Share News

పారదర్శకంగా వినతులు పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:02 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి వచ్చే వినతులను పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత అన్నారు.

పారదర్శకంగా వినతులు పరిష్కరించాలి
వినతులు స్వీకరిస్తున్న డీఆర్వో హేమలత

- జిల్లా రెవెన్యూ అధికారి హేమలత

పార్వతీపురం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి వచ్చే వినతులను పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు సుధారాణితో కలిసి డీఆర్వో అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 203 వినతులు వచ్చాయి. వీరఘట్టం మండలం యు.వెంకమ్మపేట పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, వర్షాల సమయంలో శ్లాబు నుంచి నీరు లీకవుతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని, కొత్త భవనాన్ని మంజూరు చేయాలని గ్రామానికి చెందిన ఎస్‌.సింహాచలం అర్జీ అందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమిటిలో ప్రాథమిక పాఠశాలను మూసివేయడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, విద్యార్థుల భవిష్యత్‌ కోసం పాఠశాలను పునః ప్రారంభించాలని తాడంగి దమయంతమ్మ, గ్రామస్థులు దరఖాస్తు సమర్పించారు. కొత్త రేషన్‌కార్డు, ఒంటరి మహిళ పింఛను మంజూరు చేయాలని బలిజిపేట మండలం పి.చాకరాపల్లికి సీహెచ్‌ నరసమ్మ వినతిపత్రం సమర్పించింది. తన భూమికి ఆధార్‌ లింకు చేయాలని గరుగుబిల్లి మండలం వల్లరిగుడబకు అల్లు సింహాచలమమ్మ అర్జీ అందించింది. వీరఘట్టం మండలం అట్టలి గ్రామానికి చెందిన కె.వెంకటనారాయణకు వినికిడి పరికరాన్ని డీఆర్వో అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి అర్జీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు మానవతా కోణంలో ఆలోచించి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:02 AM