Confusion on Tet టెట్‌పై అయోమయం
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:03 AM
Confusion on Tet ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఇన్ సర్వీసు టీచర్లలో అయోమయం నెలకొంది. ఈ విషయంపై వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. టెట్ లేని వారంతా రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ జారీచేసిన టెట్ నోటిఫికేషన్‌లోనూ ఈ విషయం పేర్కొంది. అయితే ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు టెట్ మినహాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. న్యాయస్థానం తుది తీర్పుపైనే టీచర్ల ‘టెట్’ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
టెట్‌పై అయోమయం
రెండేళ్లలో ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అన్న సుప్రీంకోర్టు
మినహాయించాలని ప్రభుత్వానికి సంఘాల విన్నపాలు
రివ్యూ పిటీషన్ వేయాలనుకుంటున్న ప్రభుత్వం
తుది తీర్పుపైనే ఉపాధ్యాయుల భవితవ్యం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఇన్ సర్వీసు టీచర్లలో అయోమయం నెలకొంది. ఈ విషయంపై వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. టెట్ లేని వారంతా రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ జారీచేసిన టెట్ నోటిఫికేషన్‌లోనూ ఈ విషయం పేర్కొంది. అయితే ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు టెట్ మినహాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. న్యాయస్థానం తుది తీర్పుపైనే టీచర్ల ‘టెట్’ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
నెల్లిమర్ల, నవంబరు4(ఆంధ్రజ్యోతి):
టెట్ అనేది ఉపాధ్యాయ నియామకాలకు అర్హత పరీక్ష. టెట్ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లో 2011 నుంచి అమల్లోకి వచ్చింది. 2011కు పూర్వం జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ ప్రక్రియ లేదు. ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న వారిలో ప్రధానంగా 1989, 1995,1996,1998, 2000,2002, 2005,2008 డీఎస్‌సీ నియామకాల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు టెట్ లేకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. వీరందరూ టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీం కోర్టు, ఎన్‌సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్)తాజాగా షరతు విధించింది. అయితే వీరిలో 5 సంవత్సరాలు కన్నా తక్కువ సర్వీసు ఉన్న వారికి టెట్ అర్హత అవసరం లేదని సడలింపు ఇచ్చింది.
2012, 2014, 2018 డీఎస్‌సీ నోటిఫికేషన్‌లతో పాటు తాజాగా జరిగిన మెగా డీఎస్‌సి 2025లో ఉపాధ్యాయులుగా ఎంపికయిన వారు టెట్ అర్హతతోనే డీఎస్‌సీ పరీక్షకు హాజరైనందున వీరు మళ్లీ టెట్ రాయాల్సిన పనిలేదు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అటు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ రెండేళ్లలో టెట్ పాస్ కావాల్సినందేనని సుప్రీం కోర్టుతో పాటు ఎన్‌సీటీఈ నొక్కి చెప్పడంతో వారంతా టెట్ రాయడం విధిగా మారింది. కాగా టెట్ నోటిఫికేషన్ జారీ కావడంతో వారంతా దరఖాస్తు చేసుకునేందుకు అయిష్టంగానే సన్నద్ధమవుతున్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఈ పరీక్షకు హాజరేయ్యే ఉపాధ్యాయుల సంఖ్య సుమారు 10 వేల నుంచి 12 వేల మంది వరకు ఉంటుందని అంచనా..
టీచర్లకు సవాల్
2011కు ముందు టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఓ సవాల్‌గా మారింది. ఎందుకంటే టెట్ 150 మార్కులకు ఉంటుంది. ఇందులో పిల్లల అభివృద్ధి, బోధనాశాస్త్రం 30 మార్కులు, మాతృ భాష 30 , ఇంగ్లీషు 30, గణితం 20, భౌతిక , రసాయన శాస్త్రలు (సైన్స్) నుంచి 20 చొప్పున మార్కులు ఉంటాయి. ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టుకు సంబంధించి మరో 20 మార్కులు ఉంటాయి. అయితే స్కూల్ అసిస్టెంట్లు 6 నుంచి 10 తరగతుల వరకు ఒకే సబ్జెక్టు బోధిస్తారు. కాబట్టి మిగిలిన సబ్జెక్టులపై ప్రత్యేక తర్ఫీదు అవసరం. లేకుంటే టెట్ పాసవ్వడం కష్టం. ఇన్ సర్వీసులో ఉన్న టీచర్లకు అకడమిక్ అర్హత మార్కుల్లో సడలింపు ఇచ్చారు కానీ టెట్ అర్హత మార్కుల్లో సడలింపు ఇవ్వలేదు. ఉపాధ్యాయ విద్య ప్రమాణాల నియంత్రణ, పర్యవేక్షణ సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఓసీలకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లల్లో ఇన్ సర్వీసు టీచర్లు 40 శాతం మార్కులతో పాసవ్వాల్సిందే. టెట్ కోసం దరఖాస్తు చేసేందుకు తుది గడువు ఈనెల 23గా నిర్ణయించింది.
ఫ టెట్‌పై ఉపాధ్యాయ సంఘాలన్నీ భగ్గుమంటున్నాయి. ఇప్పటికే వీరు తమ నిర్ణయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి సర్వోన్నత న్యాయస్థానంలో రివ్యూ పిటీషన్ వేసేందుకు సిద్ధపడింది. అయితే గడువు సమీపిస్తున్న తరుణంలో కొందరు ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు టెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నట్లు విద్యాశాఖ చెబుతోంది. మిగిలిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రివ్యూ పిటీషన్ వేసినా పెద్దగా తీర్పులో మార్పు ఉండదని కొందరు టీచర్లు చెబుతున్నారు. పార్లమెంటులో మళ్లీ విద్యా హక్కు చట్టంపై చర్చ జరిగి.. సవరణ చేస్తేనే ప్రయోజనం ఉంటుందంటున్నారు.
మినహాయింపు ఇవ్వాలి
డి.ఈశ్వరరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలని షరతు విఽధించడంపై పునరాలోచన చేయాలి. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. నోటిఫికేషన్ సమయంలో టెట్ ప్రక్రియ లేదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కోర్టు పునః పరిశీలన చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాం
డి.రాము, యుటిఎఫ్ రాష్ట్ర అకడమిక్ కమిటి సభ్యుడు
సర్వీసులో దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఉపాధ్యాయులు టెట్ అర్హత ఉండాలన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంఘం పరంగా విన్నవించాం. టెట్ నుంచి ఇన్‌సర్వీస్ ఉపాఽధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేయాలి.
---------------