Share News

cows facing problems గోవిలవిల

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:10 AM

cows facing problems మూగజీవాలు బలైపోతున్నాయి. చిన్న వయసులోనూ అర్ధాంతరంగా ఆయువు కోల్పోతున్నాయి. అసౌకర్యాల నడుమ సంతలకు తరలుతూ వ్యాపార వస్తువులుగా మారిపోతున్నాయి.

cows facing problems గోవిలవిల
పెదమానాపురం సంతలో విక్రయానికి ఉన్న పశువులు

గోవిలవిల

కబేళాలకు తరలిపోతున్న మూగజీవాలు

డ్రోన్‌లు, సీసీ కెమెరాలున్నా ఆగని అక్రమ రవాణా

అప్పుడప్పుడు తనిఖీల్లో పట్టుబడుతున్న పశుమాంసం

మూగజీవాలు బలైపోతున్నాయి. చిన్న వయసులోనూ అర్ధాంతరంగా ఆయువు కోల్పోతున్నాయి. అసౌకర్యాల నడుమ సంతలకు తరలుతూ వ్యాపార వస్తువులుగా మారిపోతున్నాయి. ఈ అన్యాయన్ని ప్రశ్నించేవారు కరువవుతున్నారు. అక్రమార్కులకు మూగజీవాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పశువుల మార్కెట్‌ ముసుగులో కబేళాలకు పశువులను తరలించి పశుమాంసం అక్రమంగా రాత్రి సమయాల్లో ఎగుమతి చేస్తున్నారు. పోలీసుల కళ్లు కప్పి రవాణా చేస్తున్నారు. అప్పుడప్పుడు వాహన తనిఖీల్లో పట్టుబడుతున్నా రవాణా మాత్రం ఆగడంలేదు.

గజపతినగరం, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పెదమానాపురం, అలమండ, అచ్చుతాపురం తదితర ప్రాంతాల్లో వారపు సంతరోజు పశువుల విక్రయాలు అత్యధికంగా సాగుతున్నాయి. వాటిని మార్కెట్‌లకు తరలించే క్రమంలో గోవులు నరకయాతన ఎదుర్కొంటున్నాయి. నాలుగు ఆవులు సరిపోయే వ్యాన్‌లో పదింటిని కుక్కి తరలిస్తున్నారు. దీంతో గమ్యం చేరుకునే సరికి ఒకటి రెండు ఆవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని కాళ్లు విరిగి బాధపడుతున్నాయి. దారి మధ్యలో ఎక్కడైనా పోలీసులకు చిక్కినా నాయకులు, వ్యాపారుల నుంచి ఒత్తిళ్లతో వదిలేస్తున్నారు. దీనివల్ల కబేళాల వ్యాపారం భారీగా సాగుతోంది.

సంత నుంచి కబేళాలకు

ప్రతివారం దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం సంత నుంచి కబేళాలకు పశువులు అధికంగా తరలిపోతున్నాయి. ఒడిశా, ఇతర రాష్ట్రాలనుంచి పశువులను గురువారం నుంచి పెదమానాపురం చేరుకుంటాయి. శనివారం సంత కావడంతో వ్యాపారులు శుక్రవారానికి చేరుకొని పశువులను కొనుగోలు చేసి భారీ వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారు. మాంసం రూపంలో కూడా ఎగుమతి అవుతున్నాయి. అధికారులకు పట్టుబడకుండా అడ్డదారుల్లోనూ తీసుకెళ్తుంటారు. సోమవారం జరిగే అలమండ సంతకు కాలి నడకన పశువులను తరలించి అక్కడి నుంచి వ్యాపారులు కబేళాలకు తీసుకుపోతున్నారు.

మార్కెట్‌లలో కానరాని వసతులు

మార్కెట్‌లలో సీసీ కెమెరాలు లేవు. అలాగే సంతకు వచ్చే పశువులకు నీళ్ల తొట్టెలు, గడ్డివాములు ఏర్పాటు చేయాలి. పశు వైద్యుల సూచన మేరకే కాలినడకన పశువులను తరలించారు. వాహనాల్లో ఇతర ప్రాంతాలకు పశువులను తరలిస్తే ఒకటి లేదా రెండు పశువులకు మాత్రమే అనుమతి ఉంటుంది. గతంలో రెవెన్యూ, పోలీస్‌, పశువైద్యం, ఈవోపీఆర్‌డీ అధికారుల కమిటీ పశు అక్రమ రవాణాపై చర్యలు తీసుకునేది. నేడు ఆ పరిస్థితులు ఎక్కడా లేవు.

మారిన ఆలోచన

ప్రస్తుతం వ్యవసాయరంగంలో యాంత్రీకరణ పెరగడంతో రైతులు పశు పోషణను భారంగా భావిస్తున్నారు. పూర్వం పశు పోషణకు ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పొలం గట్టు మీద పచ్చగడ్డి, మొక్కజొన్న, పిల్లి పెసర, సొప్పలాంటి పచ్చిమేత వేసి వాటిని పశువులకు ఉపయోగించేవారు. నేడు ఆ పరిస్థితి లేక పోవడంతో పశువుల పెంపకం రైతులకు భారంగానూ, పశువులకు శాపంగానూ మారింది. గతంలో ఒట్టిపోయిన పశువులను వ్యవసాయ పనులకు ఉపయోగించేవారు. ఇప్పుడు సాగుకు యంత్రాలు రావడంతో వాటిని వదిలించుకోవడానికి రైతులు ప్రయత్నిస్తున్నారు.

లైసెన్స్‌ లేకుండా రవాణా

లైసెన్స్‌ లేకుండా కబేళాకు పశువులను తరలించడం చట్ట రీత్యా నేరం. అధికారులు మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడం లేదు. గూడ్స్‌ వ్యాగన్‌ వంటి వాహనాల్లో పశువులను తరలిస్తే అధికారులు తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలి. ఆ వాహనాలకు ఆర్టీవో అనుమతులు ఉండాలి. ఇవేవీ రవాణాదారులు పట్టించుకోవడం లేదు.

లోగిశ రామకృష్ణ, ఆంధ్ర ప్రదేశ్‌ గోసంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు

నిఘా పెట్టాం

పశువులను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్‌ చేస్తున్నాం. ఇటీవలే బొండపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యాన్‌ను గుర్తించి సీజ్‌ చేశాం. మానాపురం సంతలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వాహనాల తనిఖీల్లో పశువుల మాంసం, గంజాయి పట్టుబడుతున్నాయి. ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

- జీఏవీ రమణ, సీఐ, గజపతినగరం

Updated Date - Oct 15 , 2025 | 12:10 AM