స్నేహితులతో సరదాగా గడిపేందుకు వచ్చి..
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:45 AM
స్నేహితుల దినోత్సవం రోజున తన స్నేహి తులతో కలిసి సరదాగా గడిపేందుకు మండలంలోని జాగరం వాటర్‌ఫాల్స్‌కు వచ్చిన ఓ యువకుడు ఊబిలో చిక్కుకుని మృతిచెందాడు.
జామి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): స్నేహితుల దినోత్సవం రోజున తన స్నేహి తులతో కలిసి సరదాగా గడిపేందుకు మండలంలోని జాగరం వాటర్‌ఫాల్స్‌కు వచ్చిన ఓ యువకుడు ఊబిలో చిక్కుకుని మృతిచెందాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ వీరజనార్ధన్ మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బొడ్డుపాలెం గ్రామానికి చెందిన సాడి లక్ష్మణరెడ్డి(32) సోమవారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా మిత్రులతో కలిసి జామి మండలంలోని జాగరం వాటర్‌పాల్స్‌కు వచ్చాడు. స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొడుతూ గడిపాడు. అయితే సాయంత్రం ఆరుగంటల సమయంలో బహిర్భూమికి వెళ్లి పక్కన ఉన్న నీటితో శుభ్రం చేసుకునే సమయంలో కాలుజారి ఊబిలో పడిపోయాడు. ఇది గమనిం చిన స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ జాడ కానరాలేదు. అయితే మంగళవారం ఉదయం మరోసారి వెతికే ప్రయత్నం చేయగా మృతదేహం కనిపించింది. స్నేహితులతో సరదాగా గడపడానికి వెళ్లిన తన భర్త చనిపోవడం తో భార్య అరుణ రోధన చూపరులను కంటతడి పెట్టించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడు విశాఖలోని రామాటాకీస్ ఏరియాలో ఉన్న ఎక్సెల్ వరల్డ్‌లో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడని స్నేహితులు తెలిపారు.