‘Cooperation’ is So-So! ‘ సహకారం’ అంతంతే!
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:03 AM
‘Cooperation’ is So-So! సహకార సంఘాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచి ఆర్థికంగా దోహదపడాలి. వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలి. సంఘాల్లోని రైతులకు అవసరమైన రుణాలు, వడ్డీ రాయితీలు కల్పిస్తూ బ్యాంకులకు దీటుగా వ్యవహరించాలి. విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తూ సాగుకు తోడ్పాటునందించాలి. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
అవగాహన కల్పించని అధికారులు
నేడు ప్రపంచ సహకార దినోత్సవం
గరుగుబిల్లి, జూలై4(ఆంధ్రజ్యోతి): సహకార సంఘాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచి ఆర్థికంగా దోహదపడాలి. వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలి. సంఘాల్లోని రైతులకు అవసరమైన రుణాలు, వడ్డీ రాయితీలు కల్పిస్తూ బ్యాంకులకు దీటుగా వ్యవహరించాలి. విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తూ సాగుకు తోడ్పాటునందించాలి. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ కేంద్రాలు ఇప్పుడు రాజకీయాలకు పునారావసంగా మారిపోయాయి. రైతులకు సేవ సంగతి అటుంచితే.. వారికి అందాల్సిన పథకాల గురించి కూడా అధికారులు అవగాహన కల్పించడం లేదు. నేడు ప్రపంచ సహకార దినోత్సవం సందర్భంగా జిల్లాలో పరిస్థితిపై ప్రత్యేక కథనం..
ఉమ్మడి జిల్లాలో..
పరస్పర ప్రయోజనం కోసం కొంతమంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి సహకార నియమాలు పాటిస్తూ నడిపే సంఘాన్ని సహకార సంఘంగా గుర్తిస్తారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో 1964 తర్వాత 164 సంఘాలు ఉండేవి. ప్రస్తుతం పార్వ తీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల పరిధిలో 18 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 45,671 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. విజయనగరం జిల్లాలో 31 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. సుమారు 75,545 మంది రైతులు వాటిల్లో సభ్యులుగా ఉన్నారు. అయితే రైతులకు సంబంధించి వ్యవసాయం, సాగు పరికరాలు, పాడి పరిశ్రమలకు అవసరమైన రుణాలను పీఏసీఎస్‌ల ద్వారా పూర్తిస్థాయిలో అందించడం లేదు. రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సకాలంలో రుణాలు తీర్చిన వారికి వడ్డీ రాయితీ ఇవ్వడం లేదు. బంగారంపై రుణాలు కూడా మంజూరు చేయడం లేదు. ఎరువులు, విత్తనాలు సరఫరాలో కొన్నిచోట్ల అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. సహకార మిత్ర పథకం కింద ఎకరాకు రూ.4 లక్షల నుంచి రూ. 5 లక్షలు వరకు రుణం ఇవ్వాల్సి ఉన్నా.. దీనిపై రైతులకు అవగాహన కల్పించడం లేదు. సీజనల్ అగ్రికల్చరల్ ఆపరేషన్ పథకం (ఎస్‌ఏవో), లాంగ్ టెర్న్ రుణాల (ఎల్‌టీ)ను కూడా మంజూరు చేయడం లేదు.
ఆన్‌లైన్ సేవలు
సహకార సంఘాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. దీనిలో భాగంగా సహకార సంఘాల పరిధిలో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతున్నారు. గతంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు గాను ప్రతి సభ్యునికి ఈకేవైసీ చేయిస్తున్నారు. సంఘాల పరిధిలో లావాదేవీలు, రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుప రుస్తున్నారు. మన్యం జిల్లాకు సంబంధించి 18 సంఘాల పరిధిలో 45,671 మందికి గాను 39,043 మందికి, విజయనగరం జిల్లాలో 75,545 మందికి గాను 64,679 మందికి ఈకేవైసీ చేశారు.
పట్టించుకోని వైసీపీ సర్కారు..
సంఘాల పరిధిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్‌చార్జిలతో నెట్టుకొచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొత్తగా పార్టీ నేతలకు అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పింది. అయితే ప్రజాస్వామ్యం పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే సంఘాలు పూర్తిస్థాయిలో బలోపేతమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బలోపేతానికి చర్యలు
సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఉమ్మడి జిల్లాల పరిధిలోని 94 ప్రాథమిక సహకార సంఘాలకు డీసీసీబీ నుంచి పూర్తిస్థాయిలో రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ ఏడాది రూ. 2600 కోట్ల లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఏడాది రూ. 2165 కోట్లు లావాదేవీలు నిర్వహించాం. డీసీసీబీ బ్యాంకుకు రూ. 7.66 కోట్లు నిరక ఆదాయం వచ్చింది. ఇందులో ఒక శాతం పీఏసీఎస్‌ల అభివృద్ధికి కేటాయించాం. వాణిజ్య బ్యాంకులకు దీటుగా పీఏసీఎస్‌లను సంఘాలను తీర్చిదిద్దుతున్నాం.
- సీహెచ్ ఉమామహేశ్వరరావు, సీఈవో, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, విజయనగరం