అగ్రిగోల్డ్ ఆస్తులపై సమగ్ర సర్వే
ABN , Publish Date - May 06 , 2025 | 11:13 PM
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులపై సమగ్రంగా సర్వే చేసి పూర్తి వివరాలను అందజేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ సేతుమాధవన్ ఆదేశించారు.
-వాస్తవ విలువను లెక్కించాలి
- ఇన్‌చార్జి కలెక్టర్ సేతు మాధవన్
విజయనగరం కలెక్టరేట్, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులపై సమగ్రంగా సర్వే చేసి పూర్తి వివరాలను అందజేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ సేతుమాధవన్ ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అగ్రిగోల్డ్ ఆస్తులు, వాటి స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్తులను పూర్తి సర్వే చేసి, వాటి వాస్తవ విలువను లెక్కించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో సీఐడీ డీఎస్పీ భూపాల్, విజయనగరం, బొబ్బిలి ఆర్డీవోలు కీర్తి, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాలు జరగకూడదు
జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన బ్లాక్ స్పాట్ ప్రదేశాల్లో మరో ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందని ఇన్‌చార్జి కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్‌ల వద్ద మరోసారి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణ నివేదికలు అందజేయని శాఖలకు చార్జీ మెమోలు జారీ చేస్తామని ఆయన అన్నారు.
చిత్తడి నేలలను పరిరక్షించాలి
పర్యావరణం కోసం జిల్లాలో చెరువులు, కాలువలు తదితర నీటి వనరుల వద్ద చిత్తడి నేలల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఇన్‌చార్జి కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. జిల్లా చిత్తడి నేలల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉప గ్రహ చిత్రాల ఆధారంగా 2,263 చిత్తడి నేలలను గుర్తించి, అటవీ శాఖ ద్వారా గ్రౌండ్, ట్రూతింగ కూడా పూర్తి చేశారని చెప్పారు. చినపతివాడ, చింతపల్లి గ్రామాల్లో కనుగొన్న రెండు సహజ కాలువలను చిత్తడి నేలలుగా గుర్తించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన శాఖల నుంచి మూడు రోజుల్లోగా నివేదికలు అందజేయాలని ఆదేశించారు.