Share News

Control Through Awareness అవగాహనతోనే నియంత్రణ

ABN , Publish Date - Dec 01 , 2025 | 01:05 AM

Control Through Awareness చాపకింద నీరులా జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ విస్తరిస్తోంది. అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అవ గాహన లేక కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాలు సైతం వీధినపడుతున్నాయి.

 Control Through Awareness అవగాహనతోనే నియంత్రణ
పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో సేవలందిస్తున్న కేంద్రం

  • నమోదవుతున్న కొత్త కేసులు అప్రమత్తత అవసరం

  • నేడు ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం

పార్వతీపురం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): చాపకింద నీరులా జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ విస్తరిస్తోంది. అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అవ గాహన లేక కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాలు సైతం వీధినపడుతున్నాయి. 2022-23తో పోలిస్తే 2024-25లో జిల్లాలో ఈ వ్యాధి తీవ్రత 0.34 శాతానికి తగ్గింది. కాగా 2025-26లో ఇప్పటివరకు కేసుల నమోదు 0.39 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తం కావాల్సి ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా తమవంతు కృషి చేయాల్సి ఉంది. కళాజాత, చైతన్య కార్య క్రమాలు నిర్వహించాల్సి ఉంది. సోమవారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

ఇదీ పరిస్థితి...

జిల్లాలో 2022-2023లో 13,168 మంది పురుషులు, 12,390 మంది మహిళలు, 240 మంది ఇతరులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 105 మందికి హెచ్‌ఐవీ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. అదే ఏడాదిలో 24,430 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి వ్యాధి లక్షణాలు గుర్తించారు. 2023-24లో మొత్తంగా 28,730 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 137 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధారించారు. అదే సంవత్సరంలో 22,582 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఏడుగురికి ఆ వ్యాధి లక్షణాలున్నట్లు గుర్తిం చారు. 2024-25లో 25,786 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 87 మంది, 16,518 మంది గర్భిణులకు టెస్ట్‌లు చేయగా ఎనిమిది మంది ఆ వ్యాధి బారిన పడినట్లు నిర్ధారించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 18,427 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 35 మంది, 12516 గర్భిణుల్లో నలుగురికి హెచ్‌ఐవీ సోకినట్టు గుర్తించారు. జిల్లాలో ప్రస్తుతం 1608 మంది చికిత్స పొందుతున్నారు. దీనిపై జిల్లా ఎయిడ్స్‌, కుష్ఠు, టీబీ నివారణాధికారి ఎం.వినోద్‌ కుమార్‌ను వివరణ కోరగా.. ‘జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను పూర్తిస్థాయిలో నివారించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. అందుబాటులో ఉన్న వనరులను వినియోగిస్తూ ప్రతి వ్యక్తికి అవ గాహన కల్పిస్తున్నాం. అందరికీ వైద్య పరీక్షలు చేస్తూ.. అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తున్నాం.’ అని తెలిపారు.

అందుబాటులో మందులు..

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ తీవ్రతను తగ్గించే చాలా రకాల మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం అందుబాటులో ఉన్నాయి. 2008 నుంచి ఏఆర్‌టీ (యాంటీ రైట్రోవైరల్‌ థెరపీ ద్వారా)మందులు ఇస్తున్నారు. బాధితులకు నెలకు రూ.4వేలు చొప్పున పింఛన్‌ కూడా అందుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండు ఏఆర్టీలు, ఎనిమిది లింకు కేంద్రాలు, 13 ఐసీటీసీ ల్యాబ్‌లు, 3 సుఖ వ్యాధి చికిత్స కేంద్రాలు పనిచేస్తున్నాయి. రెండు జిల్లాల్లో ప్రైవేటు, ప్రభుత్వ పరీక్ష కేంద్రాలు 100 వరకూ ఉన్నాయి. గతంలో మాదిరిగా ఎయిడ్స్‌పై చైతన్య కార్యక్రమాలు తగ్గుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టేవి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులూ ముందుకు వచ్చేవారు. కళాశాలలు, గిరిజన ప్రాంతాలు, మురికివాడలు, పల్లెలకు వెళ్లి చైతన్యపరిచేవారు. వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడంతో ఆసక్తి ఉండేది. కానీ క్రమేపీ ప్రభుత్వాల ప్రోత్సాహాలు లేకపోవడంతో ఇటువంటి కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి.

ముందే మేల్కొవాలి..

ముందే గుర్తించి మేల్కొంటే ప్రాణాపాయం తప్పించుకోవచ్చు. హెచ్‌ఐవీని నియంత్రించే చాలారకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మద్యం మత్తులో యువత చిత్తు అవుతోంది. ఈ క్రమంలో తప్పటడుగులు పడుతున్నాయి. గిరిజన తాండాల్లో అవగాహన లేకపోవడం, బాధితులపై పర్యవేక్షణ కరువవ్వడం, కేసుల గుర్తింపులో జాప్యం తదితర కారణాలతో ఎక్కువ మంది ఆస్పత్రిపాలవుతున్నారు. ఎయిడ్స్‌ ప్రాణాంతకమైనప్పటికీ మందులు వాడితే కొంత కాలం ప్రాణాలు నిలపవచ్చు. కానీ అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్య. హెచ్‌ఐవీ పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అక్కడే రక్తనమూనాలు సేకరించి గంటలోపే ఫలితం వెల్లడిస్తారు. అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. కానీ కొందరు రకరకాల అనుమానాలతో అక్కడకు వెళ్లడం లేదు

ఎయిడ్స్‌ రహిత సమాజం అందరి బాధ్యత

ఎయిడ్స్‌ రహిత సమాజం అందరి బాధ్యత అని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌ఐవీపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తుందని పేర్కొన్నారు. వాటితో పాటు పౌష్టికాహారం తీసుకుంటే జీవన ప్రమాణం మెరుగుపడుతుందని వెల్లడించారు. జిల్లాలో ఏఆర్‌టీ సెంటర్లు, ఐసీటీఎస్‌ కేంద్రాలు, ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నా మన్నారు. ఆయన వెంట ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు జగన్మోహన్‌రావు, వినోద్‌కుమార్‌, పి.ఎల్‌.రఘుకుమార్‌ ఉన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 01:05 AM