Cyclone Tension తుఫాన్ టెన్షన్
ABN , Publish Date - Dec 01 , 2025 | 01:08 AM
Cyclone Tension దిత్వా తుఫాన్ వార్తలతో జిల్లాలో అన్నదాతలు టెన్షన్ పడుతున్నారు. ధాన్యం నిల్వలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడు తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ధాన్యం నిల్వలను సంరక్షించే పనిలో నిమగ్నం
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వ్యవసాయ శాఖాధికారులు
పార్వతీపురం/పాలకొండ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్ వార్తలతో జిల్లాలో అన్నదాతలు టెన్షన్ పడుతున్నారు. ధాన్యం నిల్వలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడు తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ కోస్తాతో పోల్చుకుంటే ఉత్తర కోస్తాకు ప్రభావం చూపదని చెబుతున్నా.. గత అనుభవాల దృష్ట్యా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వాతావరణం మారింది. ఆకాశాన్ని కారు మబ్బులు కమ్మేశాయి. ఈ నేపథ్యంలో రైతులు కూలీల కొరతను అధిగమించి ధాన్యం నిల్వలను కల్లాలకు తరలించే పనిలో పడ్డారు. మరికొంతమంది పంట పొలాల్లోనే వరి పనాలను కుప్పలుగా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రెండు లక్షల ఎకరాలకు పైగా వరిని రైతులు సాగు చేశారు. ఇప్పటివరకు 70 శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. వీటిలో 40 శాతానికి పైగా ధాన్యాన్ని కల్లాలకు తరలించారు. మిగిలిన 30 శాతం వరి పనాల రూపంలో పొలాల్లోనే ఉంది. వాస్తవంగా కోత కోసిన ఐదు రోజుల తర్వాత కుప్పలు వేసే అవకాశం ఉన్నప్పటికీ కూలీల కొరతతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇటువంటి సమయంలో అధిక వర్షం కురిస్తే అన్నదాతలకు నష్టం తప్పదు. ధాన్యం మొలకెత్తే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.
భామిని: వాతావరణం మార్పులతో భామిని మండలంలో రైతులు అప్రమత్తమయ్యారు. మొక్కజొన్న, పత్తి పంటలపై టార్పాలిన్లు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. మండలంలో పది వేల ఎకరాలు వరి సాగు చేయగా, కొన్ని చోట్ల కోతలను వాయిదా వేశారు. మరోవైపు జిల్లా వ్యవసాయశాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే 1500 టార్పాలిన్లు సిద్ధం చేసింది. అవసరమైన వారికి వాటిని అందించాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) అన్నపూర్ణ తన సిబ్బందిని ఆదేశించారు. తుఫాన్ ప్రభావం జిల్లాపై ఉండదని అన్నారు. ఏదేమైనా వరి కోతలు నాలుగు రోజులు వాయిదా వేసుకోవడం మంచిదన్నారు.
నత్తనడకన ధాన్యం కొనుగోలు...
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. రైస్‌మిల్లర్లు పూర్తిస్థాయిలో బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. కాగా ఇప్పటికే రైతులు కల్లాల్లో ధాన్యం బస్తాలను సిద్ధం చేశారు. వర్షం కురిస్తే ఇవి కూడా పాడయ్యే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.