TET టెట్‌పై అయోమయం
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:10 AM
Confusion over TET ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఇన్ సర్వీసు టీచర్లలో గందరగోళం నెలకొంది. ఈ విషయంపై వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. టెట్ లేని వారంతా రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
రివ్యూ పిటీషన్ వేయాలనుకుంటున్న ప్రభుత్వం
తుది తీర్పుపైనే టీచర్ల భవితవ్యం
జియ్యమ్మవలస, నవంబరు4(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఇన్ సర్వీసు టీచర్లలో గందరగోళం నెలకొంది. ఈ విషయంపై వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. టెట్ లేని వారంతా రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీచేసిన టెట్ నోటిఫికేషన్‌లో ఇన్ సర్వీస్ టీచర్లకూ టెట్ రాసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఇదే సమయంలో ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు టెట్ మినహాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. కాగా న్యాయస్థానం తుది తీర్పుపైనే టీచర్ల ‘టెట్’ భవితవ్యం ఆధారపడి ఉం టుంది.
ఇదీ పరిస్థితి
- జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 1,589 స్కూళ్లు ఉన్నాయి. వాటిల్లో మండల పరిషత్ , ప్రాథమికోన్నత, జడ్పీ ఉన్నత పాఠశాలలు 904 , ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత బడులు 100 వరకూ ఉన్నాయి. ఏపీ మోడల్ స్కూళ్లు 4, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐలు 5, ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐలు 14, బీసీ వెల్పేర్ స్కూళ్లు మూడు, గిరిజన సంక్షేమ ప్రభుత్వ పాఠశాలలు 421, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 65, కేజీబీవీలు 14, మినీ గురుకులాలు రెండు, మున్సిపల్ స్కూళ్లు 44, ప్రైవేట్ ఎయిడెడ్ బడులు 13 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు మరో 114 వరకూ ఉన్నాయి.
- ఈ 1,589 పాఠశాలల్లో 4,872 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నట్లు అధికారిక గణాం కాలు చెబుతున్నాయి. వారిలో హెచ్‌ఎంలు 130 మంది, ఎంటీఎస్ టీచర్లు 78 మంది, పీఈటీలు 66 మంది, ప్రిన్సిపాళ్లు 31 మంది, స్కూల్ అసిస్టెంట్లు 1,910 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ) 2,657 మంది ఉన్నారు. కానీ ఎంతమంది 2011 సంవత్సరానికి ముందు ఇన్ సర్వీ సులో ఉన్నవారో తెలియని పరిస్థితి. కారణం జిల్లాలో భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాలు ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో, మిగిలిన 11 మండలాలు విజయనగరం జిల్లాలో సర్వీసు రిజిస్టర్లు ఉన్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం..
ఇన్ సర్వీసు టీచర్లు టెట్ తప్పనిసరిగా పాసవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీని ప్రకారం 2010-11 విద్యా సంవత్సరానికి ముందు డీఎస్సీల ద్వారా నియమితమైన టీచర్లందరూ టెట్ పాసవ్వాలి. ఇందులో ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న టీచర్లకు మినహాయింపు ఇచ్చారు. అయితే పదోన్నతులు పొందాలంటే మాత్రం టెట్ కచ్చితంగా పాసవ్వాలనే నిబంధన పొందుపరిచింది. వాస్తవంగా 2010 ఏప్రిల్ 1న విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చింది. 2011లో టీచర్లకు టెట్ తప్పనిసరి అని అందులో పొందుపరిచారు. దీనిలో భాగంగా ఆ తరువాత టెట్ పాసైన వారే ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు.
టీచర్లకు సవాల్
2011 ముందు టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సవాల్‌గా మారింది. ఎందుకంటే టెట్ 150 మార్కులకు ఉంటుంది. ఇందులో పిల్లల అభివృద్ధి, బోధనాశాస్త్రం 30 మార్కులు, మాతృ భాష 30 , ఇంగ్లిషు 30 , గణితం 20 , భౌతిక , రసాయన శాస్త్రలు (సైన్స్) నుంచి 20 చొప్పున మార్కులు ఉంటాయి. ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టుకు సంబంధించి మరో 20 మార్కులు ఉంటాయి. అయితే స్కూల్ అసిస్టెంట్లు 6 నుంచి 10 తరగతుల వరకు ఒకే సబ్జెక్టు బోధిస్తారు. కాబట్టి మిగిలిన సబ్జెక్టులపై ప్రత్యేక తర్ఫీదు అవసరం. లేకుంటే టెట్ పాసవ్వడం కష్టం. ఇన్ సర్వీసులో ఉన్న టీచర్లకు అకడమిక్ అర్హత మార్కుల్లో సడలింపు ఇచ్చారు. కానీ టెట్ అర్హత మార్కుల్లో సడలింపు ఇవ్వలేదు. ఉపాధ్యాయ విద్య ప్రమాణాల నియంత్రణ , పర్యవేక్షణ సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఓసీలకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లల్లో ఇన్ సర్వీసు టీచర్లు 40 శాతం మార్కులతో పాసవ్వాల్సిందే.
ఈనెల 23 తుది గడువు
సుప్రీంకోర్టు తీర్పుతో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ రాసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తుకు తుది గడువు ఈ నెల 23గా నిర్ణయించింది. అయితే ఈ టెట్‌పై ఉపాధ్యాయ సంఘాలన్నీ భగ్గుమంటున్నాయి. ఇప్పటికే వీరు తమ నిర్ణయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి సర్వోన్నత న్యాయస్థానంలో రివ్యూ పిటీషన్ వేసేందుకు సిద్ధపడింది. కానీ గడువు సమీపిస్తున్న తరుణంలో కొందరు ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు టెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నట్లు విద్యాశాఖ చెబుతోంది. మిగిలిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రివ్యూ పిటీషన్ వేసినా పెద్దగా తీర్పులో మార్పు ఉండదని కొందరు టీచర్లు చెబుతున్నారు. పార్లమెంటులో మళ్లీ విద్యా హక్కు చట్టంపై చర్చ జరిగి.. సవరణ చేస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు.
ప్రభుత్వం స్పందించాలి
ఇన్ సర్వీసు టీచర్లు టెట్ పాసవ్వడం విషయంలో ప్రభుత్వం స్పందించాలి. తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలి.
- యర్రా శంకరరావు, జిల్లా కార్యదర్శి, ఏపీటీఎఫ్
===========================
స్పెషల్ టెట్ నిర్వహించాలి
ఒకవేళ సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించకపోతే ఇన్ సర్వీసులో ఉండి టెట్ అర్హత సాధించని ఉపాధ్యాయుల విషయంలో పాస్ మార్కులు కుదిస్తూ స్పెషల్ టెట్ నిర్వహించాలి.
- ఎన్.బాలకృష్ణారావు, జనరల్ సెక్రటరీ, ఏపీటీఎఫ్
===========================
వ్యతిరేకిస్తున్నాం..
ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ పాసవ్వాలనే నిబంధన పెట్టడంపై పునరాలోచించాలి. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
- టి.శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, జియ్యమ్మవలస