Share News

Gurukulam గురుకులంలో కలవరం

ABN , Publish Date - Oct 04 , 2025 | 01:10 AM

Commotion in the Gurukulam కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన విద్యార్థినులు పచ్చకామెర్ల లక్షణాలతో అస్వస్థతకు గురికావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

  Gurukulam గురుకులంలో కలవరం
జిల్లా కేంద్ర ఆసుప్రతిలో విద్యార్థినులను పరామర్శిస్తున్న కలెక్టర్‌

  • అందరికీ జాండీస్‌ లక్షణాలు

  • కలెక్టర్‌ ఆదేశాలతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ

  • జిల్లా కేంద్రాసుపత్రిలో 58 మందికి చికిత్స

  • కురుపాం, సాలూరు ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు

  • ఇద్దరిని విశాఖ కేజీహెచ్‌కు తరలింపు

  • మిగిలిన బాలికలందరికీ రక్త పరీక్షలు

  • రాష్ట్ర వైద్య బృందం పరిశీలన

పార్వతీపురం/బెలగాం/కురుపాం,అక్టోబరు3(ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన విద్యార్థినులు పచ్చకామెర్ల లక్షణాలతో అస్వస్థతకు గురికావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇద్దరు బాలికలు మృతి చెందగా.. మరోవైపు రోజురోజుకూ ఆసుపత్రుల్లో చేరిన విద్యార్థినుల సంఖ్య పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ఒకే పాఠశాలకు చెందిన వారు ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంపై కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి స్పందించారు. ఈ మేరకు శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ పాఠశాలలో చదువుతన్న 611 మంది విద్యార్థినులకు రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. అదే విధంగా ఇన్‌పేషెంట్లుగా చేరిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

విస్తృతంగా వైద్య సేవలు

దసరా సెలవులు ఇచ్చిన తర్వాత ఈ పాఠశాల విద్యార్థినులు స్వగ్రామాలకు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడ గ్రామానికి చెందిన పువ్వల అంజలి జాండీస్‌ లక్షణాలతో గతనెల 26న మృతి చెందింది. ఈ నెల ఒకటో తేదీన కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన తోయక కల్పన విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. మరికొందరు విద్యార్థినులు పచ్చ కామెర్ల లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. దసరా సెలవుల నిమిత్తం ఇళ్లకు వెళ్లిన ఆ పాఠశాల విద్యార్థినుల వద్దకు వైద్య సిబ్బంది వెళ్లి రక్త నమూనాలు సేకరించారు. శుక్రవారం వాటిని పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. సాలూరు, కురుపాం సీహెచ్‌సీల్లోనూ విద్యార్థినులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాకేంద్రాసుపత్రిలో 50 మంది విద్యార్థినులు చికిత్స పొందుతుండగా.. వారిలో టెన్త్‌, ఇంటర్‌ చదువుతున్న హిమరిక షర్మిల, ఎం.అనిత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వారిలో ముగ్గురు ఏకలవ్య పాఠశాల విద్యార్థినులున్నారు. మరోవైపు ప్రిన్సిపాల్‌ అనురాధను సస్పెండ్‌ చేస్తూ గురుకుల కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఆరా

జిల్లాకేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను శుక్రవారం కలెక్టర్‌ పరామర్శించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలికలకు పూర్తిగా నయమైన తర్వాతే డిశ్చార్జి ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ‘ కురుపాం పాఠశాలకు చెందిన విద్యార్థినులు దసరా సెలవుల నిమిత్తం ఇళ్లకు వెళ్లిన తర్వాత వారిలో పచ్చకామెర్లు లక్షణాలు ఉన్నట్టు రక్త పరీక్షల ద్వారా గుర్తించాం. కొంతమందిని జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. 50 మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 20 మంది పూర్తిస్థాయిలో కోలుకుం టున్నారు. వారిలో ఇద్దరు విద్యార్థినులకు కేజీహెచ్‌కు రిఫెర్‌ చేశాం. మిగిలిన బాలికలు ఇంటిలో ఉన్నా లేదా హాస్టల్‌ ఉన్నా వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించాం. విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలను తెలుసుకోవడానికి రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఆ ప్రాంతానికి పంపించాం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్ర వైద్య బృందం కూడా పాఠశాలకు వెళ్లింది. ఆహార పదార్థాలు, తాగునీటి శాంపుల్స్‌ను సేకరించింది. త్వరలోనే నివేదికలు అందించనున్నారు. ఇంకా ఎవరైనా బాలికలు అనారోగ్యంతో బాధపడుతుంటేవారిని తల్లిదండ్రులు సమీప ఆసుపత్రికి తరలించాలి.’ నాటు వైద్యం ప్రమాదకరం. అత్యవసర సమయాల్లో సీహెచ్‌సీ, పీహెచ్‌సీల ద్వారా వైద్య సేవలు పొందాలి. ఆర్‌ఎంపీలు, నాటు వైద్యుల వద్దకు వెళ్లరాదు. అంబులెన్స్‌లతో పాటు ఐటీడీఏల నుంచి కూడా ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చాం.’ అని తెలిపారు. ఆయన వెంట జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి , డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణరావు, సూపరింటెండెంట్‌ నాగశివజ్యోతి, చిన్న పిల్లల వైద్య నిపుణుడు గణేష్‌ చైతన్య తదితరులు ఉన్నారు.

కురుపాంలో ప్రత్యేక వైద్య పరీక్షలు ...

- డీఎంహెచ్‌వో భాస్కరరావు పర్యవేక్షణలో కురపాంలో విద్యార్థినులకు శుక్రవారం రక్త పరీక్షలు నిర్వహించారు. బాలికల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి ఆ పాఠశాలకు చేరుకుని విద్యార్థినులు, తల్లిదండ్రులు, వైద్య సిబ్బందితో మాట్లాడారు. వారికి అందిస్తున్న వైద్య సేవలపై డీఎంహెచ్‌వోతో చర్చించారు. బాలికలతో సహా తల్లిదండ్రులందరూ రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సెలవుల్లో ఇంటికి వెళ్లిన విద్యార్థినులు సరైన వైద్యం చేయించుకోపవడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. శుక్రవారం ఎనిమిది మందిని కురుపాం ఆసుపత్రి నుంచి పార్వతీపురం జిల్లా ఆసుపత్రి పంపించామన్నారు. పాఠశాలకు కొత్త ఆర్‌వో ప్లాంట్‌ కోనుగోలు చేశామని వెల్లడించారు.

- కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థినులు పచ్చకామెర్లతో బాధపడుతున్నట్లు వైదులు నిర్ధారించారు. శుక్రవారం విజయవాడ నుంచి వచ్చిన ముగ్గురి వైద్యులతో పాటు విజయనగం మెడికల్‌ కళాశాలకు చెందిన నాలుగురు డాక్టర్ల బృందం పాఠశాలను పరిశీలించింది. కురుపాం ఆసుపత్రిలో డాక్టర్లతో మాట్లాడారు. కలుషిత నీరే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు.

యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం

‘కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థినుల్లో కొంతమంది పచ్చకామెర్లతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని.. వెంటనే కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడాం. జిల్లా అధికార యంత్రాంగాన్ని అమ్రపత్తం చేశాం. ఇప్పటికే ఇద్దరు బాలికలు పచ్చకామెర్ల లక్షణాలతో మృతి చెందడం బాధాకరం. మరికొంతమంది జాండీస్‌తో బాధపడుతుండడంతో వైద్య సిబ్బంది బాలికలందరికీ రక్త పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర వైద్య బృందం ఆ పాఠశాలను సందర్శించింది. త్వరలోనే నివేదిక అందించనుంది. దసరా సెలవుల నిమిత్తం ఇళ్లకు వెళ్లిన బాలికలు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటాం. ముందుగా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేశాం. ’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

Updated Date - Oct 04 , 2025 | 01:10 AM