అవగాహనతోనే నియంత్రణ
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:45 AM
జిల్లాలో హెచ్‌ఐవీ మహమ్మారి కలవరపెడుతోంది.
- జిల్లాలో చాపకింద నీరులా హెచ్‌ఐవీ, ఎయిడ్స్
- నమోదవుతున్న కొత్త కేసులు
- అప్రమత్తతే కీలకం
- నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం
- రాజాం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి హెచ్‌ఐవీ బారిన పడ్డాడు. గత 15 సంవత్సరాలుగా ఏఆర్‌టీ కేంద్రానికి వెళ్లి మందులు వాడుతున్నాడు. దీంతో ఆయువు పెంచుకున్నాడు. దైనందిన కార్యక్రమాల్లో ఎవరు సాయం లేకుండానే ముందుకెళుతున్నాడు.
రాజాం/విజయనగరం రింగ్‌రోడ్డు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో హెచ్‌ఐవీ మహమ్మారి కలవరపెడుతోంది. అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అవగాహన లేక కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాలు సైతం వీధినపడుతున్నాయి. సమాజంలో వివక్షకు గురవుతున్నాయి. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
గతంతో పోల్చితే తగ్గాయి..
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ (నాకో) సంస్థ నివేదిక ప్రకారం జిల్లాలో ఎయిడ్స్ తగ్గుముఖం పట్టింది. 2002లో పది శాతానికి మించి ఉంటే.. ఇప్పుడు దాదాపు 0.05 శాతానికి తగ్గముఖం పట్టడం ఉపశమనం కలిగించే విషయం. 2002 నుంచి ఇప్పటివరకూ గణాంకాలు పరిశీలిస్తే 7 వేల మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. ఏటా కొత్తగా వందల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వ్యసనాలు పెరగడం, ఆపై ఆర్థిక పరమైన ఇబ్బందులతో సెక్స్ వర్కర్లు పెరగడం కారణంగా పలువురు హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. ఒక్కోసారి రక్తం, అవయవ మార్పిడి, అస్తవ్యస్త వైద్య విధానంతో ఈ వైరస్ వ్యాపిస్తోంది. దీని తీవ్రతలో జిల్లా తొలి పది శాతంలో ఉండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా 15 నుంచి 49 సంవత్సరాల్లోపు వారు హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సెక్స్‌పరంగానే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఐదేళ్లల్లో 5,657 మరణాలు సంభవించగా, ఇందులో పురుషులు 3,579మంది, స్త్రీలు 2,078 మంది ఉన్నారు.
అందుబాటులో మందులు..
హెచ్‌ఐవీ విషయంలో చాలారకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ తీవ్రతను తగ్గించే చాలా రకాల మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం అందుబాటులో ఉన్నాయి. 2008 నుంచి ఏఆర్‌టీ (యాంటీ రైట్రోవైరల్ థెరపీ ద్వారా)మందులు ఇస్తున్నారు. బాధితులకు నెలకు రూ.4వేలు చొప్పున పింఛన్ కూడా అందుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండు ఏఆర్టీలు, ఎనిమిది లింకు కేంద్రాలు, 13 ఐసీటీసీ ల్యాబ్‌లు, 3 సుఖ వ్యాధి చికిత్స కేంద్రాలు పనిచేస్తున్నాయి. రెండు జిల్లాల్లో ప్రైవేటు, ప్రభుత్వ పరీక్ష కేంద్రాలు 100 వరకూ ఉన్నాయి. గతంలో మాదిరిగా ఎయిడ్స్‌పై చైతన్య కార్యక్రమాలు తగ్గుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టేవి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులూ ముందుకు వచ్చేవారు. కళాశాలలు, గిరిజన ప్రాంతాలు, మురికివాడలు, పల్లెలకు వెళ్లి చైతన్యపరిచేవారు. వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడంతో ఆసక్తి ఉండేది. కానీ క్రమేపీ ప్రభుత్వాల ప్రోత్సాహాలు లేకపోవడంతో ఇటువంటి కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి.
ముందే మేల్కొవాలి..
ముందే గుర్తించి మేల్కొంటే ప్రాణాపాయం తప్పించుకోవచ్చు. హెచ్‌ఐవీని నియంత్రించే చాలారకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మద్యం మత్తులో యువత చిత్తు అవుతోంది. ఈ క్రమంలో తప్పటడుగులు పడుతున్నాయి. గిరిజన తాండాల్లో అవగాహన లేకపోవడం, బాధితులపై పర్యవేక్షణ కరువవ్వడం, కేసుల గుర్తింపులో జాప్యం తదితర కారణాలతో ఎక్కువ మంది ఆస్పత్రిపాలవుతున్నారు. ఎయిడ్స్ ప్రాణాంతకమైనప్పటికీ మందులు వాడితే కొంత కాలం ప్రాణాలు నిలపవచ్చు. కానీ అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్య. హెచ్‌ఐవీ బయటపడితే కుటుంబ పరువు ఎక్కడిపోతుందోనని చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు మనో వ్యధకు గురై మరింత కృంగిపోయి మరణిస్తున్నారు. అయితే హెచ్‌ఐవీ సోకిన వెంటనే మరణం రాదు. ఏఆర్టీ కేంద్రాలకు వెళ్లి మందులు వాడితే కొంతకాలం హాయిగా జీవించవచ్చు. దీనిపై ప్రచారం పెరగాల్సిన అవసరం ఉంది.
ఇంటి వద్దే పరీక్షలు..
హెచ్‌ఐవీ పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 100కుపైగా ఉన్నాయి. కానీ కొందరు రకరకాల అనుమానాలతో అక్కడకు రావడం లేదు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొబైల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లాలో మొబైల్ వాహనాన్ని ప్రారంభించింది. ఇది నేరుగా గ్రామాల్లో తిరుగుతుంది. వీధుల్లో సైతం సంచరిస్తుంది. అవసరం అనుకుంటే వ్యాధిగ్రస్థుడి ఇంటి ముందే ఆగుతుంది. అక్కడే రక్తనమూనాలు సేకరించి గంటలోపే ఫలితం వెల్లడిస్తుంది. అందులో ల్యాబ్ టెక్నిషియన్‌తో పాటు కౌన్సిలర్ కూడా ఉంటారు. అన్ని అంశాలపై కౌన్సిలర్ అవగాహన కల్పిస్తారు.
వినియోగించుకోవాలి..
హెచ్‌ఐవీ వైరస్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో మందులు అందిస్తే చాలా ప్రయోజనం. చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రారు. అందుకే మొబైల్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఆ వాహనం సేవలను వినియోగించుకోవాలి.
- డాక్టర్ కె.రాణి, పర్యవేక్షణాధికారి, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, విజయనగరం
అవగాహన కల్పిస్తున్నాం
ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. బాధితులకు పౌష్టికాహారం అందజేస్తు న్నాం. అన్నిశాఖల సమన్వయంతో అన్ని సబ్‌జైళ్లల్లో ఖైదీలకు హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన, కౌన్సిలింగ్, రక్తపరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నాం. ఇప్పటివరకూ 1,977 మంది లబ్ధి పొందుతున్నారు. అవగాహనతోనే ఎయిడ్స్‌ను నియంత్రించవచ్చును. హెచ్‌ఐవీకి చికిత్స లేదు. కానీ నివారణ మాత్రం మన చేతుల్లో ఉంది. బాధితులపై వివక్ష చూపకూడదు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. అవగాహన కార్యక్రమాలు సైతం రూపొందిస్తున్నాం. ఔషధాలు అందుబాటులో ఉన్నాయి.
-డాక్టర్ ఎస్.జీవన్‌రాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, విజయనగరం