ఒంపు తిరిగిన కాలువ
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:07 AM
నిటారుగా ఉండాల్సిన కాలువ ఓ చోట ఒంపు తిరిగింది. 80 అడుగుల వెడల్పుతో రహదారిని విస్తరించాల్సి ఉండగా, ఓ చోట మాత్రం ఐదు అడుగులు తగ్గించారు.
- రోడ్డు వెడల్పును 5 అడుగుల తగ్గించి డ్రైన్ నిర్మాణం
- కమిషనర్ ఆదేశాలతో నిలిచిన పనులు
రాజాం రూరల్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): నిటారుగా ఉండాల్సిన కాలువ ఓ చోట ఒంపు తిరిగింది. 80 అడుగుల వెడల్పుతో రహదారిని విస్తరించాల్సి ఉండగా, ఓ చోట మాత్రం ఐదు అడుగులు తగ్గించారు. అక్కడ 75 అడుగులే రోడ్డును విస్తరించి కాలువ పనులు చేపడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అంతేనంటూ సమాధానం చెబుతున్నారు. ఇదీ రాజాం-డోలపేట మార్గంలో జరుగుతున్న రెండో విడత రోడ్డు విస్తరణ పనుల తీరు. ప్రస్తుతం అంబేడ్కర్ జంక్షన్ నుంచి జీఎంఆర్‌ఐటీ, బొబ్బిలి జంక్షన్ నుంచి గాయత్రికాలనీ వరకూ రెండో విడత రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా అంబేడ్కర్ జంక్షన్ నుంచి డోలపేటకు వెళ్లే మార్గంలో శుక్రవారం కాలువ పనులు చేపట్టారు. అయితే, ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదురుగా మాత్రం 80 అడుగులకు గాను ఐదు అడుగులకు రోడ్డును తగ్గించారు. 75 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేపట్టి కాలువ పనులు చేపట్టడాన్ని స్థానికులు గుర్తించి ప్రశ్నించారు. దీనికి అక్కడ పనులు చేపడుతున్న వారు నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. ఈ విషయం మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడుకు చేరింది. క్షణాల్లో టౌన్‌ప్లానింగ్, సర్వేవిభాగం, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందితో కమిషనర్ సమావేశమయ్యారు. ఐదు అడుగులు తగ్గించి చేపడుతున్న నిర్మాణాలను వెంటనే ఆపాలని సిబ్బందికి కమిషనర్ ఆదేశించారు. ఫలితంగా ఇష్టారాజ్యంగా చేస్తున్న కాలువ పనులు నిలిచిపోయాయి. రోడ్డు విస్తరణ 80 అడుగుల మేర ఉండేలా చర్యలు చేపట్టి, కాలువ నిర్మాణం జరిగేలా చూడాలని టౌన్‌ప్లానింగ్, సర్వే విభాగం అధికారులకు ఆదేశించారు. ఈ పనుల్లో ఆర్‌అండ్‌బీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి యాజమాన్యంతో కుమ్మక్కై రోడ్డును ఐదు అడుగులు తగ్గించి కాలువ పనులు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రెండోవిడత విస్తరణ పనులపై ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.