construction for buildings anotherised కూల్చుతున్నా కడుతున్నారు!
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:19 AM
construction for buildings anotherised నగరంలో అనధికార నిర్మాణాలు, బహుళ అంతస్థుల భవనాలు పెరుగుతున్నాయి. వాటిని గుర్తించి కూలుస్తున్నా ఇతర చోట్ల మళ్లీ వెలుస్తూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. అనుమతులు తీసుకోకుండా కొందరు వ్యక్తులు భారీ భవనాలు నిర్మిస్తున్నారు. వారికి నేతల అండ ఉన్నట్లు తెలుస్తోంది.
కూల్చుతున్నా కడుతున్నారు!
నగరంలో యథేచ్ఛగా అనధికార నిర్మాణాలు
నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు
పక్కాగా అనుమతులు తీసుకోకుండా పనులు
విజయనగరం రింగురోడ్డు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి):
నగరంలో అనధికార నిర్మాణాలు, బహుళ అంతస్థుల భవనాలు పెరుగుతున్నాయి. వాటిని గుర్తించి కూలుస్తున్నా ఇతర చోట్ల మళ్లీ వెలుస్తూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. అనుమతులు తీసుకోకుండా కొందరు వ్యక్తులు భారీ భవనాలు నిర్మిస్తున్నారు. వారికి నేతల అండ ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలోని తోటపాలెం వద్ద ఓ వ్యక్తి ప్రైవేటు వసతిగృహం కోసం బహుళ అంతస్తుల భవనం నిర్మించాడు. నిబంధనలు అతిక్రమించి మెట్లను, లిఫ్ట్‌ను ఏర్పాటు చేశాడు. దీనిని టౌన్ ప్లానింగు అధికారులు గుర్తించి తొలగించారు. ఆ తర్వాత కొద్దిరోజులు ఆగిన భవన యాజమాని పునఃనిర్మాణం చేపట్టాడు. పద్మావతినగర్‌లోని ఓ గ్రూప్ హౌస్ నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించకపోవడంతో ప్లానింగ్ సిబ్బంది కొంత కట్టడాన్ని తొలగించారు. మళ్లీ కొద్ది రోజుల్లోనే ఆయన మరో ఫ్లోర్ నిర్మాణం చేపట్టాడు.
- తోటపాలెం ఐనాక్స్ థియేటర్ వద్ద ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనుమతుల్లేకుండా అదనపు భవనం నిర్మించడంతో టౌన్ ప్లానింగు సిబ్బంది వాటిని కూల్చివేశారు. కొద్ది రోజుల్లో మళ్లీ నిర్మాణం చేపట్టడం గమనార్హం.
పర్యవేక్షణ లేక
నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగు విభాగంలో ఇద్దరు అసిస్టెంట్ సిటీప్లానర్లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టరు, ఆయా సచివాలయాల పరిధిలో ప్రణాళిక కార్యదర్శులు నగరంలో అనధికార నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాని ఈ పర్యవేక్షణ కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడు లేదా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రమే ఒక తంతుగా జరుగుతోంది. కొత్తగా నిర్మాణాలు ప్రారంభించినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వుంటే ప్రారంభ దశలోనే వాటిని గుర్తించి ఆపాల్సిన యంత్రాంగం నిర్మాణాలు పూర్తయ్యే వరకూ కిమ్మనడం లేదు. ఒకసారి అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు వస్తే దానిని కూల్చివేయడానికి నగరపాలక సంస్థ భారీగా ఖర్చుచేయాల్సి వస్తుంది. కూల్చివేత కోసం ఎక్సకవేటర్లు, కార్మికులు, పోలీసు భద్రతకు వేలరూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ కూల్చివేత జరిగిన కొన్నిరోజులకే అదే స్థలంలో మళ్లీ నిర్మాణాలను మొదలుపెడుతున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ ధనం వృథా అవుతోంది తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు.
చర్యలు కరువు
అక్రమ నిర్మాణాన్ని కూల్చిన తరువాత మళ్లీ పనులు చేపట్టే యాజమానులపై ఎటువంటి చర్యలు ఇంతవరకూ తీసుకున్న దాఖలాలు లేవు. ముందుగా తీసుకున్న ప్లాన్‌లో సెల్లార్‌లను పార్కింగ్ కోసం చూపించి ఆ తరువాత అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. సెల్లార్‌లను షాపులుగా, గౌడౌన్లుగా మార్చుతున్నారు. ఫలితంగా ఆయా చోట్ల పార్కింగ్‌కు స్థలం లేక రహదారిమీదే వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
- కాలువలు, రహదారులు ఆక్రమించి బఫర్ జోన్ నిబంధనలను కూడా అతిక్రమిస్తున్నారు.
- రెసిడెన్షియల్ నిర్మాణాలకు అనుమతులు తీసుకుని కమర్షియల్ అవసరాల కోసం నిర్మాణాలు చేపడుతున్నారు. తద్వారా నగరపాలక సంస్థ ఆదాయానికి గండికొడుతున్నారు.
- కొందరు వ్యక్తులు నేతల సహకారంతో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు.
- అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించకుండా సెట్‌బ్యాక్స్ లేకుండా నిర్మించిన భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఫైర్ అదుపు చేసే వాహనాలు లోపలికి చేరుకోవడం కష్టం. దీనివల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువ.
- డ్రైనేజీ సదుపాయం లేకుండా నిర్మాణం చేపట్టడం వల్ల మురుగునీటి సమస్య తలెత్తుతోంది.
- కంటోన్మెంట్, గాయిత్రీనగర్, కాలిఘాట్ కాలనీ, దాసన్నపేట, పూల్‌బాగ్, తోటపాలెం, రింగురోడ్డు ఏరియా, డాబాతోట, కేఎల్‌పురం తదితరప్రాంతాల్లో అనుమతులు లేని కట్టడాలు కోకొల్లలుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 15 అడుగుల స్థలం కూడా లేని సందులో భవనాలు నిర్మించడం కొసమెరుపు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాల విషయంలో శాశ్వత చర్యలు చేపట్టాలి.
చర్యలు తప్పవు
అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం. క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగిస్తున్నాం. అదనపు భవనాల నిర్మాణానికి నగరపాలకసంస్థ ప్రణాళికా విభాగం అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలి. నిబంధనలు అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- పి.నల్లనయ్య, కమిషనర్, నగరపాలక సంస్థ
=================