Mobile Towers మొబైల్ టవర్ల నిర్మాణం పూర్తి చేయండి
ABN , Publish Date - May 29 , 2025 | 11:29 PM
Complete the Construction of Mobile Towers జిల్లాలో మొబైల్ టవర్స్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు.
పార్వతీపురం, మే 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొబైల్ టవర్స్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. ‘ జిల్లాలో ఇంకా 16 మొబైల్ టవర్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. వడబాయి, ఊటకోసు, వనబడి, సూరపాడు, చోర గ్రామాల వద్ద రహదారుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ చేశాం. వాటి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి. నిర్మాణాలు ఆలస్యమైతే సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తాం.’ అని తెలిపారు. అటవీ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించి ఆ శాఖ అనుమతుల జారీకి నిబంధనలు పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాత్సవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత, డీఎఫ్‌వో ప్రసూన తదితరులు పాల్గొన్నారు.
రెండు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. రెండు లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అటవీశాఖ మొక్కలు పంపిణీ చేయాలన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఉద్యాన, అటవీ, జలవనరుల తదితర శాఖలు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 38 శాతం పచ్చదనం ఉందని, దీనిని 50 శాతానికి పెంచడానికి వీలుగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
నేడు తోటపల్లిలో యోగాంధ్ర
తోటపల్లి ఐటీడీఏ పార్క్ వద్ద శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. గురువారం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. జూన్ 5న సీతంపేట ఎన్టీఆర్ అడ్వంచర్ పార్క్‌లో, 12న మక్కువ మండలం వీఆర్‌ఎస్ వద్ద ఉన్న ఏనుగుకొండ దగ్గర యోగాంధ్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు.