1న దత్తిలో సీఎం పర్యటన
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:02 AM
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో అక్టోబరు 1న జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
పింఛన్‌దారులతో ముఖాముఖి
పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం కలెక్టరేట్/దత్తిరాజేరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో అక్టోబరు 1న జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆదివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దత్తిలోని నాలుగు గృహాల వద్దకు ముఖ్యమంత్రి వెళ్లి నలుగురికి పింఛన్ పంపిణీ చేస్తారని తెలిపారు. అనంతరం పింఛనుదారులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని, దీనికి దత్తి గ్రామానికి చెందిన ప్రజలే హాజరవుతారని చెప్పారు. సీఎం వెళ్లే గృహాలకు విద్యుత్ తనిఖీలు నిర్వహించాలని ఆ శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రజావేదిక వద్ద మంచి కండిషన్‌లో ఉన్న అంబులెన్సు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర మందులు సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. తాగునీటి సరఫరా, ఆహారం, బందోబస్తు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు బాగుండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
దత్తి గ్రామంలో హెలీప్యాడ్ స్థలం, రూట్‌మ్యాప్‌లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. యుద్ధప్రాతిపదికన వీధుల్లో చెత్తను తొలగించాలని, కాలువలను శుభ్రం చేయాలని, రోడ్లను మరమ్మతు చేయాలని, గోతులను పూడ్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేయనుండడంతో, లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి వారి పేర్లను ఖరారు చేశారు. బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాన్ని సందర్శించి వేదిక ఏర్పాట్లపై చర్చించారు. వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. వీఐపీ లాంజ్‌ను పరిశీలించారు. వాహనాల పార్కింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక జడ్పీ పాఠశాలలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, టీడీపీ మండల అధ్యక్షుడు చప్ప చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
యంత్రాంగం ఉరుకులు పరుగులు
విజయనగరం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రధానమైన మూడు ఉత్సవాలు ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయి. వీటికంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంది. ఈ నాలుగు కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు, బందోబస్తు వంటివి నిర్వహించడం జిల్లా అధికార యంత్రాంగానికి కత్తిమీదసాములా మారింది. ఈ కార్యక్రమాలకు సమయం దగ్గరపడుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగానికి ఉరుకులు..పరుగులు తప్పడం లేదు. కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి 15రోజులు పూర్తికాలేదు. అదే విధంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ కూడా కొత్తవారే. ఈ నేపథ్యంలో అక్టోబరు 1న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గజపతినగరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 2న దసరా వేడుకలను జిల్లా వాసులు ఘనంగా జరుపుకోనున్నారు. అనంతరం నాలుగు రోజుల వ్యవధిలో అంటే 6న విజయనగరం ఉత్సవాలు, మరుసటి రోజు 7న పైడిమాంబ సిరిమానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాలన్నీ యంత్రాంగానికి ప్రతిష్టాత్మకమే. భారీ బందోబస్తు, చక్కటి ప్రణాళికతో ఈ కార్యక్రమాలు చేయాల్సిందే. విజయనగరం, పైడిమాంబ ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం మానసికంగా సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్ అన్ని శాఖలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పలు సూచనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ, బందోబస్తు వంటి విషయాల్లో ఎంటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే, తక్కువ కాలంలోనే మూడు ప్రాధాన్యత కార్యక్రమాల నిర్వహణ వారికి కత్తిమీదసామే.
2 వేల మంది పోలీసులతో బందోబస్తు
విజయనగరం క్రైం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ తొలేళ్లు, సిరిమాను ఉత్సవాలకు ఎస్పీ ఎఆర్ దామోదర్ పర్యవేక్షణలో 2వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. వీరిలో అదనపు ఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు ఎనిమిది మంది, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. బాడీ కెమెరాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరాలను మూడు లాంతర్లు వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వీటికి అనుసంధానమై ఉంటాయి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతామరాజు జిల్లాలకు చెందిన పోలీసులు బందోబస్తు కోసం అక్టోబరు 4నే చేరుకోనున్నారు. సిరిమాను తిరిగే రోడ్లను డీఐజీ గోపీనాథ్ జట్టీ ఇప్పటికే పరిశీలించారు.