Hand Hygiene చేతుల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:14 PM
Complete Health Through Hand Hygiene
పార్వతీపురం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): చేతుల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఆహార పదార్థాలు తీసుకునే ముందు.. ఆ తర్వాత చేతులు శుభ్రపర్చుకోవడం అలవాటుగా మారాలని విద్యార్థులకు సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక డీవీఎం పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషక లోపం, ఆకలి మందగించడం, కడుపునొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. అందుకే వాటి నివారణకు ఆల్‌బెండాజోల్ మాత్రలను తప్పకుండా వేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ఆ మాత్రలను నమిలి మింగించారు. ఒక సంవత్సరం నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలు, విద్యార్థులతో తప్పకుండా ఆ మాత్రలు వేయించాలని సూచించారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల, కళాశాలల్లో డీ వార్మింగ్ డే నిర్వహించాలన్నారు. ఈ నెల 20న మాప్‌అప్ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. రక్తహీనతతో బాధపడుతున్న కిశోర బాలికలతో రోజూ ఐరెన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేయించాలని వైద్యాధికారులకు సూచించారు. డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు మాట్లాడుతూ.. 1,96,612 మందికి లక్ష్యంగా డీ వార్మింగ్ డే కార్యక్రమాన్ని ప్రారంభించగా 96 శాతం మందికి మాత్రలను వేశామన్నారు. రాష్ట్రస్థాయి పరిశీలకులు జిల్లాలో రెండు రోజులు పర్యటించి కార్యక్రమం ఏర్పాట్లు, జరిగిన తీరును పరిశీలించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే పీవో జగన్మోహన్‌రావు, డీఈవో రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సెల్ టవర్ల ఏర్పాటుపై సమీక్ష
జిల్లాలో 4జీ సెల్ టవర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పునఃపరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. 4జీ సెల్‌టవర్ల సమస్యలపై సబ్ కలెక్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే సెల్ టవర్లు స్థలాలు గుర్తించిన ప్రదే శాల్లో సిగ్నల్ వ్యవస్థ సరిగా లేనందున వాటికి ప్రత్యామ్నాయ స్థలాను గుర్తించాలన్నారు.
యువత చేతుల్లో దేశ భవిష్యత్
బెలగాం: దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత వారిపైనే ఉందని కలెక్టర్ తెలిపారు. కొత్తవలసలోని ఎస్‌వీడీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలో బాగా చదివే విద్యార్థులు ఉన్నారు. అందుకే పదో తరగతి, ఇంటర్, డిగ్రీల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలి. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అంబాసిడర్లుగా మారాలి.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.