Share News

Curb Drug మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టాలి

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:41 PM

Curb Drug Trafficking జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అ క్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు.

Curb Drug  మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌, పక్కన ఎస్పీ, జేసీ

పార్వతీపురం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అ క్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలో సంతలు జరిగే ప్రదేశాలు, షాపులు వద్ద నిఘా పెంచాలి. మత్తు పదార్థాలు విక్రయించే వారి వివరాలు సేకరించాలి. మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలి. గంజాయి, నాటుసారా, బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, మహిళల అక్రమ రవాణా వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పలు శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహనా ర్యాలీలు, చైతన్య కార్యక్రమాలు, దాడుల్లో పట్టుకున్న సరుకులపై నివేదిక అందించాలి. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసే వారికి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి.’ అని తెలిపారు. జిల్లాలో మహిళలపై నేరాలు, వరకట్న, లైంగిక, ఇతర వేధింపులు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. గత మూడేళ్లలో వరకట్న, ఇతర లైంగిక వేధింపుల కేసులు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పొక్సో కేసులు అధికంగా నమోదు అవుతున్నాయన్నారు. కౌన్సిలింగ్‌ ఇస్తున్నామని, పార్వతీపురం, పాలకొండ, సాలూరులో మూడు శక్తి బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత, సబ్‌ కలెక్టర్లు వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఎస్పీ రాంబాబు, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సంతోషి తదితరులు పాల్గొన్నారు.

వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు ఘన నివాళి

కలెక్టరేట్‌లో సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌, ఎస్పీ తదితరులు పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సర్దార్‌ సేవలను కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేసిన ఉక్కుమనిషి పటేల్‌ అని తెలిపారు.

తుఫాన్‌ బాధితులకు ప్రత్యేక సాయం

జిల్లాలో తుఫాన్‌ బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని ప్రకటించిందని కలెక్టర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిలీఫ్‌ క్యాంపుల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందిన ప్రతి కుటుంబానికి రూ.3 వేలు చొప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా రూ.1000 చొప్పున గరిష్టంగా చెల్లించనున్నట్లు వెల్లడించారు.

జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించడమే లక్ష్యం

జలపాతాల జిల్లాగా పార్వతీపురం మన్యానికి ప్రత్యేక స్థానం కల్పించడమే తన లక్ష్యమని కలెక్టర్‌ తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో మాట్లాడుతూ... సీజన్‌ స్టార్స్ప్‌ పేరిట ఈనెల ఒకటో తేదీన సీతంపేట ఎన్టీఆర్‌ పార్క్‌లో ‘విహంగ వీక్షణం చేద్దాం...మన్యం అందాలను తిలకిద్దాం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ప్రకృతి అందాలను పర్యాటకుల చెంతకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌లో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ అందుబాటులోకి తెచ్చామని, మెట్టుగూడ జలపాతం వద్ద పిల్లల కోసం స్విమ్మింగ్‌పూల్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. జిల్లాలో అనేక జలపాతాలు ఉన్నాయని, వాటిని పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అవసరమైన స్టాల్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుం టున్నామన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:41 PM