Corn sprout మొక్కజొన్నకు మొలక
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:11 PM
Corn sprout మొంథా తుఫాన్ ఉధృతికి జిల్లాలో వరితో పాటు ఇతర పంటలకూ నష్టం వాటిల్లింది. ప్రధానంగా మొక్కజొన్నకు కొన్నిచోట్ల మొలకలు వచ్చేశాయి. కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి.
మొక్కజొన్నకు మొలక
మొంథా తుఫాన్‌తో కూరగాయల పంటలకూ నష్టం
ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విన్నపం
గజపతినగరం/ రామభద్రపురం, నవంబరు 2(ఆంఽధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ఉధృతికి జిల్లాలో వరితో పాటు ఇతర పంటలకూ నష్టం వాటిల్లింది. ప్రధానంగా మొక్కజొన్నకు కొన్నిచోట్ల మొలకలు వచ్చేశాయి. కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి. మొక్కజొన్నకు సంబంధించి గజపతినగరం వ్యవశాయశాఖ సబ్ డివిజన్ పరిధిలో గజపతినగరం మండలంలో 22ఎకరాలు, దత్తిరాజేరులో 527, మెంటాడ మండలంలో 326 ఎకరాల్లో సాగు చేయగా దత్తిరాజేరు మండలంలోని గడసాం గ్రామంతో పాటు కొన్ని గ్రామాల్లో పంటకు తీవ్ర నష్టం వచ్చింది. ఆ గ్రామంలో 350 హెక్టార్లలో 700 మంది రైతులకు చెందిన 200 టన్నులకు పైగా పంట దెబ్బతిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తడిసిన మొక్కజొన్నను ఆరబెట్టగా మొలకలు రావడంతో ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు సింగారపు లక్ష్మణ, కొమ్మి సీతారాం, సారికి అచ్చుంనాయుడు, సింగారపు తౌడు, తాడ్డి అప్పలనాయుడు కోరుతున్నారు.
300 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం
జిల్లాలోనే అత్యధికంగా రామభద్రపురం మండలంలో కూరగాయల సాగు చేస్తున్నారు. మొంథా తుఫాను ప్రభావానికి మండలంలో సుమారు 300 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్టు హార్టీకల్చర్ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కాలీఫ్లవర్, టమాటాకు ఎక్కువ నష్టం వచ్చిందని గుర్తించారు. రామభద్రపురం, ఆరికతోట, కొండకెంగువ, నాయుడువలస తదితర ప్రాంతాల్లో కూరగాయల పంటలు పోయాయి. పాదుల్లో నీరు నిల్వ ఉండిపోవడంతో ఊట పట్టి పంట నష్టం ఎక్కువగా జరిగింది. దీనిపై హార్టీకల్చర్ ఆఫీసర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ కూరగాయల పంటల్లో నీరు బయటకు పంపించి బూస్టర్ డోస్ కింద ఎకరాకు 5 కిలోల పొటాష్, 5 కిలోల యూరియా వేస్తే భూమిలో ఉన్న చెమ్మ పోయి మళ్లీ మొక్కలు పెరుగుతాయన్నారు.
665.69 హెక్టార్లలో పంటలకు నష్టం
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలోని 665.69 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ జేడీ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. వరి 644.03, మొక్కజొన్న 6.40 హెక్టార్లు, పత్తి 4.93 హెక్టార్లు, మినుములు 1.01 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. నష్టపోయిన రైతుల వివరాలన్నీ ఏపీ ఏఐఎంఎస్ పోర్టల్ నమోదు చేస్తామని పేర్కొన్నారు.