Share News

Cyclone తుఫాన్‌ గుబులు!

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:03 AM

Cyclone Scare! ‘మొంథా’ తుఫాన్‌ ప్రభా వంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం చిరుజల్లులు కురిశాయి. స్వల్పంగా గాలులు వీచాయి. అయితే సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి.

Cyclone తుఫాన్‌ గుబులు!
గాలులకు గరుగుబిల్లిలో నేలవాలిన వరి పంట

  • తొలిరోజు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు

  • నేడు ఈదురుగాలులతో భారీగా కురిసే అవకాశం

  • రైతుల్లో టెన్షన్‌.. పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నం

  • జలాశయాలకు వరద

  • అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం

పార్వతీపురం/టౌన్‌/సాలూరు/సీతంపేట, అక్టోబరు27(ఆంధ్రజ్యోతి): ‘మొంథా’ తుఫాన్‌ ప్రభా వంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం చిరుజల్లులు కురిశాయి. స్వల్పంగా గాలులు వీచాయి. అయితే సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌ వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావడానికి సాహసించ లేదు. కాగా మంగళవారం పరిస్థితి పూర్తిగా మారనుం దని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈదురు గాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సాలూరులో ఉదయం నుంచి తేలికపాటి జల్లులు కురవగా.. పలు పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా మార్చారు. పూరిళ్లలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. తుఫాన్‌ హెచ్చరికల వల్ల పార్వతీపురం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలవాసులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. ముంపు సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఏజెన్సీలో..

సీతంపేట ఏజెన్సీలో చిరుజల్లులు కురిశాయి. అయితే సాయంత్రానికి కుండపోత వర్షం కురిసింది. మరోవైపు మండల స్థాయి అధికారులు గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. సాలూరు మండల పరిధి ఏవోబీ కొఠియా కొండల్లో భారీ వర్షం పడింది. వీరఘట్టం, మక్కువ మండలాల్లోని పలు గ్రామాల్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి వరకూ జోరు వాన కురిసింది. తుఫాన్‌ వల్ల ఎటువంటి నష్టం జరగ కుండా అధికారుల బృందం విస్తృతంగా పర్యటించి ప్రజలకు జాగ్రత్తలు సూచించారు.

అన్నదాతల్లో ఆందోళన

గరుగుబిల్లి/పాలకొండ: ‘మొంథా’ తుఫాన్‌ రైతులకు కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపఽథ్యంలో చేతికందొచ్చిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సోమవారం పాలకొండ మండలంలో పలువురు రైతులు ధాన్యాన్ని లారీల్లో లోడ్‌ చేయించి కాకినాడ తదితర ప్రాంతాలకు తరలించారు. మరికొందరు ధాన్యంపై టార్పాలిన్లు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. ఏదేమైనా సోమవారం సాయంత్రం నుంచి ఓ మోస్తరు వర్షం కురవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింతగా టెన్షన్‌ పడుతున్నారు. ఈదురు గాలులు, భారీ వర్షాలతో నష్టం తప్పద ంటున్నారు. పంట తడిసిపోయే ప్రమాదం ఉండడంతో మరి కొందరు స్థానిక వ్యాపారులను ఆశ్రయించి హడావుడిగా అమ్మకాలు చేపట్టారు.

నేలవాలిన వరిపైరు

గరుగుబిల్లి మండలంలో సుమారు 16,280 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. అయితే చిన్నపాటి గాలులకు వరి పైరు నేలవాలంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రధానంగా గరుగుబిల్లి, పెద్దూరు, బీవీ పురం, ఉద్దవోలు, దళాయివలసతో పాటు పలు గ్రామాల్లోని వరి పంట అధికంగా నేలవాలింది. పంటను రక్షించుకుందామన్నా వర్షం కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఉన్నారు. రానున్న రెండు రోజుల్లో ఈదురుగాలుతో భారీ వర్షాలు కురిస్తే మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా వరి పంట ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఏవో టి.జ్యోత్న తెలిపారు.

వీఆర్‌ఎస్‌కు వరద

మక్కువ రూరల్‌: శంబర సమీపంలో ఉన్న వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌) జలాశయం నుంచి సోమవారం 1000 క్యూసెక్కులను సువర్ణముఖి నదిలోకి విడుదల చేసారు. తుఫాన్‌ కారణంగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయంలో వరద పెరుగుతోందని అసిస్టెంట్‌ ఇంజనీర్‌ రాజశేఖర్‌ తెలిపారు. రాత్రికి ఇన్‌ఫ్లో పెరిగితే దిగువకు మరిన్ని క్యూసెక్కులను విడుదల చేస్తామన్నారు. నదిపరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నిలకడగా నాగావళి

గరుగుబిల్లి: తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలోకి సోమవారం పైప్రాంతాల నుంచి 3,900 క్యూసెక్కుల వరద చేరింది. ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేట్ల నుంచి దిగువకు 5,500 క్యూసెక్కులను విడుదల చేశారు. ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 103.14 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. వరద ప్రవాహం మంగళవారానికి పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ హెచ్‌.మన్మథరావు, జేఈ బి.కిషోర్‌కుమార్‌ తెలిపారు నదీ తీర ప్రాంతవాసులను అప్రమత్తం చేశామన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిం చామని వెల్లడించారు.

వర్షపాతం నమోదు ఇలా

పాలకొండ: జిల్లాలో సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయం త్రం ఆరుగంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పాలకొండ 5.2 మిల్లీమీటర్లు, సీతంపేట 3.2, వీరఘట్టం 5.4, గుమ్మలక్ష్మీపురం 2.4, భామిని 7.8, జియ్యమ్మవలస 4.6, కురుపాం 1.6, పార్వతీపురం 7, కొమరాడ 3.4, గరుగుబిల్లి 12.8, మక్కువ 8, సీతానగరం 8.8, సాలూరు 5, బలిజిపేట 10.4, పాచిపెంట 5.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

రంగంలోకి కలెక్టర్‌, ఎస్పీ

తుఫాన్‌ తీవ్రత నేపథ్యంలో కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎటువంటి నష్టం జరగకుండా సిబ్బంది పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. కలెక్టరేట్‌తో అన్ని అన్ని మండల కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మంగళవారం మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ఉద్యోగులకు సూచించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు : సబ్‌ కలెక్టర్‌

పాలకొండ: అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని పాలకొండ సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవార్‌ జగన్నాఽథ్‌ సూచించారు. తుఫాన్‌ హెచ్చరికల నేపఽథ్యంలో సోమవారం సాయంత్రం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ‘డివిజన్‌లో కురుపాం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని కొండ ప్రాంతాల్లో గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి. పూరిగుడిసెలు, విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కింద ఉండరాదు. పంచాయతీ సెక్రటరీ, వీఆర్‌వోలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కొండ వాగులు, గెడ్డలు, నదులను ఎవరూ దాటరాదు. సబ్‌ డివిజన్‌ పరిధిలో 45 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. సచివాలయాలు, ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేశాం. ఆహారం, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించాం. అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశాం’ అని తెలపారు. అనంతరం ఆయన నదీతీర గ్రామాలైన అన్నవరం, గోపాలపురం, గొట్టమం గళాపురం, అంపిలి సందర్శించారు. వరదలు వస్తే నదీతీర గ్రామాల ప్రజలను తరలించాలని సిబ్బందికి సూచించారు.

Updated Date - Oct 28 , 2025 | 12:03 AM