coming sirimanu tree to vizianagaram అడుగడుగునా నీరా‘జనం’
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:04 AM
coming sirimanu tree to vizianagaram విజయనగరం జై పైడిమాంబ నామస్మరణతో మార్మోగింది. సిరిమాను చెట్టుకు అడుగడుగునా నీరాజనం పలికిన భక్తులతో పులకించింది. పైడిమాంబ సిరిమాను చెట్టు ఊరేగింపు గంట్యాడ మండలం తామరాపల్లిలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలైంది.
అడుగడుగునా నీరా‘జనం’
సిరిమాను చెట్టుకు దారి పొడవునా పూజలు చేసిన భక్తులు
స్వల్ప అటంకం అనంతరం విజయనగరం చేరిక
విజయనగరం రూరల్/కల్చరల్, సెప్టెంబరు 24: విజయనగరం జై పైడిమాంబ నామస్మరణతో మార్మోగింది. సిరిమాను చెట్టుకు అడుగడుగునా నీరాజనం పలికిన భక్తులతో పులకించింది. పైడిమాంబ సిరిమాను చెట్టు ఊరేగింపు గంట్యాడ మండలం తామరాపల్లిలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలైంది. రాత్రి 8.45 గంటలకు విజయనగరం చేరుకుంది. సిరిమాను రాకకోసం భక్తులు దారిపొడవునా పసుపునీళ్లతో ఎదురుచూశారు. ప్రతి కూడలి వద్ద సిరిమానుకు పూజలు చేసి పసుపు నీళ్లలో అభిషేకాలు చేశారు. సాయంత్రం నుంచి సిరిమాను ఎప్పుడు వస్తుందా? అని చిన్న,పెద్ద అంతా రోడ్లపైనే వేచి ఉన్నారు. దాదాపు 25 కిలోమీటర్ల దూరం నుంచి సిరిమాను, ఇరుసుమాను చెట్లను నాటుబళ్లపై విజయనగరం తరలించారు. ఊరేగింపులో సాంస్కృతిక ప్రదర్శనలు, పులివేషాలు, బ్యాండు మేళాలు సందడి చేశాయి. విజయనగరం చేరుకున్న సిరిమాను కలెక్టరేట్ మీదుగా పోలీసు బ్యారక్స్, మహారాజా ఆసుపత్రి కూడలి, ఆర్‌అండ్‌బీ జంక్షన్, ఎత్తుబ్రిడ్జి మీదుగా రైల్వే స్టేషన్ రోడ్డు, వనంగుడి నుంచి ముందుకు సాగింది. అక్కడి నుంచి ఎన్‌సీఎస్ రోడ్డు, డాబాగార్డెన్ మీదుగా కన్యకాపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం, ఎంజీ రోడ్డు, చదురుగుడి ముందు పక్కకు తిరిగి శివాలయం మీదుగా హుకుంపేటకు చేరుకుంది. ఆ సమయానికి హుకుంపేట వాసులు కూడా భారీ ఎత్తున హాజరై సిరిమానుకు పూజలు చేశారు. హుకుంపేటకు సిరిమాను చెట్టు రాత్రి 11.45 గంటలకు చేరింది.
- గంట్యాడలోని కొండతామరాపల్లి నుంచి బయలుదేరిన సిరిమాను విజయనగరం సమీపంలోని రామవరం జాతీయ రహదారి వంతెన కిందకు వచ్చేసరికి సిరిమాను తరలించే బండి చక్రం బరువుకు ఇరిగిపోయింది. దీంతో బండి కదలడానికి అటంకం ఏర్పడింది. వెంటనే నిలిపేసి పాత చక్రాన్ని తొలగించి మరో చక్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సిరిమాను, ఇరుసుమానులతో బయలుదేరిన బళ్లు, మెలమెల్లగా విజయనగరం చేరుకున్నాయి.
కొండతామరాపల్లిలో కోలాహలం
గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లి గ్రామంలో సిరిమానుచెట్టుకు గురువారం ఉదయం 8.30 గంటలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గొడ్డలితో గాట్లు పెట్టి చెట్టు తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30కు చెట్టును మొదలు నుంచి వేరు చేశారు. ఇరుసుమాను చెట్టును కూడా తొలగించారు. పూజలు చేసిన అనంతరం మూడు గంటల సమయలో చెట్ల తరలింపు నాటు బళ్లపై ప్రారంభమైంది.