ప్రభుత్వ ఐటీఐ స్థలంపై వివాదం
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:00 AM
: బొబ్బిలి పట్టణంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)కు చెందిన ఎకరా స్థలంపై వివాదం రగులుతోంది.
- 2005లో ఈ స్థలం పర్యాటక శాఖకు అప్పగింత
- తరువాత ఓ ప్రైవేట్ హోటల్ సంస్థకు లీజు
- ఇప్పుడు ఓ నాయకుడి చేతికి..
-విద్యార్థులు, ప్రజా సంఘాల ఆందోళన
బొబ్బిలి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)కు చెందిన ఎకరా స్థలంపై వివాదం రగులుతోంది. ఈ స్థలాన్ని ఓ నాయకుడు థర్డ్‌పార్టీ నుంచి లీజు తీసుకోవడంపై విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలాన్ని ఐటీఐ ఐటీఐ విస్తరణకు, విద్యార్థుల అవసరాల మేరకు వినియోగించా లని డిమాండ్ చేస్తున్నారు. రాష్ర్టీయ రహదారి పక్కన బొబ్బిలి ఐటీఐకి ఉన్న ఎకరా స్థలాన్ని 2005లో అప్పటి అధికారులు టూరిజం శాఖకు అప్పగించారు. అప్పట్లో ప్రభుత్వ ఐటీఐ శాఖ డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన తరువాత నాటి కలెక్టర్ ఆదేశాలతో టూరిజం శాఖకు స్థలాన్ని కేటాయించారు. పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీని సైతం నిర్మించారు. బొబ్బిలి వీణలు, చేనేత వస్ర్తాలు, ఇత్తడి, కంచుతో తయారు చేసిన సామగ్రిని చేతివృత్తిదారులు అమ్ముకునేందుకు, ప్రదర్శించేందుకు మూడు షాపులతో కూడిన సముదాయాన్ని అక్కడ నిర్మించారు. వాటి వెనుక మరో భవనాన్ని కట్టారు. వాటిని హంగూ, ఆర్భాటంతో వాటిని అప్పట్లో ప్రారంభించారు. అయితే, పట్టుమని పది రోజులైనా అక్కడ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించలేదు. దీంతో రెండు దశాబ్దాల నుంచి ఆ షాపులు, భవనం వృథాగా పడి ఉన్నాయి. వాటిని కొంతమంది స్థానికులు పశువుల కొట్టాం కింద వాడుకుంటుండగా, మరికొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు.
2022లో టూరిజం శాఖ ఈ స్థలాన్ని ఓ ప్రైవేట్ హోటల్ సంస్థకు లీజు ప్రాతిపదికన అప్పగించింది. వారు కూడా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. తాజాగా పట్టణానికి చెందిన ఓ బీజేపీ నాయకుడు ఈ స్థలాన్ని థర్డ్‌పార్టీ సంస్థ నుంచి లీజుకు తీసుకొని, దాన్ని చదును చేస్తున్నారు. 20 సంవత్సరాల లీజుకు (రూ.2.50 కోట్ల పెట్టుబడిపై ఒకశతం) ఇక్కడ రిసార్ట్ప్, హోటల్ వంటివి ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ విషయం తెలియడంతో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి.
ప్రభుత్వ ఐటీఐకి చెందిన విలువైన స్థలాన్ని ఐటీఐ విస్తరణకు, విద్యార్థుల అవసరాలకు మాత్రమే వినియోగించాలి తప్ప వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగిస్తే సహించేది లేదని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. ఐటీ, ఏఐ, ఇతర సాంకేతిక రంగాలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆ స్థలంలో టెక్నికల్ విద్య సంబంధిత హబ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా భూసేకరణ చేయడం చాలా కష్టమని, ఉన్న భూమిని కాపాడుకోకుండా ప్రైవేట్ వ్యక్తుల అవసరాలకోసం కేటాయించడం అన్యాయమని అంటున్నారు. 20ఏళ్ల కిందట జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసి విలువైన ఈ స్థలాన్ని ఐటీఐ బహుళ ప్రయోజనాలకోసం మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మాకు సమాచారం లేదు
బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐకి చెందిన ఎకరా స్థలాన్ని మా శాఖ డైరెక్టర్ అనుమతితో 2005లో అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో టూరిజం శాఖకు అప్పగించారు. హేండ్‌క్రాఫ్ట్స్ కార్యకలాపాల నిర్వహణ కోసం టూరిజం శాఖకు స్థలాన్ని కేటాయించినట్లు మా వద్ద ఉన్న అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు స్పష్టం చేస్తున్నాయి. 2022లో టూరిజం శాఖ శ్రీవెన్ హోటల్స్ సంస్థ లీజుకు ఇచ్చింది. ఆ సంస్థ ఏ విధమైన కార్యకలాపాలు చేస్తున్నదీ మాకు ఎటువంటి సమాచారం లేదు.
-శ్రీధర్, ప్రిన్సిపాల్, బొబ్బిలి ఐటీఐ