రెడ్డివానివలసలో కార్డన్ సెర్చ్
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:20 AM
ఆ గిరిజన గ్రామంలో అడుగుపెడితే సారా, మడ్డికల్లు వాసన స్వాగతం పలుకుతుంది.
30 లీటర్ల సారా, వెయ్యి లీటర్ల మడ్డికల్లు ధ్వంసం
మెంటాడ, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఆ గిరిజన గ్రామంలో అడుగుపెడితే సారా, మడ్డికల్లు వాసన స్వాగతం పలుకుతుంది. అక్కడున్న 30 కుటుంబాల్లో రమారమి 20 కుటుంబాలు సారా, మడ్డికల్లు తయారీ, అమ్మకంపై జీవనం సాగిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ గ్రామంపై మూకుమ్మడి దాడిచేశారు. కొండలింగావలస పంచాయతీ శివారు గిరిజన గ్రామమైన రెడ్డివానివలసలో సారా, మడ్డికల్లు తయారీ స్థావరాలపై ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. గజపతినగరం సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వ హించారు. మడ్డికల్లు తయారీకి సిద్ధంగా ఉంచిన వెయ్యి లీటర్ల ముడిసరుకు, 30 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. వాటిని గ్రామం బయట ధ్వంసం చేశారు. ఈసందర్భంగా సీఐ రమణ మాట్లాడుతూ సారా, మడ్డికల్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, అనర్థాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆండ్ర ఎస్‌ఐ సీతారాం, గజపతినగరం, బూర్జివలస ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, నాయుడు, ఏఎస్‌ఐలు ఐవీ.రమణ, గోపినాయుడు, రమణ, సుమారు 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.