Crimes on the Decline నేరాలు తగ్గుముఖం
ABN , Publish Date - Dec 27 , 2025 | 10:57 PM
Crimes on the Decline జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలో నేరాలు తగ్గుముఖం పట్టాయని, గంజాయి అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా పెట్టామని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. శనివారం బెలగాంలోని పోలీస్ సమావేశ మందిరంలో ఏడాది రివ్యూ మీటింగ్ నిర్వహించారు
బెలగాం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలో నేరాలు తగ్గుముఖం పట్టాయని, గంజాయి అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా పెట్టామని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. శనివారం బెలగాంలోని పోలీస్ సమావేశ మందిరంలో ఏడాది రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ‘సాంకేతికతను అందిపుచ్చు కుని కేసుల దర్యాప్తు చేపట్టాం. ముఖ్యంగా సాలూరులోని మహిళ మృతి కేసును అతి తక్కువ వ్యవధిలో ఛేదించి.. డీజీపీ చేతులమీదుగా ఏబీసీడీ అవార్డు పొందాం. వేధింపులకు గురైన మహిళలకు సంబంధించి 2024లో 53 కేసులు నమోదు కాగా 2025లో 9శాతం తగ్గి 48 కేసులు నమోదయ్యాయి. 2024లో అత్యాచారం కేసులు 10, ఈ ఏడాదిలో 11 , గతేడాదిలో ఫోక్సో కేసులు 10 , ఈ సంవత్సరంలో 4 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ కేసులు గతంలో 34 కేసులు రాగా ఈ ఏడాదిలో 19 నమోదయ్యాయి. కిడ్నాప్, అల్లర్లు, హత్యలు, హత్యాయత్నాలకు సంబంధించి కేసులు తగ్గుముఖం పట్టాయి. గతంలో పోలిస్తే సైబర్ నేరాలు పెరిగాయి. 2024లో 21 కేసులు నమోదవగా 2025లో 43 సైబర్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం. గంజాయి అక్రమ రవాణాదారులపై గతేడాది 39 కేసులు నమోదు చేసి 78 మందిని అరెస్ట్ చేశాం. 736.344 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. ఈ ఏడాదిలో 19 కేసులు నమోదు చేసి 45 మందిని అరెస్ట్ చేశాం. వారి నుంచి 2183.73 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. నాటు సారా తయారీ ప్రాంతాల్లో విస్తృత దాడులు నిర్వహి స్తున్నాం. డ్రోన్ సర్వే లెన్స్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకుంటున్నాం. బస్, రైల్వే స్టేషన్లు, ఇతర ముఖ్య ప్రదేశాలు, కూడళ్లలో 1325 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అవగాహన కార్యక్రమాల ద్వారా పొక్సో చట్టం, మత్తు పదార్ధాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ క్రైమ్‌పై ప్రజలు, విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నాం. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. గిరిజనులతో మమేకమై నిత్యావసరాలు, దుప్పట్లు, యువతకు క్రీడా సామగ్రి అందిస్తున్నాం. ’ అని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు ఎం.వెంకటేశ్వరరావు, మనీషారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.