గాలి కుంటుతో ప్రమాదం
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:54 PM
పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. సకాలంలో వ్యాధి లక్షణాలు గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే పశువులు, వాటి పాలు తాగిన దూడలు మృత్యువాతపడే ప్రమాదం ఉంది.
- పశువుల మృత్యువాత పడేఅవకాశం
- ముందస్తు జాగ్రత్తలే రక్ష
- నేటి నుంచి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
జియ్యమ్మవలస, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. సకాలంలో వ్యాధి లక్షణాలు గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే పశువులు, వాటి పాలు తాగిన దూడలు మృత్యువాతపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమానికి పశుసంవర్థక శాఖ సిద్ధమైంది. ఈ నెల 15(సోమవారం) నుంచి అక్టోబరు 15 వరకు నెల రోజుల పాటు ఈ వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయనున్నారు. 4 నెలలు దాటిన ప్రతి పశువుకూ ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకా వేయించాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. 2019 పశు గణన లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం పశు పక్ష్యాదులు 14.67 లక్షలు ఉన్నాయి. ఇందులో ఆవులు 2.29 లక్షలు, గేదెలు 49 వేలు ఉన్నాయి. ఆవులు, గేదెలు కలిపి 2.78 లక్షలు ఉన్నాయి. వీటన్నిటికీ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసేందుకు జిల్లా పశు సంవర్థకశాఖ సమాయత్తమైంది. దీనికోసం జిల్లాలో 24 మంది పశు వైద్యాధికారులు, 280 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు.
వ్యాధి లక్షణాలు..
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలను సులువుగా గుర్తించవచ్చు. పశువుల్లో తీవ్రమైన జ్వరం రావడంతో పాటు నీరసించిపోతాయి. నోటి నుంచి తీగల వలే చొంగ కారుతూ ఉంటుంది. కాలిగిట్టలు, నోటి వద్ద పుండ్లు ఏర్పడతాయి. కొద్దిపాటి ఎండకు కూడా ఇవి తట్టుకోలేవు. చూడి పశువులు అయితే ఈనుకుపోతుంది. వీటి పాలు తాగే దూడలు మరణిస్తాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పశువుల పని సామర్థ్యం అంతేస్థాయిలో తగ్గుతుంది. దీనివల్ల పాడి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వైద్యంపై నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోతాయి. అందుకే టీకా వేయించుకోవాలి.
టీకాల వల్ల లాభాలు..
నాలుగు నెలల వయసు దాటిన పశువులు, జీవాలకు ముందు జాగ్రత్త చర్యగా టీకా వేయించాలి. ఆవులు, గేదెలకు 2 మిల్లీ లీటర్ల చొప్పున టీకా ఇవ్వాలి. ఆరు నెలలకు ఒకసారి టీకా వేయిస్తే గాలి కుంటు వ్యాధి దరి చేరదు. ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తుంది. దీనివల్ల పాడి రైతుకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పాల ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది. పని సామర్థ్యం తగ్గకుండా కాపాడవచ్చు. దూడల్లో మరణాలు సంభవించవు. అవి ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
సద్వినియోగం చేసుకోండి
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయించాలి. రైతులు కచ్చితంగా మీ పాడి ఆవులు, గేదెలకు ఈ టీకా వేయించుకోండి. ఉచితంగా మా వైద్యాధికారులు, సిబ్బంది వేస్తారు.
-డాక్టర్ మన్మథరావు, జేడీ, పశు సంవర్థకశాఖ, పార్వతీపురం మన్యం