Descending the Hill! రాళ్లు రప్పలు దాటి.. కొండ దిగి!
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:08 AM
Crossing Rocks and Descending the Hill! గిరిశిఖర గ్రామాల ప్రజలకు డోలీ మోతలు తప్పడం లేదు. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఇక్కట్లకు గురవ్వాల్సి వస్తోంది. గ్రామంలో ఎవరు అనారోగ్యానికి గురైనా కాలినడకన కొండలు దాటి ఆసుపత్రులకు చేరుకోవాల్సి వస్తోంది.
గిరిజనులకు తప్పని అవస్థలు
కొమరాడ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల ప్రజలకు డోలీ మోతలు తప్పడం లేదు. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఇక్కట్లకు గురవ్వాల్సి వస్తోంది. గ్రామంలో ఎవరు అనారోగ్యానికి గురైనా కాలినడకన కొండలు దాటి ఆసుపత్రులకు చేరుకోవాల్సి వస్తోంది. కొమరాడ మండలం పూడేసు పంచాయతీ పరిధి గుమడింగి కొండ శిఖర గ్రామానికి చెందిన ఆరిక దండు కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆదివారం పరిస్థితి విషమించడంతో భార్య జమ్మాలమ్మ, కొడుకు మోహన్‌రావు తీవ్ర ఆందోళన చెందారు. చివరకు గ్రామస్థులు హరి, నాగార్జున సాయంతో దండుకు డోలీ కట్టారు. సుమారు మూడు కిలోమీటర్లు వారు రాళ్లు రప్పలు దాటి.. కొండ దిగి ఒడిశా రాష్ట్రం కొమ్ముగండ గ్రామం చేరుకొన్నారు. అక్కడ నుంచి ఆటో ద్వారా సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించి.. పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు దండును పరీక్షించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వేళల్లో డోలీ మోతలు తప్పడం లేదని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా గుమడింగికి పది కిలోమీటర్ల దూరంలో పూడేసు గ్రామం ఉంది. అయితే చుట్టూ తిరిగి వెళ్లడం కంటే.. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా రాష్ట్రం కొమ్ముగండ వరకు డోలీతో చేరుకుని అక్కడి నుంచి వాహనాల ద్వారా పార్వతీపురం ఆసుపత్రికి వెళ్తున్నట్లు వారు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గుమడింగి, కుంతేసు, పూడేసు, మసిమండ, పెదశాఖ, గుణద, తలేసు, నయా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని, డోలీ మోతలు తప్పించాలని వారు కోరారు.