరువు పెరగడం, వాంతులు, వికారం, ముదురు రంగు మూత్రం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం వాపునకు గురై చర్మం పసుపు రంగులోకి మారడం, కళ్లు తెల్లబారడం వంటివి ప్రధాన లక్షణాలు. హైపటైటిస్ అనేది కాలేయం వాపు లేదా పచ్చకామెర్లుగా వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, సామాజిక, ఏరియా ఆస్పత్రుల్లో వీటికి సంబంధించి పరీక్షలు చేస్తారు. ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవానికి ముందు విధిగా గర్భిణీకి ఈ పరీక్ష చేయాలి. విజయనగరం ప్రధాన ఆస్పత్రిలో శస్త్రచికిత్సలకు ముందు నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ప్రజలు స్వచ్ఛందంగా కూడా ఈ పరీక్షలు చేసుకోవచ్చు. ప్రైవేటు ల్యాబుల్లో కూడా ఈ పరీక్ష అందుబాటులో ఉంటుంది.
వీటి వల్లే అధికం..
మానవ తప్పిదాల వల్ల ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా మూల్యం తప్పదు. రక్తమార్పిడి, డయాలసిస్ రోగులు, తలసేమియా, వివాహేతర సంబంధాలు, విచ్చలవిడి శృంగారం, వాడిన నీడిల్స్‌తో ఇంజక్షన్లు వాడకం, శరీరం పచ్చబొట్లు వేసుకోవడం, అతిగా మద్యం సేవించడం, ఇతరులు వాడిన వస్తువులను ఎక్కువగా వాడడం వల్ల హైపటైటిస్ విస్తరిస్తోంది. ప్రధానంగా ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్,జీ అనే ఏడురకాలుగా హైపటైటిస్ వ్యాధి సంక్రమిస్తోంది. ఇందులో బీ,సీ హైపటైటిస్ ప్రాణాంతకమైనవి.
వ్యసనాలే ప్రధాన కారణం..
ముందస్తు జాగ్రత్తలతో పచ్చకామెర్లకు దూరంగా ఉండవచ్చు కానీ చాలామంది తమ శరీరంలో ఉండే సమస్యలను చెప్పుకోవడానికి ఇబ్బందిపడుతుంటారు. అవే ప్రమాదానికి కారణమవుతు న్నాయి. పచ్చకామెర్లు ఎక్కువగా పెరగడానికి మద్యం, ధూమపానం అలవాట్లే కారణమని, వివాహేతర సంబంధాలు కూడా కావొచ్చునని వైద్యులు తెలిపారు. హెచ్‌ఐవి మాదిరిగానే హైపటైటిస్ వ్యాధి కూడా విస్తరిస్తోంది. చాలామందిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడడం లేదు కానీ అనేక రకాల వ్యాధులకు ఇది కారణం అవుతోంది. మరోవైపు పచ్చకామెర్ల బాధితులు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు కానీ ఒక్కోసారి వికటించి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.
నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి
పచ్చకామెర్లు అనేది ప్రాణాంతకం. అందుకే వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించాలి. వెంటనే నిర్ధారించుకోవాలి. వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదు. నాటు మందులను ఆశ్రయించ కూడదు. వైద్య ఆరోగ్య శాఖ పరంగా దీనిపై మరింతగా అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తాం.
- జీవనరాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం
-----------------