Share News

నిర్మాణాలు ఇక్కడ.. దరఖాస్తులు అక్కడ

ABN , Publish Date - May 06 , 2025 | 11:16 PM

జిల్లాలో విద్యా సంస్థలు, పరిశ్రమలు, సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్థు భవనాలు ఇలా ఏవైనా నిర్మించేందుకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పొందాలంటే విజయవాడలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాల్సిందే.

 నిర్మాణాలు ఇక్కడ.. దరఖాస్తులు అక్కడ
అగ్నిమాపకశాఖ కార్యాలయం

-అగ్నిమాపక అనుమతుల కోసం విజయవాడకు దరఖాస్తు చేసుకోవాల్సిందే

- రెన్యువల్‌కు కూడా..

- జిల్లా అధికారులకు కనీస సమాచారం కరువు

- ఇదీ అగ్నిమాపక శాఖలో పరిస్థితి

విజయనగరం క్రైం, మే 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యా సంస్థలు, పరిశ్రమలు, సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్థు భవనాలు ఇలా ఏవైనా నిర్మించేందుకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పొందాలంటే విజయవాడలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే అక్కడి నుంచే అనుమతులు వస్తున్నాయి. రెన్యువల్‌కు కూడా ఇదే విధంగా దరఖాస్తు చేసుకోవాలి. దీంతో స్థానిక అధికారులకు ఎటువంటి అధికారం లేకుండా పోయింది. ఫలితంగా జిల్లాలో ఎన్ని భవనాలను నిర్మిస్తున్నారు.. ఎన్నింటికి అనుమతి ఇస్తున్నారు వంటి విషయాలు స్థానిక అధికారులకు తెలియడం లేదు. ఏడాది కిందటి వరకూ జిల్లాలో ఎవరు ఏ నిర్మాణం చేపట్టినా అనుమతుల కోసం స్థానిక అగ్నిమాపకశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకునేవారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు వారి స్థాయిని బట్టి, నిర్మాణాన్ని అనుసరించి తనిఖీలు నిర్వహించి, అనుమతులు జారీ చేసేవారు. నిబంధనలకు అనుగుణంగా లేకపోతే, వాటిని తిరస్కరించేవారు. అదే విధంగా రెన్యువల్‌ విషయంలో కూడా సకాలంలో జిల్లా అగ్నిమాపక శాఖాధికారులు నోటీసులు జారీ చేసేవారు. నోటీసుకు స్పందించకపోతే, సదరు యాజమానిని కలిసి కారణం అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా ఫ్రెండ్లీ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో భవనాలకు సంబంధించి ఏ అనుమతి కావాలన్నా విజయవాడలోని అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయానికి యజమానులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో ఇక్కడ చేపడుతున్న కట్టడాలకు అసలు యాజమానులు దరఖాస్తు చేస్తున్నారా? లేదా అన్నది కూడా జిల్లా అగ్నిమాపకశాఖ ఆధికారులకు కనీస సమాచారం ఉండడం లేదు. దీనివల్ల జిల్లాలో బహుళ అంతస్థుల భవనాలు తదితర నిర్మాణాలు గుట్టుచప్పుడుగా పూర్తవుతున్నాయి.


జిల్లాలో సినిమా థియేటర్లు 21, ప్రైవేటు కళాశాలల భవనాలు 107, జిల్లా కేంద్రం విజయనగరంలో 5 వాణిజ్య సముదాయాలు, ప్రధాన ఆసుపత్రి భవనాలు 10, పరిశ్రమలకు సంబంధించి మధ్యతరహా, భారీ పరిశ్రమలు దాదాపుగా 20 వరకూ ఉన్నాయి. వీటితో పాటు పారిశ్రామికవాడల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. వీటికి నిర్దేశించిన సమయంలోగా రెన్యువల్‌ చేయాలి. కొత్త నిర్మాణాలు చేపడితే, వాటికి అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. జిల్లా అధికారులకు తనిఖీ, రెన్యువల్‌, కొత్తవాటికి అనుమతిచ్చే అవకాశం లేకపోవడంతో ఏమి చేయలేని నిస్సయస్థితిలో ఉన్నారు. ఏ అనుమతి కావాలన్నా విజయవాడలో ఉన్న ప్రధాన కార్యాలయానికి దరఖాస్తు చేసుకుని, అక్కడి నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిందే.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం

కొత్త భవనాలతో పాటు పాత భవనాల రెన్యువల్‌కి సంబంధించి విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచి అనుమతులు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే, అక్కడి నుంచే అనుమతులు వస్తున్నాయి. ఏడాది కిందటి వరకూ ఈ ప్రక్రియ ఇక్కడే జరిగేది. ఉన్నతాధికారులు ప్రస్తుతం ఫ్రెండ్లీ విఽధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంతో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. ఆ సమస్యను ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం.

-రామ్‌ప్రకాష్‌, జిల్లా అగ్నిమాపకశాఖాధికారి, విజయనగరం

Updated Date - May 06 , 2025 | 11:16 PM