Coast in sad situation తీరం.. కలవరం
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:31 AM
Coast in sad situation వేటకు వెళ్లి వచ్చే మత్స్యకారులతో సందడిగా కనిపించే సాగర తీరంలో కలవరం నెలకొంది. బుధవారం రోజంతా నిశ్శబ్దం అలముకుంది. వేటకు వెళ్లిన ఎనిమిది మంది జిల్లా మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కిన సమాచారం తెలిసిన వెంటనే మత్స్యకార గ్రామాలన్నీ ఆవేదనకు లోనయ్యాయి. వారి క్షేమ సమాచారం కోసం వారంతా కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. నాయకులకు ఫోన్ చేసి తమ వారిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కోరుతున్నారు. వారి కుటుంబ సభ్యులు మరింత ఆత్రంతో ఎదురుచూస్తున్నారు.
తీరం.. కలవరం
బంగ్లాదేశ్ కోస్టుగార్డ్ ఆధీనంలో 8 మంది జిల్లా మత్స్యకారులు
వేటాడుతూ పొరపాటున చిక్కన వైనం
ఆందోళనలో వారి కుటుంబాలు
ప్రభుత్వానికి విన్నపాలు
క్షేమంగా తీసుకువస్తామన్న కలెక్టర్
వేటకు వెళ్లి వచ్చే మత్స్యకారులతో సందడిగా కనిపించే సాగర తీరంలో కలవరం నెలకొంది. బుధవారం రోజంతా నిశ్శబ్దం అలముకుంది. వేటకు వెళ్లిన ఎనిమిది మంది జిల్లా మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కిన సమాచారం తెలిసిన వెంటనే మత్స్యకార గ్రామాలన్నీ ఆవేదనకు లోనయ్యాయి. వారి క్షేమ సమాచారం కోసం వారంతా కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. నాయకులకు ఫోన్ చేసి తమ వారిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కోరుతున్నారు. వారి కుటుంబ సభ్యులు మరింత ఆత్రంతో ఎదురుచూస్తున్నారు.
విజయనగరం/భోగాపురం/ పూసపాటిరేగ, అక్టోబరు22(ఆంధ్రజ్యోతి):
భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన మరుపల్లి చిన్నఅప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, ఎం.చిన్నఅప్పన్న, పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్కా రాము, వాసపల్లి సీతయ్యలు విశాఖపట్నంలోని జాలరుపేటలో తాత్కాలికంగా నివాసముంటున్నారు. ఈ 8 మంది మత్స్యకారులు వడ్డాది సత్యనారాయణకు చెందిన పడవపై ఈనెల 13న విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు బయలుదేరారు. సముద్రంలో వేట సాగిస్తూ సిగ్నిల్స్ అందకో.. వాతావరణం అనుకూలించకో బుధవారం వేకువజామున సుమారు 2గంటల సమయంలో సముద్రంలో బంగ్లాదేశ్ సరిహద్దు దాటేశారు. దీనిని గుర్తించిన బంగ్లాదేశ్ కోస్టుగార్డు సిబ్బంది పడవతో పాటు 8 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకొన్నారు. అంతకు కొద్దిక్షణాల ముందు పడవలో ఉన్న మత్స్యకారులు వాకీటాకీ ద్వారా సముద్రంలో దూరంగా వేట సాగిస్తున్న తమ సహచరులకు తాము బంగ్లాదేశ్‌కు చిక్కిన విషయం తెలియజేశారు. వారు మత్స్యకారుల కుటుంబీకులకు, కొండ్రాజుపాలెంకు చెందిన నాయకుడు చిన్నారావుకు సమాచారం అందించారు. ఆపై నేతలు, అధికారులకు విషయం తెలియజేశారు. కాగా బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు మత్స్యకారులు చిక్కినట్లు తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కిన విషయమై హోంశాఖకు విన్నవించామని, వారిని క్షేమంగా ఇంటికి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లామని, మత్స్యకార కుటుంబాలు దైర్యంగా ఉండాలని మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు కోరారు.
- కోస్టుగార్డుకు చిక్కిన వారిలో మరుపల్లి ప్రవీణ్‌కు ఇంకా వివాహం కాలేదు. వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. మరుపల్లి రమేష్, చిన్నప్పన్న ఇద్దరు అన్నదమ్ములు. వీరిలో రమేష్‌కు ఇంకా వివాహం కాలేదు. చిన్నప్పన్నకు ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నారు. సూరాడ అప్పలకొండకు వివాహమై ఏడాది అవుతోంది. సురపతి రాముకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాసుపల్లి సీతయ్యకు భార్య ఎర్రమ్మ, ఇద్దరు పిల్లలు ఉండగా, నక్కా రమణకు భార్య ఎల్లయ్యమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.