Turned Hazardous! పెచ్చులూడి.. ప్రమాదకరంగా మారి!
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:32 PM
Crumbled and Turned Hazardous! గరుగుబిల్లి మండలం ఖడ్గవలస సముదాయం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి మార్గం ప్రమాదకరంగా మారింది. బీటీ రహదారిపై పెచ్చులూడిపోతుండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడే గోతులు ఏర్పడడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది.
వాహనదారులకు తప్పని అవస్థలు
గరుగుబిల్లి, జూలై 18(ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి మండలం ఖడ్గవలస సముదాయం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి మార్గం ప్రమాదకరంగా మారింది. బీటీ రహదారిపై పెచ్చులూడిపోతుండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడే గోతులు ఏర్పడడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఖడ్గవలస నుంచి ఉల్లిభద్ర వరకు ప్రధాన రహదారి మెరుగుపర్చేందుకు కూటమి ప్రభుత్వం సుమారు రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఖడ్గవలస నుంచి అడ్డాపుశీల వరకు మాత్రమే మరమ్మతు పనులు పూర్తయ్యాయి. సంతోషపురం నుంచి పాలకొండ వరకు రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరడంతో ఇటువైపుగా ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇదిలా ఉండగా రావివలస సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన ప్రధాన కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. కారివలస సమీపంలో కుడి పిల్ల కాలువపై నిర్మించిన కల్వర్టు కుంగిపోయేందుకు సిద్ధంగా ఉంది. శ్రీకాకుళంతో పాటు ఒడిశాకు ప్రధానమైన ఈ రోడ్డుపై సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు దృష్టి సారించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ జేఈ వాసిరెడ్డి రామ్‌మోహనరావును వివరణ కోరగా.. ‘ ఖడ్గవలస నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో బీటీ రహదారిపై గుంతలు పూడ్చుతాం. దీనిపై కాంట్రాక్టర్‌కు సమాచారం అందించాం. రహదారిపై పెచ్చులు ఊడిపోకుండా చర్యలు చేపడతాం. ప్రధాన కల్వర్టుల పనులకు ప్రతిపాదనలు పంపించాం. కల్వర్టుల ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకల నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం.’ అని తెలిపారు.