Complexes of Hardships! అవస్థల కాంప్లెక్స్‌లు!
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:26 AM
Complexes of Hardships! జిల్లాలో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు సమస్యలకు నిలయాలుగా మారాయి. అంతటా మౌలిక వసతులు కొరవడ్డాయి. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు కాంప్లెక్స్‌ల ఆవరణలో పారిశుధ్యం క్షీణించింది. దుర్వాసన కారణంగా ప్రజలు ముక్కుమూసుకుని బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి.
ముక్కుమూసుకుని బస్సుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి
పనిచేయని ఫ్యాన్లు, లైట్లు
అంతంతమాత్రంగానే కుర్చీలు
నిర్వహణకు నోచని మరుగుదొడ్లు
తాగునీటి వసతి సరేసరి
వర్షం కురిస్తే ఇక అంతే సంగతి
ప్రయాణికులు తప్పని ఇబ్బందులు
ఇదీ జిల్లాలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ల పరిస్థితి
జిల్లాలో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు సమస్యలకు నిలయాలుగా మారాయి. అంతటా మౌలిక వసతులు కొరవడ్డాయి. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు కాంప్లెక్స్‌ల ఆవరణలో పారిశుధ్యం క్షీణించింది. దుర్వాసన కారణంగా ప్రజలు ముక్కుమూసుకుని బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి. కొన్నిచోట్ల కుర్చీలు మరమ్మతులకు గురయ్యాయి. ఫ్యాన్లు , లైట్లు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఇక పూర్తిగా చీకటిమయమే. వర్షం పడితే అంతే సంగతి. వర్షపునీరు కాంప్లెక్స్‌లోకి చేరుతుండడంతో ప్రజలు ముంపులో ఉండాల్సిన దుస్థితి. స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే కాంప్లెక్స్‌లో నెలకొన్న అసౌకర్యాల కారణంగా వారు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
జిల్లాకేంద్రంలో..
పార్వతీపురం టౌన్/ బెలగాం: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్వహణను గాలి కొదిలేశారు. దీంతో ఆ ప్రాంగణం పిచ్చిమొక్కలు, చెత్తా చెదారం, బురదతో అధ్వానంగా దర్శనమిస్తోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు కాంప్లెక్స్ ప్రాంగణంలోనే నిలిచిపోతుంది. పారిశుధ్యం లోపించగా.. దుర్వాసన కారణంగా ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విజయన గరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు రోజుకు కనీసం 15 వేల నుంచి 25 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తుం టారు. ఒడిశా, ఆంధ్ర సరిహద్దుల్లో పట్టణాలు, గ్రామాలకు ఆర్టీసీ డిపో నుంచి కనీసం రోజుకు 5వేల మంది నుంచి 10వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు. అయితే ఆయా బస్సుల కోసం గంటల కొద్దీ వేచి ఉన్న వారికి ఇక్కట్లు తప్పడం లేదు. కాంప్లెక్స్‌లో మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. వాటి నిర్వహణ కొర వడడంతో ఆరుబయట మలమూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి. మరోవైపు కుళాయిల నుంచి కలుషిత నీరే సరఫరా అవుతుండడంతో ప్రయాణికులు వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఇదే అదునుగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలోని షాపుల యజమానులు అధిక ధరలకు వాటిని అమ్ముతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని తినుబండారాలు, వస్తువులు విక్రయిస్తున్నా అధికారులు దృష్టి సారించడం లేదు. నో పార్కింగ్ బోర్డు వద్ద వాహనాలు నిలుపుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకపోతే కాంప్లెక్స్‌లో ఫ్యాన్లు పని చేయడం లేదు. బస్సుల సమాచారం తెలిపే వారు కూడా కరువయ్యారు.
పాలకొండలో పరిస్థితి ఇదీ..
పాలకొండ : పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న రెండు మరుగుదొడ్లు వినియో గంలో లేవు. నిర్వహణ సరిగా లేక వాటిని మూసివేశారు. సమీపంలో మరొకటి ఉన్నా నిర్వహణ అంతంతమాత్రంగా ఉంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణ సమీపంలోనే మూత్రవిసర్జన చేస్తుంటారు. ఇక కాంప్లెక్స్‌లో తాగునీటి కుళాయిలు, ట్యాంకర్ల నిర్వహణ కూడా సరిగా లేదు. ప్రయణికులు ఆ నీటిని తాగలేని పరిస్థితి. సమీపంలోని షాపుల్లోనే వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సి వస్తోంది. చాలీచాలని కుర్చీలు ఉండడంతో గంటలకొద్దీ ప్రయాణికులు బస్టాండ్‌లో నిల్చోవాల్సి వస్తోంది. ఇప్పటికే కొన్ని కుర్చీలు మరమ్మతులకు గురయ్యాయి. ఇదిలా ఉండగా రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఆర్టీసీ ప్రాంగణమంతా చీకటిమయంగా మారుతుంది. అరకొర వెలుతురులో ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇక వర్షం కురిస్తే భవనంపై నుంచి నీరు కారుతుంది. అప్పు డప్పుడు పెచ్చులూడుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రయాణికుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సాలూరులో ఇలా..
సాలూరు రూరల్: ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ముఖద్వారం సాలూరు. ఇక్కడ ఉండే ఆర్డీసీ కాంప్లెక్స్ నుంచే విశాఖ, విజయనగరం, బొబ్బిలి, శ్రీకాకుళం, పార్వతీపురంతో పాటు జగదల్‌పూర్, నవరంగపూర్, జైపూర్, దమన్‌జోడి తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి. నిత్యం ఈ ప్రాంతం నుంచి వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అయితే సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మౌలిక వసతులు కొరవడడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇక్కడ ఒక మరుగుదొడ్డి మాత్రమే వినియోగంలో ఉంది. స్నానాల గది, మరో మరుగుదొడ్డికి తాళాలు వేసి ఉంచారు. మరో వైపు తాగునీటికి ఆర్వో తదితర సురక్షిత పరికరాలు పలుచోట్ల వినియోగిస్తుండగా ఇక్కడ కుండ నీరే తాగాల్సి వస్తుంది. ఆర్టీసీ పరిసరాల్లో పొదలు, తుప్పలు తొలగించాల్సి ఉంది.
పరిశుభ్రంగా ఉంచాలి
పార్వతీపురం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘ జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పారిశుధ్య పనులు చేపట్టక ముందు.. ఆ తర్వాత ఫొటోలు తీయాలి. ఆ ప్రాంగణంలో మొక్కలు నాటించాలి. దివ్యాంగులు, వృద్ధులు బస్సులు ఎక్కేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. తాగునీరు, మరుగుదొడ్ల పై దృష్టి సారించాలి.’ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మరుగుదొడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత మాది.
- లక్ష్మణరావు, ఆర్టీసీ డిపో మేనేజర్ (ఇన్‌చార్జి) , పార్వతీపురం