వారంలో రైతులకు పరిహారం
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:06 AM
జిందాల్ భూములకు సంబంధించి మిగిలి ఉన్న రైతులకు వారంరోజుల్లో పరిహారాన్ని అందజేయాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు.
- కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం కలెక్టరేట్ జూలై 11(ఆంధ్రజ్యోతి): జిందాల్ భూములకు సంబంధించి మిగిలి ఉన్న రైతులకు వారంరోజుల్లో పరిహారాన్ని అందజేయాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. తన చాంబర్‌లో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు చెల్లించిన పరిహారం, బకాయిలపై ఆరా తీశారు. సుమారు 28 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి 15 మంది రైతులకు పరిహారం పెండింగ్‌లో ఉండగా, వీరిలో ముగ్గురికి ఇటీవల చెల్లించినట్లు అధికారులు వివరించారు. మిగిలిన 11 మందికి కూడా వారం రోజుల్లో పరిహారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. భూములు తీసుకున్న సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం మాత్రమే వారికి వర్తిస్తుందని చెప్పారు. చట్ట ప్రకారం పరిహారం పెరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే 53 బోరు బావులకు సంబంధించి ఇప్పటి వరకు 28 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన వారికి కూడా వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవన్, ఆర్డీవో కీర్తి, ఎస్.కోట తహసీల్దార్ శ్రీనివాసరావు, డి.సెక్షన్ సూపరింటెండెంట్ తాడ్డి గోవింద తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాల పరిశీలనకు వచ్చిన బృందం
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు గాను నేషనల్ లెవెల్ మోనటర్స్ బృందం శుక్రవారం జిల్లాకు వచ్చింది. ఈ బృందం సభ్యులు కలెక్టర్ అంబేడ్కర్‌ను తన చాంబర్‌లో శుక్రవారం కలిశారు. వారి 10 రోజుల పర్యటన వివరాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ బృందం లీడర్లు సునీల్ బంట, నాతు సింగ్ ఆధ్వర్యంలో బాడంగి, బొబ్బిలి, విజయనగరం మండలాల్లో సభ్యులు పర్యటించనున్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సత్యనారాయణ, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ సావిత్రి, డ్వామా పీడీ శారదాదేవి, సర్వే శాఖ ఏడీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.