Damage caused by winds గాలులతోనే నష్టం
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:06 AM
Damage caused by winds తుఫాన్ కారణంగా సృష్టించిన గాలి బీభత్సానికి జిల్లాలో విద్యుత్ శాఖకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. అలాగే వరి, మొక్కజొన్న, ప్రత్తి, అరటి, బొప్పాయి, కూరగాయలు పంటలకు కొంత నష్టం జరిగింది. దీనిపై అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు.
గాలులతోనే నష్టం
పడిన స్తంభాలతో విద్యుత్ శాఖకు రూ.39.65 లక్షలు..
150 హెక్టార్లలో దెబ్బతిన్న ఉద్యాన పంటలు
330 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, ప్రత్తి పంటలకూ కొంత నష్టం
దెబ్బతిన్న 8 ఇళ్లు
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): తుఫాన్ కారణంగా సృష్టించిన గాలి బీభత్సానికి జిల్లాలో విద్యుత్ శాఖకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. అలాగే వరి, మొక్కజొన్న, ప్రత్తి, అరటి, బొప్పాయి, కూరగాయలు పంటలకు కొంత నష్టం జరిగింది. దీనిపై అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు. పూర్తయిన వెంటనే ప్రభుత్వానికి అందించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా ఈనెల 2న గాలి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ గాలి తీవ్రతకు చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పంటలు నేలవాలాయి. కొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్ శాఖకు దాదాపు రూ.39.65 లక్షల నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు అంచనా వేశారు. 33 కేవీ నాలుగు స్తంభాలు, 11కేవీ 186 పోల్స్, ఎల్‌టీ పోల్స్ 267, 11 కేవీ కండక్టర్ 11.7 కిలోమీటర్లు, ఎల్‌టీ కండక్టర్ 12.71 కిలోమీటర్లు మేర నష్టం వాటిల్లింది. అలాగే గాలి ప్రతాపానికి జిల్లాలో ఎనిమిది ఇళ్లు పాక్షింగా దెబ్బతిన్నాయి. సుమారు 33.6 హెక్టార్లలో బొప్పాయి, 105 హెక్టార్లలో అరటి, 2.8 హెక్టార్లలో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు 316 హెక్టార్లలో వరి, 47 హెక్టార్లలో మొక్కజొన్న, 97 హెక్టార్లలో ప్రత్తి పంటలకు ప్రాథమికంగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. దెబ్బతిన్న పంటలను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అంచనా వేస్తున్నారు.
నష్టాలపై అంచనా పంపాలి
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
భారీ వర్షాలకు చోటుచేసుకున్న పంట నష్టాలను, రహదారులు, విద్యుత్ తదితర నష్టాలను అంచనా వేసి వెంటనే పంపాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించి ఖచ్చితమైన, పారదర్శకమైన అంచనాలను, వాస్తవాలను పంపాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో శనివారం ఉదయం కలెక్టర్ నిర్దేశించారు. జేసీ సేతు మాధవన్ పాల్గొన్నారు.