cows facing problem గోవ్యధ
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:16 AM
cows facing problem కంటోన్మెంట్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న గోవధ శాలపై ఈ నెల 2న వన్‌టౌన్ పోలీసులు దాడి చేశారు. 600 కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ గోవధ శాల నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో పోలీసులు దాడిచేసి రెండు వాహనాలతో పాటు కత్తులను సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
గోవ్యధ
విజయనగరంలో మూగజీవాలతో అక్రమ వ్యాపారం
అనధికారికంగా వధిస్తూ మాంసం ఎగుమతి
సంవత్సరాలుగా అనుమతులు లేకుండా నిర్వహణ
ప్రజల నుంచి ఫిర్యాదుల పరంపర
తాజాగా పోలీసుల దాడిలో పట్టుబడిన 600 కిలోల మాంసం
- కంటోన్మెంట్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న గోవధ శాలపై ఈ నెల 2న వన్‌టౌన్ పోలీసులు దాడి చేశారు. 600 కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ గోవధ శాల నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో పోలీసులు దాడిచేసి రెండు వాహనాలతో పాటు కత్తులను సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
- గత ఏడాది జూలై 4న నగరంలోని కుమ్మర వీధి సమీపంలో రోటరీ శ్మశానవాటికకు వెళ్లే మార్గంలో అనధికారికంగా నిర్వహిస్తున్న గోవధ శాల గుట్టును గోసంరక్షకులు రట్టుచేశారు. నాలుగు క్వింటాళ్ల పశు మాంసం పట్టుకున్నారు. అక్కడ పదుల సంఖ్యలో పశువులను గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు.
విజయనగరం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి):
విజయనగరంలో గోవధను సంవత్సరాలుగా ఓ వ్యాపారంగా చేస్తున్నారు. అనుమతి లేకుండా కబేళాలు నిర్వహిస్తూ నిత్యం గోవులను చంపేస్తున్నారు. వాటి మాంసాన్ని ఇతర ప్రాంతాలకు సైతం రవాణా చేస్తున్నారు. జిల్లా నేతలు, కీలక అధికారులందరికీ ఈ వ్యవహారం తెలిసినా కట్టడి చేయలేకపోతున్నారు. ప్రజల నుంచి లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం మానేశారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ పశువధ శాలలు కొనసాగుతున్నాయి. ఎప్పుడో ఓసారి పోలీసులు దాడిచేయడం, కేసులు నమోదుచేయడం, అయినా తిరిగి వారు వ్యాపారం కొనసాగించడం పరిపాటిగా మారింది. ఒక్క కంటోన్మెంట్ ప్రాంతంలోనే మూడు పశువధ శాలలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అధికారులైతే పశువధ శాలలకు ఎటువంటి అనుమతులు లేవని చెబుతున్నారు.
- గోవధ శాలల నిర్వహణకు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా నల్లజాతి గోవులను వధించకూడదు. ఒకవేళ సాగుకు, పాడికి పనికి రాదని పశు వైద్యాధికారి ధ్రువపత్రం ఇచ్చిన తరువాత మాత్రమే వధించాలి. అది కూడా విశాఖకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. విజయనగరంలో వధించేందుకు ఎటువంటి అనుమతులు లేవు. అయినా విజయనగరంలో యథేచ్ఛగా పశువులను వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు.
రచ్చకెక్కిన వ్యాపారుల గొడవ
నగరంలో ఇటీవల పశుమాంసం విక్రయాలకు సంబంధించి వ్యాపారుల మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. అనధికారికంగా గత వైసీపీ నేతల అండదండలతో నాలుగైదు కుటుంబాలు మాత్రమే పశువధ శాలల నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయితే ఆ నాలుగు కుటుంబాలే బతకాలా? మిగతా వారు వద్దా? అని కొంతమంది ప్రశ్నించేసరికి వివాదం చోటుచేసుకుంది. ఈ తరుణంలో కొద్దిరోజుల పాటు వారి పంచాయితీ నడిచింది. ఇటీవల అందరూ సమావేశం కాగా అక్కడ ఘర్షణ జరిగినట్టు సమాచారం.
గతంలో పట్టించినా...
హిందూ ధర్మప్రచార సమితితో పాటు గోసంరక్షకులు గత ఏడాది కంటోన్మెంట్ ప్రాంతంలో గోవధ దృశ్యాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పెట్టడంతో పెను వివాదం నడిచింది. ఆ తరుణంలో కొత్తపేట కుమ్మరివీధి సమీపంలో నిర్వహిస్తున్న గోవధ శాలను అధికారులు తనిఖీ చేశారు. నాలుగు వేల టన్నుల మాంసాన్ని, పదుల సంఖ్యలో పశువులను పోలీసులు గుర్తించారు. అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కఠిన చర్యలకు ఉపక్రమించాలని పోలీసులను ఆదేశించారు. కొంతవరకూ కట్టడి జరిగింది. ఇప్పుడు మళ్లీ మొదలైంది. నగరంలో చాలా ప్రాంతాల్లో గోవధ కొనసాగుతున్నట్టు సమాచారం. ప్రతిరోజూ పదుల సంఖ్యలో పశువులను వధించి మాంసాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక హోటళ్లలో సైతం మేక మాంసం మాటున పశుమాంసం పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కఠిన చర్యలు తప్పవు
ఎస్పీ ఏఆర్ దామోదర్
జిల్లాలో కొన్నిచోట్ల ఎటువంటి అనుమతులు లేకుండా పశువధ జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చించి. దీంతో ఈ నెల 2వ తేదీన కంట్మోనెంట్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న స్లాటర్ హౌస్‌ను పరిశీలించగా గోవులను చంపి సుమారు 600 కేజీల మాంసాన్ని ఓ వ్యాన్‌లో తరలిస్తుండగా ఒకటో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. జిల్లాలో ఎక్కడైనా అక్రమ పశువధ జరిగితే 100 నంబర్‌కు ఫోన్‌చేసి కాని స్థానిక పోలీసులకు కాని సమాచారం ఇవ్వండి. అక్రమంగా పశువధ శాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇటీవల వాటి నిర్వాహకుడు మహ్మద్ ఇర్సాదుల్లా, సిబ్బంది కెళ్ల సురేష్ , షేక్ అబ్జల్‌ను అరెస్ట్ చేశాం.