Complete by December డిసెంబరు నాటికి పూర్తిచేయండి
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:55 PM
Complete by December ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద మంజూరైన రహదారి పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, జూలై 26(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద మంజూరైన రహదారి పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. జన్‌మాన్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులను మంజూరు చేస్తామని తెలిపారు. సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణం ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్నారు. జలవనరులశాఖ కింద జరుగుతున్న పనులను సకాలంలో పూర్తి చేసి ఖరీఫ్, రబీలకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ ఇంజనీరింగ్ అధికారి వీఎస్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలి
జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల రవాణాను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియం త్రణ , రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసేవారికి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. అటవీ ప్రాంతం నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలపై నిఘా పెట్టాలి. విద్యా సంస్థలపై మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా చూడాలి. రహదారి ప్రమాదాలను నియంత్రించాలి. నిబంధనలు పాటించని వాహనదారులకు అపరాధ రుసుం విధించాలి.’ అని తెలిపారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారికి జరిమానా విధిస్తున్నామన్నారు. ఏఎస్పీ అంకితా సురాన మహావీర్ మాట్లాడుతూ.. ‘జిల్లాలో ఇప్పటివరకు 1875 కేజీల గంజాయిను పట్టుకున్నాం. 22 మందిని అరెస్టు చేశాం. 12 వాహనాలను సీజ్ చేశాం. గుట్కా, ఫ్లేవర్డ్ పొగాకును విక్రయిస్తున్న 592 షాపులపై దాడులు చేసి 561 కేసులు నమోదు చేశాం. మొత్తంగా రూ.1,11,200 వరకు జరిమానా విధించాం.’ అని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.హేమలత, డీఎస్పీ ఎం.రాంబాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్, డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు పాల్గొన్నారు.