Coconut rates hike కొండెక్కిన కొబ్బరి
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:55 PM
Coconut rates hike కొబ్బరికాయ ధరలు కొండెక్కుతున్నాయి. వరుస పండుగలు ఉండడంతో ఈ ధరలు మరింత ప్రియం కానున్నాయి. వారం కిందట రూ.20కే లభించే కొబ్బరికాయ నేడు రూ.40 పలుకుతోంది. ఇంకా పెద్దది కావాలంటే మరో రూ.10 వెచ్చించాల్సి వస్తోంది
కొండెక్కిన కొబ్బరి
రూ.40కు పైనే చెబుతున్న వ్యాపారులు
వరుస పండుగల నేపథ్యంలో కాయల ధర మరింత ప్రియం
ఉభయగోదావరి జిల్లాల నుంచి దిగుమతి
విజయనగరం రూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కొబ్బరికాయ ధరలు కొండెక్కుతున్నాయి. వరుస పండుగలు ఉండడంతో ఈ ధరలు మరింత ప్రియం కానున్నాయి. వారం కిందట రూ.20కే లభించే కొబ్బరికాయ నేడు రూ.40 పలుకుతోంది. ఇంకా పెద్దది కావాలంటే మరో రూ.10 వెచ్చించాల్సి వస్తోంది. దసరా శరన్నవరాత్రులు, పైడిమాంబ సిరిమాను జాతర సమయంలో కొబ్బరికాయల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని భక్తులు భావిస్తున్నారు. గతంలో కొబ్బరికాయలు జిల్లాలో విరివిగా లభించేవి. ప్రస్తుతం జిల్లాలో సాగయ్యే కొబ్బరి అంతా బొండాల రూపంలో అమ్ముడవుతోంది. దీంతో స్థానికంగా కాయలు లభించడం లేదు. ప్రస్తుత హోల్‌సేల్ మార్కెట్‌గా పేరొందిన తూర్పుగోదావరి నుంచి కొబ్బరికాయలు దిగుమతి అవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో అమలాపురం, రాయవరం, అడ్డురోడ్డు తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు కొబ్బరికాయలు చేరుతున్నాయి. అదే విధంగా ఆయా ప్రాంతాల నుంచే ఒడిశా, చెన్నై ప్రాంతాలకు వెళ్తున్నాయి. తమిళనాడులోనూ కొబ్బరి పంట దెబ్బతిన్నది. దీంతో ఆయా ప్రాంతాల వారు ఉభయగోదావరి జిల్లాల నుంచే కొబ్బరికాయలు దిగుమతి చేసుకుంటున్నారు. హోల్‌సేల్ ధర ప్రకారం కాయ ఒక్కంటికీ రూ.28, రూ.30 నుంచి రూ.35 వరకూ ధర ఉంది. గతంలో ఈ ధరలు రూ.5 నుంచి రూ.10 వరకూ తగ్గేవి. రానున్న రోజుల్లో కొబ్బరికాయల కొరత ఏర్పడే అవకాశం వుంది. దీంతో ధరలు కూడా పెరుగుతాయన్న అభిప్రాయం వ్యాపారుల నుంచి వ్యక్తమౌతున్నది. దసరా శరన్నవరాత్రులు, అనంతరం పైడిమాంబ పండుగ, కార్తీకమాసం ఇలా వరుస పండుగ సీజన్‌లు కావడంతో కొబ్బరికాయలకు డిమాండ్ పెరగనుంది. రిటైల్‌లో కొబ్బరికాయ ధర రూ.40నుంచి రూ.50 పలుకుతోంది. అదే విధంగా కొబ్బరినీళ్లు తాగే బొండాల ధరలు కూడా అదే తరహాలో కొనసాగుతున్నాయి. ఒక కొబ్బరి బొండాం రూ.40 నుంచి రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. లీటరు కొబ్బరినీళ్లు కావాలంటే రూ.130 నుంచి రూ.150వరకూ విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. డిమాండ్ వున్నా, సప్లయ్ తక్కువగా వుండడం వల్ల కొబ్బరికాయల ధర రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
--------------