Share News

పచ్చని చెట్ల నరికివేత

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:54 PM

మండలంలో వివిధ రహదారులకు ఇరువైపులా ఉన్న విలువైన చెట్లు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి.

 పచ్చని చెట్ల నరికివేత
అల్లువాడ సమీపంలో భారీ వృక్షాన్ని నరికేస్తున్న దృశ్యం(ఫైల్‌)

- పట్టించుకోని అధికారులు

- ప్రజల ఆగ్రహం

జియ్యమ్మవలస, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): మండలంలో వివిధ రహదారులకు ఇరువైపులా ఉన్న విలువైన చెట్లు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటుతుంటే.. మరోవైపు కొందరు వ్యక్తులు రోడ్లపక్క ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను నరికేస్తున్నారు. ఇష్టారాజ్యంగా చెట్లను నరికేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోఖాసా అల్లువాడ - తుంబలి, జోగులడుమ్మ - జియ్యమ్మవలస గ్రామాల మధ్య ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు కొందరు రైతుల గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్నాయి. పెదతుంబలి, చినతుంబలి గ్రామాల మధ్య ఇటీవల పదుల సంఖ్యలో చెట్లను నరికేసి ఆ రెండు గ్రామాల రైతులు తమ ఇంటి అవసరాలకు తీసుకెళ్లిపోయారు. పెదతుంబలి సమీపంలో వట్టిగెడ్డ రిజర్వాయర్‌ ప్రధాన కాలువ పక్కనే రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను కాల్చి బూడిద చేసేశారు. ఇదే పరిస్థితి శిఖబడి జంక్షన్‌ - బీజే పురం గ్రామాల మధ్య నెలకొంది. అల్లువాడ సమీపంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భారీ వృక్షం నీడ తమ పొలంపై పడుతుందని, దీనివల్ల పంటలు దెబ్బతింటున్నాయని ఆ గ్రామానికి చెందిన ఓ రైతు రెండు రోజుల కిందట ఆ చెట్టును నరికి వేయించాడు. వేసవిలో ఎండ తీవ్రతకు వాహన చోదకులు ఆ చెట్టు నీడ కిందనే సేదతీరేవారు. ఇప్పుడు ఆ భారీ వృక్షాన్ని కొట్టేయడంతో నీడ కరువైందని వాహన చోదకులు వాపోతున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ఆర్‌అండ్‌బీ అధికారులకు సమాచారం ఇచ్చినా కనీస చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ ఏడాది మార్చిలో పెదబుడ్డిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న విలువైన నీలగిరి, టేకు, తదితర చెట్లను కొందరు నరికేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. డిప్యూటీ డీఈవో, మండల విద్యాశాఖ అధికారులు వెళ్లి సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిజమని తేల్చారు. ఉన్నతాధికారులకు నివేదికలు అందించినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

చర్యలు తీసుకుంటాం

రహదారులకు ఇరువైపులా ఉన్న చెట్లను నరకడం నేరం. ఒక వేళ వాటిని నరకాలంటే రెవెన్యూశాఖ అనుమతి తప్పనిసరి. అటవీ ప్రాంతంలో అయితే అటవీశాఖ అనుమతి ఉండాలి. అనుమతి లేకుండా చెట్లను నరికితే చర్యలు తీసుకుంటాం.

ఎ.సుశీల, ఏఈ, ఆర్‌అండ్‌బీ, జియ్యమ్మవలస

Updated Date - Jun 15 , 2025 | 11:54 PM