Controversy surrounding Jindal lands జిందాల్ భూముల చుట్టూ వివాదాలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:11 AM
Controversy surrounding Jindal lands జిందాల్ భూ నిర్వాసితుల ఆందోళనతో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. భూములు అప్పగించిన సమయంలో జరిగిన తప్పులను ఎత్తిచూపుతున్నారు. భూములమ్మి తాము మోసపోయాం.. కొనుగోలు చేసి మీరు కూడా మోసపోవద్దంటూ కొందరు కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు చూస్తున్నారని భూ నిర్వాసితుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
జిందాల్ భూముల చుట్టూ వివాదాలు
వైసీపీ ప్రభుత్వంలో ఓ సర్వే నెంబర్‌ను 22(ఎ) నుంచి తొలగించడంపై అనుమానాలు
పీవోటీలకు నష్టపరిహారం ఇవ్వకపోవడంపై అభ్యంతరాలు
మరోసారి తెరపైకి బినామీల వ్యవహారం
భూ నిర్వాసితుల ఆందోళనతో వెలుగులోకి వస్తున్న అక్రమాలు
- ఓ గ్రామ పరిధిలో దాదాపు 135 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం జిందాల్ యాజమాన్యానికి అప్పగించింది. అయితే ఏడాదిన్నర క్రితం వైసీపీ ప్రభుత్వంలో ఆ భూముల మధ్యనున్న ఓ సర్వే నెంబర్‌ను 22(ఎ) నుంచి తొలగించారు. అప్పట్లో ఈ భూమిని కూడా జిందాల్ యాజమాన్యానికి అప్పగించారని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూలో లోసుగులను అడ్డం పెట్టుకొన్న అధికారులు ఓ ప్రముఖ వ్యక్తికి సహకరించారు. నిర్వాసితుల ఆందోళనతో ఈ వ్యవహారం తాజాగా చర్చనీయాంశమైంది.
- 18 ఏళ్ల క్రితం జిందాల్ యాజమాన్యానికి 834 ఎకరాల వరకు అసైన్డ్ భూములను అప్పగించారు. ఇందులో 74.15 ఎకరాలు పీవోటీ (చేతులు మారిన) భూములంటూ వీటికి నష్టపరిహారం చెల్లించలేదు. దాదాపు రూ.3.50 కోట్ల వరకు ఈ పరిహారం ఉంటుంది. వీటి కోసం అప్పటి నుంచి సుమారు 18 మంది అసైన్డ్ రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతో మంది తహసీల్దార్‌లు మారారు. వీరి సమస్యను మాత్రం కొలిక్కి తీసుకురాలేదు.
శృంగవరపుకోట, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి):
జిందాల్ భూ నిర్వాసితుల ఆందోళనతో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. భూములు అప్పగించిన సమయంలో జరిగిన తప్పులను ఎత్తిచూపుతున్నారు. భూములమ్మి తాము మోసపోయాం.. కొనుగోలు చేసి మీరు కూడా మోసపోవద్దంటూ కొందరు కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు చూస్తున్నారని భూ నిర్వాసితుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. జెఎస్‌డబ్లూ అల్యూమినియం పరిశ్రమ నిర్మాణానికి శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, మూలబొడ్డవర, చీడిపాలెం, ముషిడిపల్లి, చినఖండేపల్లి గ్రామాల పరిధిలో అసైన్డ్, ప్రభుత్వ, జిరాయితీ భూములు 1166.64 ఎకరాల వరకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ భూముల్లో కేవలం 180.73 ఎకరాలు మాత్రమే జిరాయితీ భూములు. మిగిలిన వన్నీ అసైన్డ్, ప్రభుత్వ భూములే. ఇందులో అసైన్డ్ భూములు 843.66 ఎకరాలున్నాయి. అత్యధిక శాతం మంది గిరిజన రైతులు ఉన్నారు. వీరంతా ఆ భూముల్లో వ్యవసాయం చేసేవారు. ఈ భూములపై జిందాల్ యాజమాన్యం కన్నుపడింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ బలవంతంగా జిందాల్ యాజమాన్యం పరం చేశారు. భూములను అప్పగించే సమయంలో అనేక రకాల వివాదాలు తలెత్తాయి. వాటేటికీ పరిష్కారం చూపని యాజమాన్యం ఈ భూముల్లో పరిశ్రమలను నెలకొల్పలేదు. భూములిచ్చిన కుటుంబాలకు కల్పిస్తామన్న ఉద్యోగ, ఉపాధి, ఇతర మౌలిక సదుపాయాలను విస్మరించారు. భూనిర్వాసితులు పోరాటానికి దిగిన ప్రతి సారి ఏదో ఒక మాట చెప్పడం, తాత్కాలికంగా విరమింపజేయడం పరిపాటిగా మారింది. ఇంతవరకు కాలయాపన చేస్తూ వచ్చిన జిందాల్ యాజమాన్యం నిర్మిస్తామన్న అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేయకుండా ఎంఎస్‌ఎంఈ పార్కులు నిర్మాణం చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకుంది. ఇదే ఇప్పుడు భూ నిర్వాసిత రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
- ఈ భూముల్లో వ్యూహాత్మకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తెరలేపారన్న అనుమానాలు వున్నాయి. రెవెన్యూ అధికారులతో కుమ్మకైన ఓ ప్రముఖ వ్యక్తి జిందాల్‌కు ఇచ్చిన భూముల నుంచి కొన్ని సర్వే నెంబర్‌లను వేరు చేయడం, జిందాల్ చెల్లించిన నష్టపరిహారాన్ని వాటి యజమానులకు తిరిగి ఇప్పించడం, 22(ఎ)లో వున్న ఈ సర్వే నెంబర్ భూముల తొలగింపునకు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేయించడం, ఇతనే వాటిని తొలగించేందుకు వున్న ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం ఎంతోకొంత సొమ్మును చేతిలో పెట్టి ఆ భూములను చేజిక్కించుకోవడం.. తదితర పరిణామాలు జరిగినట్లు భూ నిర్వాసితుల నుంచి వినిపిస్తోంది. ఇలాంటి మోసాలెన్నో బయటపడుతుండడంతో భూములిచ్చిన రైతుల్లో ఆవేదన గూడుకట్టుకుంటోంది.
- దాదాపుగా 40 రోజుల నుంచి భూ నిర్వాసిలు ఆందోళన చేస్తున్నా ఇంతవరకు పరిశ్రమకు చెందిన ప్రతినిధులు ఎవరూ తమ గోడును ఆలకించేందుకు రాకపోవడంతో భూ నిర్వాసిత రైతులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. జిందాల్‌కు అప్పగించిన భూముల వ్యవహారంలో జరిగిన అవినీతి, అక్రమాలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలంటున్నారు.