King Cobras కింగ్ కోబ్రాల కలకలం
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:46 PM
Commotion Over King Cobras జిల్లాలో కింగ్ కోబ్రాల కలకలం నెలకొంది. కొద్దిరోజుల కిందట కురుపాం మండలంలో ఆ విష సర్పం కనిపించగా.. సీతంపేటలో తాజాగా మరో కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయందోళన చెందారు.
తాజాగా సీతంపేటలో హల్‌చల్
భయాందోళనలో స్థానికులు
సీతంపేట రూరల్, సెప్టెంబరు8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కింగ్ కోబ్రాల కలకలం నెలకొంది. కొద్దిరోజుల కిందట కురుపాం మండలంలో ఆ విష సర్పం కనిపించగా.. సీతంపేటలో తాజాగా మరో కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయందోళన చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట గ్రామ సమీపంలోని ఓ నర్సరీ వెనుక భాగంలో ఉన్న పాడుబడిన రేకులషెడ్డులో సోమవారం 16 అడుగుల కింగ్‌కోబ్రా కనిపించింది. అయితే దీనిని గుర్తించిన పనివారు భయంతో పరుగులు తీశారు. యజమాని భుజంగరావుకు ఈ విషయం చెప్పడంతో ఆయన శ్రీకాకుళంలోని స్నేక్‌క్యాచర్, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో కొత్తూరు ఫారెస్ట్ బీట్ అధికారి దాలినాయుడు ఆధ్వర్యంలో స్నేక్‌క్యాచర్ షేక్ అబ్దుల్‌ఖాన్, సహాయకుడు అశోక్‌కుమార్‌లు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పాడుబడిన షెడ్డులో ఉన్న కింగ్‌కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం రిజర్వ్ ఫారెస్ట్‌లో దానిని విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా సీతంపేట ఏజెన్సీలో ఇంత పెద్ద కింగ్‌కోబ్రాను చూడటం ఇదే మొదటిసారని అటవీశాఖ బీట్ అధికారి దాలినాయుడు తెలిపారు. ఎంతో విషపూరితమైన ఈ సర్పం కాటువేస్తే నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. జనసంచారం లేని అటవీ ప్రాంతంలో ఆ పామును విడిచిపెట్టినట్లు తెలిపారు.