మెనూ నాణ్యతపై కమిటీ
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:04 AM
Committee on Menu Quality ఏరియా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత ఏ మేర పాటిస్తున్నదీ పరిశీలిస్తామని, సమగ్రంగా విచారించి అక్రమాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి ఎన్‌పీ పద్మశ్రీ స్పష్టం చేశారు. ఇందుకోసం ఒక కమిటీ వేస్తున్నట్లు చెప్పారు.

మెనూ నాణ్యతపై కమిటీ
సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు
రోగుల భోజనంలో నిబంధనలు పాటించాల్సిందే
అత్యంత అరుదైన కేసులనే రిఫర్ చేయాలి
డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
గజపతినగరం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఏరియా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత ఏ మేర పాటిస్తున్నదీ పరిశీలిస్తామని, సమగ్రంగా విచారించి అక్రమాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి ఎన్‌పీ పద్మశ్రీ స్పష్టం చేశారు. ఇందుకోసం ఒక కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లేకపోవడంపై ఈ నెల 6న ఆంధ్రజ్యోతిలో ‘ఉడకని అన్నం.. పాచిపోయిన కూర’ శీర్షికన కథనం వచ్చిన సంగతి విదితమే. దీనిపై వైద్యాధికారులతో పాటు కలెక్టర్ కూడా సీరియస్ అయ్యారు. వెంటనే విచారించి ఆస్పత్రుల్లో పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు. ఇందులో భాగంగా డీసీహెచ్‌ఎస్ గజపతినగరం ఏరియా ఆస్పత్రిని గురువారం సందర్శించారు. జిల్లాలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈమె మొదటిరోజే గజపతినగరం ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వార్డుల్లో రోగులకు అందజేస్తున్న ఆహారం, వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. రోగులకు అందిస్తున్న భోజనంలో ఎటువంటి నాణ్యత పాటిస్తున్నారు.. మెనూ అమలు చేస్తున్నారా.. లేదా అన్నదానిపై కమిటీ వేసి విచారణ చేపడ్తామన్నారు. కమిటీ నివేదిక వచ్చాక ఆస్పత్రుల్లో అక్రమాలు, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. అలాగే సమయానికి వైద్యులు వస్తున్నారా లేదా.. రోగులకు ఎటువంటి సేవలు అందుతున్నాయి.. తదితర వివరాలపై ప్రతిరోజూ వైద్యశాఖ డైరెక్టర్‌కు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ సమాచారం అందిస్తామన్నారు. జిల్లాలో అన్ని ఆసుపత్రులను సందర్శించి వైద్యసేవలను పరిశీలిస్తామన్నారు. సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. జిల్లాలో అధికంగా గర్భిణులను రిఫర్ చేయడం సరికాదని, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో తమ చేయిదాటి పోతుందని అనుకున్న కేసులను మాత్రమే రిఫర్ చేయాలని వైద్యాధికారులకు చెప్పామన్నారు. ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్టులు ఆయా ప్రాంతాల్లోని పీహెచ్‌సీ వైద్యులతో సమయన్వయంతో మెలగాలన్నారు. కొత్తగా గర్భిణి కేసు నమోదు అయ్యాక ప్రసవం అయ్యేంతవరకు ఎటువంటి వైద్యం అందజేస్తున్నదీ అందరికీ తెలిసేలా గ్రూప్ కాల్ ఏర్పాటు చేసుకోవాలని, అందులో తనను చేర్చాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో పాటు గుండె జబ్బు నివారణకు ప్రతీ ఆసుపత్రిలో మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోందన్నారు. మే నాటికి వందపడకల ఆసుపత్రిగా ఏరియా ఆస్పత్రి మారుతుందని, రోగులకు మరింత మెరుగైన వైద్యం అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట సీనియర్ జిల్లా వైద్యులు రాజ్యలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.