Share News

Farmers పంట కదలక.. వేదన తీరక!

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:23 AM

Crops Not Moving, Farmers’ Distress Unending! జిల్లాలో చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తెగుళ్ల బారిన పడడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవైపు లక్ష్మీపురంలో సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెరకు తూనిక కేంద్రం నుంచి పంట తరలిపోవడం లేదు. రోజుకొక లారీ వస్తుండడమే ఇందుకు కారణం.

 Farmers  పంట కదలక..  వేదన తీరక!
నాలుగు రోజులుగా నాటు బళ్లతో ఉన్న చెరకు పంట

  • తూనిక కేంద్రానికి పూర్తిస్థాయిలో రాని లారీలు

  • మరోవైపు వేధిస్తున్న తెగుళ్ల బెడద

  • పొలంలోనే దెబ్బతింటున్న పంట

  • కాపాడుకోలేక అవస్థలు

  • పట్టించుకోని సంకిలి ఫ్యాక్టరీ సిబ్బంది

సీతానగరం, డిసెంబరు26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తెగుళ్ల బారిన పడడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవైపు లక్ష్మీపురంలో సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెరకు తూనిక కేంద్రం నుంచి పంట తరలిపోవడం లేదు. రోజుకొక లారీ వస్తుండడమే ఇందుకు కారణం. దీంతో చెరకును కాపాడుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాటుబళ్లపై ఆరు బయటే ఉన్న పంట మొత్తం ఎండిపోతుండగా.. దీనిపై ఫ్యాక్టరీ సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదు. మొత్తంగా తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు తలలు పట్టుకుం టున్నారు.

వాస్తవంగా సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు సీతాగనరం, మక్కువ, పార్వతీపురం మండలాల్లో 1250 ఎకరాల్లో సాగు చేపట్టారు. 36 వేల టన్నులు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. అయితే పంట చేతికందొచ్చిన సమయంలో తెగుళ్లు సొకింది. రైతులు అనేక నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం పొలంలో ఉన్న పంట పూర్తి ఎండిపోతుంది. పరిహారం ఇప్పించాలని ఫీల్డ్‌ సూపర్‌ వైజర్‌ను అడగ్గా.. చెరకు నరికివేతకు ఆన్‌లైన్‌లో పర్మిట్‌ రావాలని, వస్తే గాని ఏమీ చేయలేమని సమాధానమిస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా టన్ను చెరకు ధరను ఈ ఏడాది ఫ్యాక్టరీ రూ.3,360గా నిర్ణయించింది. అయితే పంట వేసినప్పటి నుంచి ఫ్యాక్టరీకి తరలించే వరకు రూ.2,270 ఖర్చవుతుందని రైతులు అంటున్నారు. ఫ్యాక్టరీ నిర్ణయించే ధర గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. దీనిపై కేన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ లక్ష్మణరావు, జనరల్‌ మేనే జర్‌ కమల పట్నాయక్‌ను వివరణ కోరగా.. ‘సీతానగరం మండలంలో 5 పీసీ సెంటర్లు ఉన్నాయి. చక్కెర కర్మాగారంలో నెలకొన్న సమస్యల కారణంగా లారీలు ఆలస్యంగా వస్తున్నాయి. ఆ సమస్య లేకుండా ప్రయత్నిస్తాం. ’ అని తెలిపారు.

గతంలో ఇలా..

గతంలో సీతానగరం మండలం లచ్చయ్యపేటలోనే షుగర్‌ ఫ్యాక్టరీ నిర్వహించడం వల్ల జిల్లా చెరకు రైతులకు పెద్దగా ఇబ్బందులు ఉండేవి కావు. అయితే పలు కారణాలతో ఆ ఫ్యాక్టరీ మూతపడింది. దీంతో ఈ ప్రాంత రైతులు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంకిలి ఫాక్టరీకి పంటను తరలించాల్సి వస్తోంది. వ్యయప్రయాసలకు గురవ్వాల్సి వస్తుండడంతో అనేక మంది చెరకు సాగును తగ్గించారు. ప్రత్యామ్నాయంగా వరి, మొక్కజొన్న, పత్తిని పండిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెరకు రైతులు కోరుతున్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:23 AM