గిరిజనుల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:56 PM
గిరిజనుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎస్.సదాభార్గవి అన్నారు.
- రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ భార్గవి
- జీవో నెంబర్-3పై అభిప్రాయ సేకరణ
పార్వతీపురం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎస్.సదాభార్గవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో నెంబర్-3పై గిరిజన అభి ప్రాయాలను తెలుసుకునేందుకు గురువారం పార్వతీపురం ఐటీడీఏలోని గిరిమిత్ర సమావేశ మందిరంలో గిరిజన సంఘాలు, గిరిజన ఉపాధ్యాయ, ఉద్యోగ, న్యాయవాద సంఘాలు, తదితరులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నట్టు తెలిపారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనుల కోసం తీసుకువచ్చిన జీవో నెంబర్-3ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీన్ని పునరుద్ధరించాలని వివిధ గిరిజన సంఘాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతాల్లో అభిప్రాయాలు సేకరించాలని చెప్పింది. వచ్చిన అభిప్రాయాల్లో ముఖ్యమైన వాటిని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తాం. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, గిరిజన సంక్షేమశాఖా మం త్రి సంధ్యారాణి, ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌లతో చర్చించాం. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు గిరిజనులకు ఎదురుకా కుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యం’ అని సదా భార్గవి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ న్యాయ సలహాదారు పల్లా త్రినాథరావు, ఏపీవో ఎ.మురళీధర్, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఆర్.కృషవేణి తదితరులు పాల్గొన్నారు.
ఎవరెవరు ఏమన్నారంటే..
రాజ్యాంగ సవరణ చేసి జీవో నెంబర్-3కు చట్టబద్ధత కల్పించాలని మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ అన్నారు. గిరిజనులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. గిరిజనులకు సమానత్వం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఆచరణలో కనబడడం లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలని అన్నారు. గిరిజన సంఘ నాయకుడు ఆరిక విప్లవకుమార్ మాట్లాడుతూ.. ఐదో షెడ్యూల్డ్‌లో ఉన్న తమను ఆరో షెడ్యూల్డ్‌లోకి పంపేలా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని కోరారు. గిరిజనులకు అప్పుడే తగిన న్యాయం జరుగుతుందని అన్నారు. గిరిజన ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు గేదెల రామకృష్ణారావు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో జిల్లా యూనిట్‌గా తీసుకొని వంద శాతం గిరిజనులకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, గిరిజన భాషను నేర్చుకున్న వారికే ఉపాధ్యాయులుగా నియామకం చేపట్టాలని అన్నారు. సమజ సమాజ స్థాపనలో ఆదివాసీలకు అన్ని విధాలా సహకరిం చాలంటే షెడ్యూల్డ్ 5 (1), 5 (2)లపై ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్ కోరారు. గిరిజనులకు పూర్తిస్థాయిలో అన్నింటా ఉపయోగపడే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని చింతలగూడ సర్పంచ్ నిమ్మక సింహాచలం అన్నారు. రిటైర్డ్ సబ్ కలెక్టర్ కె.ధర్మారావు మాట్లాడుతూ.. రద్దు చేసిన జీవోను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.