Share News

బాగుజోల-చిలకమెండంగి రోడ్డు నిర్మాణం పూర్తి

ABN , Publish Date - Jul 28 , 2025 | 12:14 AM

బాగుజోల నుంచి చిలకమెండంగి వరకు రహదారి నిర్మాణం పూర్తయిందని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. రూ.2.50 కోట్లతో రోడ్డు పనులు చేపట్టినట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

 బాగుజోల-చిలకమెండంగి రోడ్డు నిర్మాణం పూర్తి
బాగుజోల నుంచి చిలకమెండంగి వరకు చేపట్టిన రోడ్డు పనులు

పార్వతీపురం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): బాగుజోల నుంచి చిలకమెండంగి వరకు రహదారి నిర్మాణం పూర్తయిందని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. రూ.2.50 కోట్లతో రోడ్డు పనులు చేపట్టినట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘గత ఏడాది డిసెంబర్‌ 20న మక్కువ మండలం బాగుజోలలో పలు గిరిజన రహదారులకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ శంకుస్థాపన చేశారు. బాగుజోల నుంచి చిలకమెండంగి వరకు 2.50 కిలో మీటర్ల రహదారి ఫార్మేషన్‌ పూర్తయింది. వర్షాకాలం తర్వాత బీటీ వేస్తారు. ప్రస్తుతం ఈ రోడ్డు ద్విచక్ర వాహనాలు, అంబులెన్స్‌లు, జీపులు, కార్లు వంటి వాహనాలు తిరిగేందుకు అనువుగా ఉంది. గుమ్మలక్ష్మీపురం మండలం పాములగేశాడ-మంత్రజాల రహదారి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రూ.3.60 కోట్లతో ఈ పనులు చేపడుతున్నాం. కొండ శిఖర గ్రామమైన మంత్రజల రోడ్డు ఫార్మేషన్‌ పూర్తయింది. త్వరలో దీనిని తారు రోడ్డుగా మారుస్తాం. రహదారి నిర్మాణం పూర్తయితే మంత్రజలలో నివసిస్తున్న సుమారు 300కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. సాలూరు మండలం బాగుజోల నుంచి సిరివర వరకు 6.60 కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేయడానికి ప్రభుత్వం రూ.9కోట్లు మంజూరు చేసింది. పాచిపెంట మండలం అల్లూరు నుంచి రిట్టపాడు వరకు ఉన్న మట్టి రోడ్డును రూ.4కోట్లతో తారురోడ్డుగా మారుస్తాం. అటవీ అనుమతులు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం.’ అని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Jul 28 , 2025 | 12:14 AM