confuse situation ఔననలేక.. కాదనలేక!
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:15 AM
confuse situation గుర్ల మండలంలో ఏర్పాటు కానున్న స్టీల్‌ప్లాంట్ పరిశ్రమ అక్కడి రైతుల్ని త్రిశంకుస్వర్గంలో పడేస్తోంది. వ్యవసాయ భూములు పోతాయని ఓవైపు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో తమ పిల్లలకు ఉపాధి దొరుకుతుందేమోనన్న ఆశల్లోనూ ఉంటున్నారు. ఎటువైపు మగ్గాలో తేల్చుకోలేకపోతున్నారు.
ఔననలేక.. కాదనలేక!
వ్యవసాయ భూములు పోతాయని రైతుల్లో ఆవేదన
పిల్లల ఉపాధిపై ఆశలు
త్రిశంకు స్వర్గంలో స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులు
గుర్ల మండలంలో ఏర్పాటు కానున్న స్టీల్‌ప్లాంట్ పరిశ్రమ అక్కడి రైతుల్ని త్రిశంకుస్వర్గంలో పడేస్తోంది. వ్యవసాయ భూములు పోతాయని ఓవైపు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో తమ పిల్లలకు ఉపాధి దొరుకుతుందేమోనన్న ఆశల్లోనూ ఉంటున్నారు. ఎటువైపు మగ్గాలో తేల్చుకోలేకపోతున్నారు.
చీపురుపల్లి/గుర్ల, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి):
గుర్ల మండలంలోని కెల్ల పంచాయతీ పరిధిలో నూతనంగా స్టీల్ పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సుమారు రూ.8500 కోట్ల అంచనాతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ఇందుకోసం 1085 ఎకరాల వ్యవసాయ భూములను వదులు కోవాల్సి రావడంతో రైతులు కలవరపడుతున్నారు. పరిశ్రమ వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడడం మంచి విషయమే అయినప్పటికీ చాలా విలువైన వ్యవసాయ భూములు పోతాయని మథనపడుతున్నారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సదస్సులో ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఆ ప్రకారం ఇక్కడ సూపర్ స్మెల్టర్స్ స్టీల్‌ప్లాంటు ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం 221 జీవోను విడుదల చేసింది. అప్పటి నుంచి గుర్ల మండలంలోని కెల్ల, దమరసింగి, వల్లాపురం, బెల్లానపేట, మన్యపురిపేట గ్రామాల రైతులు ప్లాంటు ఏర్పాటుకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇక్కడ ప్లాంటు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్టు దమరసింగి గ్రామ పంచాయతీ ఈ నెల 8న తీర్మానం కూడా చేసింది. కాగా స్టీల్‌ప్లాంటు ఏర్పాటైతే కెల్ల, వల్లాపురం, మన్యపురిపేట, దమరసింగి గ్రామాలకు చెందిన వ్యవసాయ భూములు పోనుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. కెల్ల పంచాయతీ పరిధిలోని సుమారు 125 నివాసాలుండే బెల్లానపేట గ్రామం పూర్తిగా కనుమరుగు కానుంది. అదే జరిగితే ఆ గ్రామాల ప్రజలకు అవసరమైన పునరావాసం ఎక్కడ కల్పించాలన్నదానిపై ఇప్పటి దాకా స్పష్టత లేదు. ఈ కారణంగానే భూములివ్వడానికి ఆ గ్రామస్థులు మరింత భయపడు తున్నారు. తమకున్న కొద్దిపాటి వ్యవసాయ కమతాలను ప్రభుత్వం తీసుకుంటే వ్యవసాయం దక్కక తమ గొర్రెలు, మేకలకు గ్రాసం కూడా కరువవుతుందని వాపోతున్నారు. ఈ కారంణంగానే ప్లాంటు ఏర్పాటును వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
- భూ సర్వేపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2013-14లో జరిగిన భూ సర్వే ఆధారంగా భూముల వివరాలు నమోదు చేయడమేమిటని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిశ్రమ ఏర్పాటుకు కొన్ని వర్గాలు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటయితే వందలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతో పాటు స్కిల్డ్, అన్‌సిల్డ్ రంగాల్లో ఉన్న వారి జీవన పరిస్థితులు మెరుగవుతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
- ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన దాదాపు వెయ్యి ఎకరాల్లో ఎక్కువ శాతం అసైన్డ్ భూములు ఉన్నాయంటున్నారు. ఇవి కూడా వైసీసీ నాయకులు, వారి బంధువుల చేతిలో ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే ప్లాంటుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని వారంతా ముందుండి నడిపిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. పరిశ్రమ నెలకొల్పే విషయంలో అధికారులు ప్రజాభిప్రాయం మేరకు ముందుకు సాగాలన్న అభిప్రాయం ఎక్కువమంది నుంచి వ్యక్తమవుతోంది.