Clouds Again మళ్లీ ముసురు
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:15 PM
Clouds Again జిల్లాలో వాతావరణం మారింది. కొద్దిరోజుల కిందట కురిసిన వానల నుంచి తేరుకునే లోపే మళ్లీ ముసురేసింది. అల్పపీడనం కారణంగా మంగళవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ప్రధాన రహదారులు, కూడళ్లు ముంపునకు గురయ్యాయి. పొలాలు కూడా జలమయమయ్యాయి.
జలాశయాలకు వరద
లోతట్టు ప్రాంతాలు జలమయం
మరో రెండు రోజులూ వర్షాలు కురిసే అవకాశం
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
జియ్యమ్మవలస/ వీరఘట్టం/ మక్కువ/ గరుగుబిల్లి/ సాలూరు రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాతావరణం మారింది. కొద్దిరోజుల కిందట కురిసిన వానల నుంచి తేరుకునే లోపే మళ్లీ ముసురేసింది. అల్పపీడనం కారణంగా మంగళవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ప్రధాన రహదారులు, కూడళ్లు ముంపునకు గురయ్యాయి. పొలాలు కూడా జలమయమయ్యాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే నాట్లు పడని పొలాల్లో వరి ఉబాలు పూర్తవుతాయని మరికొందరు చెబుతున్నారు. కాగా గత రెండు రోజులుగా కురుపాం, జియ్యమ్మవలస ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వానలకు వట్టిగెడ్డలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో స్పిల్‌వే ద్వారా 400 క్యూసెక్కులను విడుదల చేసినట్లు నీటి పారుదలశాఖ అధికారి బి.శంకరరావు తెలిపారు. ప్రస్తుతం గెడ్డలో 399.5 మీటర్ల (ఎఫ్‌ఆర్‌ఎల్) మేర నీటి నిల్వ ఉందని వెల్లడించారు. మరోవైపు లోతట్టు ప్రాంతవాసులను అప్రమత్తం చేయాలని తహసీల్దార్, పోలీస్ సిబ్బందికి తెలియజేశామన్నారు. జిల్లాతో పాటు ఎగువ ప్రాంతం ఒడిశా రాష్ట్రంలోనూ విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో వీరఘట్టం సమీపంలో ఉన్న ఒట్టిగెడ్డకు వరద పోటెత్తింది. కాగా తోటపల్లి కాలువ శివారు భూములకు పూర్తిస్థాయిలో నీరందనుందని రైతులు చెబుతున్నారు. మక్కువలో మంగళవారం సాయంత్రం ఎడతెరిపి లేని భారీ వాన కురిసింది. స్థానిక ప్రధాన రహదారికి ఇరువైపులా మురుగునీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూర గాయలు వి క్రయించే వారు తమ సరుకులను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. ఇక శంబర గ్రామ సమీపంలో ఉన్న వెంగళరాయసాగర్ నుంచి సువర్ణముఖి నదిలోకి వెయ్యి క్యూసెక్కులను విడిచి పెట్టారు. వరదనీరు ఇంకా చేరితే మరిన్ని క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తామని ఇరిగేషన్ జేఈ రాజశేఖర్ తెలిపారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జేఈ కోరారు. తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలోకి 5,500 క్యూసెక్కుల వరద చేరింది. అధికారులు అప్రత్తమై స్పిల్‌వే గేట్ల నుంచి 4 వేల క్యూసెక్కులను దిగువ ప్రాంతాలకు మళ్లించారు. సాగునీటికి సంబంధించి ప్రధాన కాలువల నుంచి 1,270 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 104.30 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. సాలూరు ఏజెన్సీలోనూ భారీ వర్షం కురిసింది. గోముఖి, సువర్ణముఖి, వేగావతి, నదులు, కొండ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.