Theft? ఇంటి దొంగల పనేనా?
ABN , Publish Date - May 02 , 2025 | 11:48 PM
Could It Be an Inside Theft? అటవీశాఖ పరిధిలో టేకు చెట్లు మాయమయ్యాయి. ఏకంగా 21 చెట్లను కొట్టించి అక్రమంగా తరలించారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే వాటిని సీజ్ చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు.
అక్రమంగా తరలిస్తున్న దుంగలను సీజ్ చేసిన అధికారులు
సాలూరు డిపోనకు తరలింపు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
స్థానిక సిబ్బంది తీరుపై ఆరోపణలు
పార్వతీపురం, మే 2 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ పరిధిలో టేకు చెట్లు మాయమయ్యాయి. ఏకంగా 21 చెట్లను కొట్టించి అక్రమంగా తరలించారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే వాటిని సీజ్ చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రాగా.. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
మక్కువ మండలం జంతికొండ ప్రాంతంలోని అటవీశాఖ పరిధిలో విలువైన టేకు చెట్లు ఉన్నాయి. అయితే కొద్దిరోజుల కిందట వాటి విషయమై పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామానికి చెందిన ఓ కలప వ్యాపారితో బేస్ క్యాంప్ గార్డు ముందుగా బేరం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఫోన్‌పే ద్వారా లావాదేవీలు జరుపుకున్న తర్వాత చెట్లు కొట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆ వ్యాపారి సుమారు 21 చెట్లు కొట్టించి అక్రమంగా తరలించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు తాళ్లబురిడి వద్ద కలపను సీజ్ చేసి సాలూరు అటవీశాఖ పరిధిలో ఉన్న డిపోకు తరలించారు. సుమారు 20 సంవత్సరాలుగా పెరుగుతున్న టేకు చెట్లకు కాళ్లు వచ్చాయంటే... అటవీశాఖ సిబ్బంది సహకారం లేనిదే సాధ్యం కాదన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో సీతంపేట మండలంలోనూ ఇదే విధంగా జరిగింది. టేకు చెట్లను అక్రమంగా కొట్టించి తరలించడంపై అప్పట్లో దర్యాప్తు నిర్వహించారు. తాజాగా మక్కువ ఘటనపై అటవీశాఖ ఇంటి దొంగల తీరు చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని.. కలప చెట్ల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లావాసులు కోరుతున్నారు.
దర్యాప్తు చేస్తున్నాం..
టేకు దుంగలను అక్రమంగా తరలించడంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దీనిపై ఇప్పటికే శాఖాపరమైన విచారణ చేపట్టాం. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం.
- ప్రసూన, డీఎఫ్‌వో, పార్వతీపురం మన్యం