cows transport గోవుల ఘోష ఆగదా?
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:28 AM
cows transport గోవులు ఘోషిస్తున్నాయి. దశాబ్దాలుగా నరకం చూస్తున్నాయి. రవాణాలో కన్నీరు పెడుతున్నాయి. అయినా వాటికి రక్షణ ఉండడం లేదు. జిల్లాలో పశువుల అక్రమ రవాణా ఆగడం లేదు. దీనిపై చాలా ఏళ్ల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇరుకుఇరుకుగా వాహనాల్లో కుక్కి తరలించడాన్ని చూసిన వారంతా అయ్యో అనుకుంటున్నారు. కానీ పరిస్థితిలో ఏమార్పు రావడం లేదు. మూగజీవాలను ఇష్టారాజ్యంగా వాహనాల్లో సంతలకు, కబేళాలకు తరలిస్తూనే ఉన్నారు.
గోవుల ఘోష
ఆగదా?
దశాబ్దాలుగా అక్రమ రవాణా
కబేళాలకు తరలింపు
మూగ జీవులతో భారీ ఎత్తున వ్యాపారం
పట్టుబడుతున్నా రాని మార్పు
వాటిని చూసి ఆవేదన చెందుతున్న సగటు పౌరులు
గోవులు ఘోషిస్తున్నాయి. దశాబ్దాలుగా నరకం చూస్తున్నాయి. రవాణాలో కన్నీరు పెడుతున్నాయి. అయినా వాటికి రక్షణ ఉండడం లేదు. జిల్లాలో పశువుల అక్రమ రవాణా ఆగడం లేదు. దీనిపై చాలా ఏళ్ల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇరుకుఇరుకుగా వాహనాల్లో కుక్కి తరలించడాన్ని చూసిన వారంతా అయ్యో అనుకుంటున్నారు. కానీ పరిస్థితిలో ఏమార్పు రావడం లేదు. మూగజీవాలను ఇష్టారాజ్యంగా వాహనాల్లో సంతలకు, కబేళాలకు తరలిస్తూనే ఉన్నారు.
బొబ్బిలి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి):
పశువులను వాహనాల్లో అధికంగా కుక్కి రవాణా చేసే పద్ధతి దశాబ్దాలుగా మారడం లేదు. పశువుల కొనుగోలు, రవాణాకు సంబంధించి కనీస నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నారు. ఇదో పెద్ద మాఫియా అని, దాని జోలికి ఎవరూ వెళ్లలేరన్న అపవాదును అధికారులు మూటగట్టుకుంటున్నారు. జంతుసంక్షేమం కోసం ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబరు 23 ఆచరణలో కనిపించడం లేదు. జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి ఆవులు కబేళాలకు తరలుతున్నాయి. పెదమానాపురం, అలమండ, అచ్యుతాపురం సంతలు ఇందుకు కేరాఫ్‌గా పేరొందాయి. ఈ మార్కెట్లలో భారీగా ఆవుల విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి వ్యాపారులు ఆవులను కబేళాలకు తరలిస్తున్నారు. కొన్ని విజయనగరం తీసుకువెళ్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి మాంసం రూపంలో ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్కెట్లకు ఆవులను తరలించే క్రమంలో దారి మధ్యలో ఎక్కడైనా పోలీసులకు చిక్కినా నాయకులు, వ్యాపారుల నుంచి ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో కబేళా వ్యాపారం నిరాటంకంగా సాగుతోంది. గతంలో ఒట్టిపోయిన పశువులను, వ్యవసాయ పనులకు ఉపయోగపడని వాటినే కబేళాకు తరలించేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. దూడలను సైతం అమ్మేస్తున్నారు. అందులోనూ మగ దూడ అయితే పుట్టిన కొద్దిరోజులకే కబేళాకు తరలిస్తున్నారు.
ఫ శాండ్ మోనటరింగ్ కమిటీ అనుమతి లేకుండానే పెదమానాపురం సంత యాజమాన్యంతో కుమ్మక్కై అక్రమంగా పశు రవాణా లైసెన్స్ మంజూరు చేసిన దత్తిరాజేరు ఈఓపీఆర్‌డీ, పెదమానాపురం పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల ఆర్‌డీవో సమక్షంలో సమావేశమైన జంతు సంక్షేమ కమిటీ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరుకు సిఫారసు చేశారు. బొబ్బిలి నుంచి బొండపల్లి వరకు హైవే మీదుగా రాత్రీపగలు కంటైనర్లలో పశువుల అక్రమ రవాణా జరుగుతోందని, అధికార యంత్రాంగం గుర్తించి నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని కమిటీ కోరింది. అధికారులు ఆచరిస్తారో లేదో చూడాలి.
ఫ బొబ్బిలి పోలీసు సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని సంతల్లో పశువుల వ్యాపారాలు నిర్వహిస్తున్న లైసెన్స్‌హోల్డర్‌ల పనితీరును స్వయంగా పరిశీలిస్తామని అధికారులు గతంలో చేసిన ప్రకటనలు అమలుకు నోచుకోవడం లేదు. దత్తిరాజేరు మండలం పెదమానాపురం, రాజాం, అలమండ తదితర సంతలన్నిటిపైనా గట్టి నిఘా పెడతామన్నారు. రాత్రివేళల్లో పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు హైవే పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. ఆచరణలో కనిపించడం లేదు.
పశువుల రవాణాలో నిబంధనలు ఇలా..
సంతల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. గడ్డి, దాణా, మంచినీరు, సీసీ కెమెరాలు, ర్యాంపులతో పాటు ఎకరానికి రెండు షెడ్డులు చొప్పున ఏర్పాటు చేయాలి. ఇన్‌గేటులో రిజిస్టర్ ఏర్పాటు చేసి పశువులను తెచ్చిన యజమాని వివరాలు నమోదు చేసి ఒక్కో జంతువుకు ఐదు రూపాయల చొప్పున వసూలు చేయాలి. జంతువులను కొనుగోలు చేసిన వ్యక్తి స్థానిక పశువైద్యుని నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ప్రత్యేక వాహనాల్లో ఎండ తగలకుండా వాటిని తరలించాలి. వెహికల్ ఇన్‌స్పెక్టరు ఈ తరహా రవాణా వాహనాలను ద్రువీకరించాలి. వాహనాలకు జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలి.
ఫ అక్రమంగా రవాణా అవుతుండగా పట్టుబడ్డ ఆవులను తిరిగి వారికే అప్పగించకుండా గోశాలకు అప్పగించాలి. దేవాలయాలకు 300 మీటర్ల దూరంలో ఎటువంటి జంతు బలులు జరగకుండా బోర్డులను ఏర్పాటు చేయాలి. పవిత్రమైన దినాలలో మాంసం చేపలు దుకాణాలు తెరవకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.