Share News

టాప్‌ 3లో కలెక్టర్‌

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:37 AM

ప్రభుత్వం పాలనలో దూకుడు పెంచింది. 18 నెలలు పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు తీయిస్తోంది. ప్రజల్లో సంతృప్తి శాతాన్ని పెంచాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

టాప్‌ 3లో కలెక్టర్‌

  • 4వ స్థానంలో జాయింట్‌ కలెక్టర్‌

  • మంత్రి కొండపల్లికి పదో స్థానం

  • ఫైళ్ల క్లియరెన్స్‌లో ర్యాంకులు

  • అభివృద్ధి, సుపరిపాలనకు దోహదం

విజయనగరం/కలెక్టరేట్‌ డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పాలనలో దూకుడు పెంచింది. 18 నెలలు పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు తీయిస్తోంది. ప్రజల్లో సంతృప్తి శాతాన్ని పెంచాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. జిల్లా మంత్రితో పాటు కలెక్టర్‌, జేసీ పనితీరు, ఫైళ్ల క్లియరెన్స్‌పై ర్యాంకింగ్స్‌ ఇచ్చారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ క్యాబినెట్‌లో పదో స్థానాన్ని దక్కించుకున్నారు. తన శాఖకు సంబంధించి 16 నెలల 24 రోజుల కాలంలో వచ్చిన 269 ఫైళ్లకు పరిష్కార మార్గం చూపించారు. జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది సెప్టెంబరు 9 తేదీ నుంచి ఈనెల 9 తేది వరకు మూడు నెలల వ్యవధిలో 18 గంటల 13 నిమిషాల వ్యవధిలో 791 ఫైళ్లను క్లియరెన్స్‌ చేసి రాష్ట్రంలోనే తొలి ముగ్గురు కలెక్టర్లలో ఈయన ఒకరుగా నిలిచారు. వివిధ శాఖల నుంచి ఈ ఆఫీసులో వస్తున్న పైళ్లను తన ల్యాప్‌టాప్‌లో చూసి వెంటనే క్లియర్‌ చేస్తున్నారు. కింది శాఖల నుంచి వస్తున్న వెంటనే పరిష్కరించడం, అవసరమైతే ప్రభుత్వ దృష్టికి పంపిచేస్తున్నారు. అలాగే జాయింట్‌ కలెక్టరు సేతు మాధవన్‌ కూడా 27 గంటల వ్యవధిలో 703 ఈ ఆఫీసు ఫైళ్లను క్లియర్‌ చేశారు. దీంతో ఈయనకు నాలుగో స్థానం దక్కింది.

గతానికి భిన్నంగా..

ప్రస్తుతం జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య చక్కటి సమన్వయం ఉంది. పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌, వాట్సాప్‌ ఈగవర్నెన్స్‌ ద్వారా 500 రకాల పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సంక్రాంతి తరువాత ఈ గవర్నెన్స్‌ సేవలు అందించాలని భావిస్తోంది. ఆన్‌లైన్‌ పాలన సాగించాలనుకుంటున్న తరుణంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు మధ్య చక్కటి సమన్వయం కనిపిస్తోంది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు శాఖల వారీగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. పల్లెపండుగ 2.0, పంచాయతీరాజ్‌ రోడ్ల అభివృద్ధి, కేంద్ర ప్రాయోజిత పథకాలు.. ఇలా అన్నింటిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇంకోవైపు ప్రజల్లో సంతృప్తి శాతం పెంచుకొవాలని చూస్తోంది. ఆ దిశగా ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.

బాధ్యత పెంచింది..

ఫైళ్ల క్లియరెన్స్‌లో 10వ ర్యాంకు రావడం బాధ్యతను పెంచింది. జిల్లాలో ప్రజల సంతృప్తిని మరింత అందుకునే వీలుగా పాలన అందిస్తాం. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళతాం. ప్రతి శాఖ విభాగాధిపతులు, అధికారులు బాధ్యతతో పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి.

- కొండపల్లి శ్రీనివాస్‌, మంత్రి

అందరి సహకారంతో..

జిల్లా కలెక్టర్‌గా చిత్తశుద్ధితో కృషిచేస్తా. ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించి సమన్వయంతో వెళితేనే ప్రగతి సాధ్యం. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాక తప్పదు. రాష్ట్రస్థాయిలో వచ్చిన ఈర్యాంక్‌ బాధ్యతను మరింత పెంచింది.

- రామసుందర్‌ రెడ్డి కలెక్టర్‌, విజయనగరం

Updated Date - Dec 12 , 2025 | 12:37 AM