Share News

cotton crap పత్తి రైతుకు పాట్లేనా?

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:40 PM

cotton crap పత్తి పంట చేతికి అందడానికి రేయింబవళ్లూ కష్టించిన రైతులు చివరకు మద్దతు ధర దక్కించు కోలేకపోతున్నారు. సమీపంలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దూరంగా ఉన్న రాజాం, రామభద్రపురం తరలించలేకపోతున్నారు.

cotton crap పత్తి రైతుకు పాట్లేనా?
అమ్మకానికి సిద్ధంగా పత్తి

పత్తి రైతుకు పాట్లేనా?

కానరాని మద్దతు ధర

సమీపంలో ప్రారంభించని కొనుగోలు కేంద్రం

రాజాం తరలించాలంటే రవాణా చార్జీల భారం

గ్రామాల్లోకి దళారులు

తక్కువ ధరకు బేరాలాడుతున్న వైనం

పత్తి పంట చేతికి అందడానికి రేయింబవళ్లూ కష్టించిన రైతులు చివరకు మద్దతు ధర దక్కించు కోలేకపోతున్నారు. సమీపంలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దూరంగా ఉన్న రాజాం, రామభద్రపురం తరలించలేకపోతున్నారు. రవాణా చార్జీల భారం మోసేకంటే దళారులకు అప్పగించడమే మేలని భావించి తక్కువ ధరకు పంటను అప్పగిస్తున్నారు. రైతుల పరిస్థితిని చూసి కొందరు వ్యాపారులు మరీ తక్కువ ధరకు అడుగుతున్నారు. ప్రభుత్వం పంటను కొనుగోలు కేంద్రానికి తరలించడానికి రవాణా సౌకర్యం కల్పించి ఉంటే ఈ దుస్థితి ఉండేదికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గజపతినగరం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఏ పంట సాగు చేసినా తగిన గిట్టుబాటు ధర పొందలేకపోతున్నారు. ఖరీప్‌ సీజన్‌లో వరి పంటతో పాటు మెట్టు ప్రాంతాల్లో పత్తి పంటను సాగు చేస్తారు. ఈ పంట ఇంటికి చేరినా గిట్టుబాటు లేక అమ్ముకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజపతినగరం సబ్‌ డివిజన్‌ పరిధిలోని గజపతినగరం, ద త్తిరాజేరు, మెంటాడ, బొండపల్లి మండలాలకు సంబంధించి గత ఏడాది 450 హెక్టార్లలో పత్తి సాగు చేయగా ఈఏడాది సుమారు 382 హెక్టార్లలో సాగు చేశారు. అధిక వర్షాలు, తుఫాన్‌ దెబ్బలను తట్టుకుని పంటను నిలబెట్టుకున్నారు. ఎకరాకు 7నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయితే సమీపంలో కొనుగోలు కేంద్రం లేక తగిన ధర పొందలేకపోతున్నారు. దళారులు గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారు.

ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.8,110 కాగా దళారులు రూ.5000 నుంచి రూ.5,500కు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల పత్తి రైతుకు లాభం లేకపోగా పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంటోంది. పత్తి పంట సాగు చేపట్టే రైతులు విత్తనాలు వేసిన నాటినుంచి దక్కులు, పురుగుమందుల కోసం ఎకరాకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రకృతి సహకరించలేదు. అధిక వర్షాలు, తుఫాన్ల కారణంగా కొంత పంట పోయిందని, మిగిలిన పంట చేతిక వచ్చినా ఫలితం లేకపోతోందని రైతులు వాపోతున్నారు. కొనుగోలుకేంద్రాలు రాజాం, రామభద్రపురంలో ఏర్పాటు చేశామని, అక్కడకు తీసుకువెళ్లి విక్రయించాలని, రవాణా ఖర్చులను రైతులే భరించాలని అధికారులు సూచిస్తున్నారు. సబ్‌డివిజన్‌ పరిధిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే నాలుగు మండలాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.

ఈక్రాప్‌తోనూ అవస్థలు

పత్తి సాగు చేసిన చాలా మంది రైతులు అవగాహన లేక ఈక్రాప్‌ చేయించుకోలేదు. దీనివల్ల పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లినా కొనడం కష్టమే. ఇదంతా చూస్తున్న దళారులు రైతులతో బేరాలాడి తక్కువ ధరకు పంటను తీసుకుంటున్నారు. గజపతినగరం మండలంలో తమ్మారాయుడు, ఎం.గుమడాం, కొత్తశ్రీరంగరాజపురం, పురిటిపెంట, లింగాలవలస తదితర గ్రామాల్లో పత్తిపంటను ఎక్కువ మంది సాగుచేశారు. వీరెవరూ పంటను కొనుగోలు కేంద్రానికి తరలించడం లేదు.

అధికారులు సహకరించాలి

ఈక్రాప్‌ నమోదు చేయకపోవడం వల్ల పత్తిపంటను విక్రయించలేకపోతున్నాం. పండిన పంటను ఇంటివద్ద దాచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు చొరవ తీసుకుని రవాణా ఏర్పాట్లు చేస్తే కొంత ఉపయోగం ఉంటుంది.

దనాన రామునాయుడు, రైతు, తమ్మారాయుడుపేట

దళారులను నమ్మవద్దు

ఈక్రాప్‌ నమోదుకాని రైతులు సీఎం యాప్‌ ద్వారా ఈక్రాప్‌ నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.8,110 ప్రకటించింది. రాజాం, రామభద్రపురంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు పంటను నేరుగా కేంద్రానికి తీసుకువెళ్లి అమ్మకాలు చేపట్టవచ్చు. దళారులను నమ్మవద్దు.

- కిరణ్‌కుమార్‌, ఏవో, గజపతినగరం

Updated Date - Nov 25 , 2025 | 11:40 PM