Come to our school మా బడికి రండి
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:42 PM
Come to our school ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు సరికొత్త వేడుకలకు సిద్ధమవుతున్నాయి. పాఠశాలల్లో పండుగను తలపించే విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం జరగనున్న ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మా బడికి రండి
తల్లిదండ్రులను ఆహ్వానించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
నేడు విద్యాలయాల్లో పేరెంట్ టీచర్ మీటింగ్
2.50 లక్షల మంది తల్లిదండ్రులతో కార్యక్రమం
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వం
పార్వతీపురం మన్యం జిల్లాలో ముఖ్యమంత్రి హాజరు
విజయనగరం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు సరికొత్త వేడుకలకు సిద్ధమవుతున్నాయి. పాఠశాలల్లో పండుగను తలపించే విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం జరగనున్న ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిల్లలే ఆహ్వాన పత్రికలను తల్లిదండ్రులకు అందించారు. వాట్సాప్‌తో పాటు ఇతర డిజిటల్ మీడియాలో తల్లిదండ్రులకు పాఠశాల తరపున ఆహ్వానాలు అందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మంది తల్లిదండ్రులు, మరో 50 వేల మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే జూలై 10న సమావేశం నిర్వహించగా.. మరోసారి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఈ సమావేశాలు కొనసాగేవి. ఈసారి ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో సైతం నిర్వహిస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1452, ప్రాథమికోన్నత పాఠశాలలు 319, ఉన్నత పాఠశాలలు 464 ఉన్నాయి. జూనియర్ కాలేజీలు 67 ఉండగా.. మొత్తం విద్యార్థులు 2,24,051 మంది ఉన్నారు. విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమావేశాలు నిర్వహించనున్నారు. విద్యార్థి ఎలా చదువుతున్నాడు? మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు బోధనలో ఎటువంటి మార్పులు చేయాలి? తదితర అంశాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారి అభిప్రాయాలను పంచుకుంటారు. పరీక్షల్లో సాధిస్తున్న మార్కులు, ఆరోగ్య సమాచారంతో కూడిన ప్రొగ్రెస్ రిపోర్టు కూడా అందిస్తారు. పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ తీరును సైతం చర్చిస్తారు.
మార్గదర్శకాలు ఇలా..
సమావేశ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. విద్యార్థులు విధిగా యూనిఫాం, బెల్ట్, సాక్సులు, బూట్లు ధరించాలి. హెచ్‌ఎంలు సమకూర్చిన కార్డులు, పెయింట్లు, కలర్ పెన్సిళ్లతో ఆహ్వానపత్రికలు తయారు చేయించారు. మరోవైపు బడులను అందంగా తీర్చిదిద్దారు. ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా అందిస్తారు.
స్వాగతోపాన్యాసంతో..
పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు, పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ సమావేశాల్లో పాల్గొంటారు. అదే సమయంలో అన్నిచోట్ల ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటలకు స్వాగతోపాన్యాసంతో మొదలవుతుంది. మధ్యాహ్నం 12.45 గంటల వరకూ కొనసాగుతుంది. స్వాగతోపాన్యాసం తరువాత మాతెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపిస్తారు. తరువాత విద్యార్థులతో శతక పద్యాలు, కథలను చెప్పిస్తారు. ఫార్మెటివ్ 1,2లకు సంబంధించి మార్కుల జాబితా నివేదికను అందిస్తారు. వైద్య పరీక్షలకు సంబంధించి అందులోనే పొందుపరుస్తారు. సబ్జెక్టుల వారీగా ప్రమాణస్థాయి, వెనుకబడిన వారి విషయంలో తీసుకుంటున్న చర్యలు, దృష్టిపెట్టాల్సిన అంశాల గురించి అందులో వివరిస్తారు. చివరిగా ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను చదివి వినిపిస్తారు.
తల్లిదండ్రులంతా రావాలి
ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత
ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు తల్లిదండ్రులంతా తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత కోరారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన డీఆర్‌సీ సమావేశంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌పై ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థులకు విద్యతోపాటు మంచినడవడిక కూడా అలవాటు పడాలంటే ఈ కార్యక్రమానికి తప్పకుండా తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలన్నారు.
తల్లిదండ్రులే మొదటి గురువులు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
తల్లిదండ్రులే మొదటి గురువులని, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు తప్పకుండా హాజరుకావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. గురువారం నిర్వహించిన డీఆర్‌సీ సమావేశంలో దీనిపై మాట్లాడారు. పిల్లలకు నాయకత్వ లక్షణాలు ఇప్పటినుంచే అలవడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇటీవల మాక్ అసెంబ్లీ నిర్వహించారని గుర్తుచేశారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌కు వస్తే పిల్లలపై సమగ్ర అవగాహన వస్తుందన్నారు.
పండుగ వాతావరణంలో మీటింగ్
పేరెంట్, టీచర్స్ మీటింగ్‌ను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నాం. జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద నడుస్తున్న 1771 పాఠశాలలు, 67 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు, లక్షన్నర మంది పేరెంట్స్, మరో 50 వేల మంది అతిథులు పాల్గొంటారు. అందరికీ ఆహ్వానాలను విద్యార్థులతోనే పంపించాం.
- కలెక్టరు రామసుందర్ రెడ్డి
=========
రూ.37.58 లక్షలు విడుదల
విజయనగరం కలెక్టరేట్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): విద్యాలయాల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 నిర్వహణకు ప్రభుత్వం జిల్లాకు రూ.37.58లక్షలు విడుదల చేసింది. ఈ నిధులు ప్రధానోపాధ్యాయుల ఖాతాలకు జమకానున్నాయి. కొన్ని జిల్లాలోని పాఠశాలలకు ఇప్పటికే నిధులు విడుదలయ్యాయి. పాఠశాలకు వచ్చే తల్లిదండ్రులకు, ప్రజా ప్రతినిధులకు మధ్యాహ్నం భోజనం అందిస్తారు. విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రోగ్రస్ రిపోర్టులను సిద్ధం చేశారు. హెల్త్ కార్డులు కూడా అందజేయనున్నారు. జిల్లాలోని 1771 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఆశ్రమ, ఆదర్శ పాఠశాలలతో పాటు 67 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులే సొంతంగా ఆహ్వాన పత్రాలను రూపొందించి తలిదండ్రులను సమావేశాలకు ఆహ్వానించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులను సైతం విద్యార్థులే ఆహ్వానిస్తారు.